తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ చేసిన ప్రయోగాత్మక సినిమా 'అయలాన్'. ఏలియన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తీశారు. తెలుగు వెర్షన్ కూడా థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. అనివార్య కారణాల వల్ల బిగ్ స్క్రీన్ రిలీజ్ అవ్వలేదు. తర్వాత ఓటీటీలోనూ కేవలం తమిళమే స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. మరి తెలుగు డబ్బింగ్ ఎప్పుడొస్తుందా అని చూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఎట్టకేలకు తెలుగు వెర్షన్ తీసుకొచ్చేస్తున్నారు.
శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఏలియన్ కామెడీ సినిమా 'అయలాన్'. 2024 సంక్రాంతికి తమిళంలో రిలీజైంది. అప్పుడే తెలుగు కూడా ప్లాన్ చేశారు. తర్వాత అప్పుడే జనవరి 26న తీసుకొస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌కి వచ్చిన శివకార్తికేయన్ ప్రమోషన్స్ కూడా చేశారు. కానీ పలు కారణాలతో విడుదల కాలేదు. తర్వాత తమిళ వెర్షన్‌ని సన్ నెక్స్ట్ ఓటీటీలోకి తీసుకొచ్చారు. తెలుగు డబ్బింగ్ గురించి ఏ సమాచారం లేదు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్ 'ఎకో'.. తెలుగు రివ్యూ)

కానీ గత నెల అంటే డిసెంబరులో తెలుగు వెర్షన్‌ని జీ తెలుగులో ప్రసారం చేశారు. ఇప్పుడు ఓటీటీ గురించి కూడా అప్‌డేట్ వచ్చేసింది. ఆహా లో రేపటి(జనవరి 07) నుంచి తెలుగు డబ్బింగ్ స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో మూవీ లవర్స్ ఎగ్జైట్ అవుతున్నారు.
'అయలాన్' విషయానికొస్తే.. ఓ మిషన్‌లో భాగంగా ఏలియన్ భూమ్మీదకు వస్తుంది. అనుకోని పరిస్థితుల్లో హీరో(శివ కార్తికేయన్)ని కలుస్తుంది. కొన్నాళ్లకు ఏలియన్-హీరోకు స్నేహం ఏర్పడుతుంది. సదరు ఏలియన్‌కి టాటూ అని పేరు కూడా పెడతారు. కొన్ని సంఘటనల వల్ల టాటూ కొందరు వ్యక్తుల్లో చిక్కుకుంటుంది. దాన్ని కాపాడేందుకు హీరో ఏం చేశాడు? టాటూ, భూమ్మీదకు రావడానికి కారణమేంటి? అనేది మిగతా స్టోరీ. ఏలియన్ పాత్రకు హీరో సిద్ధార్థ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఏలియన్ కామెడీ చూద్దామనుకుంటే దీన్ని మిస్ కావొద్దు.
(ఇదీ చదవండి: ఈ వారమే థియేటర్లలో 'రాజాసాబ్'.. ఓటీటీల్లోకి 16 సినిమాలు)


