సినిమా ఇలానే తీయాలి, స్టోరీ ఇలానే ఉండాలి అనేది ఒకప్పటి మాట. ఇప్పుడొస్తున్న చాలామంది దర్శకులు, రచయితలు డిఫరెంట్ కథలతో మూసధోరణికి భిన్నంగా మూవీస్ తీస్తున్నారు. ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తున్నారు. రీసెంట్ టైంలో అలా దక్షిణాదిలో హాట్ టాపిక్ అయిపోయిన మలయాళ చిత్రం 'ఎకో'(Eko Movie). థియేటర్లలో అదరగొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ)
కథేంటి?
కేరళలోని కాట్టుకున్న అటవీ ప్రాంతంలో ఎత్తయిన ఓ కొండపై మిలాతీ(బియానా మోమిన్) అనే వృద్ధురాలు నివసిస్తూ ఉంటుంది. ఈమె కేర్ టేకర్ పీయూస్(సందీప్ ప్రదీప్). ఈ కుర్రాడిని మిలాతీ కొడుకులు నియమిస్తారు. అలానే మలేసియా జాతికి చెందిన పదుల కుక్కలు.. ఈమెని జాగ్రత్తగా కాపలా కాస్తుంటాయి. అయితే ఈమె భర్త కురియాచన్ (సౌరభ్ సచ్‌దేవ్) కోసం ఓ నేవీ అధికారి(నరైన్), కురియాచన్ స్నేహితుడు మోహన్ పోతన్(వినీత్) తదితరులు వెతుకుతూ ఉంటారు. ఆరేళ్ల క్రితం ఓ వ్యక్తిని చంపిన తర్వాత నుంచి కురియాచన్ కనిపించకుండా పోతాడు. ఇతడు తన కుక్కల సాయంతో దట్టమైన అడవిలో దాక్కున్నాడనేది అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ కురియాచన్ ఆచూకీ ఎవరూ కనిపెట్టలేకపోతారు. ఇంతమంది ఇతడి కోసం ఎందుకు వెతుకుతున్నారు? ఇందులో కుక్కల పాత్రేంటి? మలేసియాకు చెందిన మిలాతీ.. కేరళ వచ్చి ఎందుకు బతుకుతోంది? అనేది అసలు కథ.

ఎలా ఉందంటే?
థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ ఫార్మాట్ అంటూ ఏం ఉండదు. చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు చాలా సాదాసీదా స్టోరీలా అనిపించాలి. ఒక్కో ట్విస్ట్ బయటపడుతుంటే ఆశ్చర్యపోవాలి. 'ఎకో' కూడా అలాంటి ఓ మూవీనే. గతంలో 'కిష్కిందకాండం' లాంటి థ్రిల్లర్ మూవీతో హిట్ కొట్టిన దర్శకుడు దింజిత్ అయ్యతన్- రచయిత బహుల్ రమేశ్ కాంబో.. ఇప్పుడు ఈ చిత్రంతో వచ్చారు. మరోసారి హిట్ కొట్టారు. ఆ మూవీలో కోతులు కీలక పాత్ర పోషించగా.. ఇందులో కుక్కలు కీ రోల్ ప్లే చేశాయి.
సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదో ఫారెస్ట్ థ్రిల్లర్. కనిపించకుండా పోయిన కురియాచన్ అనే వ్యక్తి, చివరకు దొరికాడా లేదా? అనేదే మెయిన్ పాయింట్. కాకపోతే ఈ కథకు మలేసియా కుక్కల జాతిని లింక్ చేసి, కర్ణాటక-కేరళ సరిహద్దుల్లోని అడవుల్ని చూపిస్తూ అద్భుతమైన స్క్రీన్ ప్లే జోడించారు. ప్రారంభంలో ఏం జరుగుతుందో అర్థం కాక తికమకగా అనిపిస్తుంది కానీ ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతూ క్లైమాక్స్ వచ్చేస్తుంది. అప్పటికీ ఏదో అర్థం కాలేదే అనిపిస్తుంది. ఒకవేళ మీకు కూడా అలానే అనిపిస్తే క్లైమాక్స్ నుంచి స్టోరీని వెనక్కి అనాలసిస్ చేసుకుంటూ వెళ్లండి. అప్పుడు అరె భలే తీశార్రా అనిపిస్తుంది.

సైకో కిల్లర్స్‌ని చూసి మనం భయపడతాం. కానీ చాలా సాదాసీదా బతుకుతూ తమ పనికి అడ్డం వచ్చేవారిని తెలివిగా తప్పించే వారి గురించి తెలిసినప్పుడు మనకు ఒళ్లు జలదరిస్తుంది. ఇది కూడా అలాంటి పాయింట్‌తో తీసిన సినిమా. చాలా మలయాళ చిత్రాల్లానే ఇందులోనూ స్లో నెరేషన్ ఉంది. కాకపోతే అడవుల విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మనల్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. మెయిన్ స్టోరీకి మలేసియాకు చెందిన కుక్కల జాతికి ఉన్న లింక్ కూడా ఆశ్చర్యపరుస్తుంది. స్టోరీలో ఉన్న ట్విస్టులు చాలా చిన్నవే కానీ బ్యాక్ గ్రౌండ్ సౌండ్ వల్ల అవి డిఫరెంట్‌గా అనిపిస్తాయి.
సినిమాల్లో టెక్నికల్ విషయాలు బాగా కుదిరాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీతోనూ చూడొచ్చు. సందీప్ ప్రదీప్, సౌరభ్ సచ్‌దేవ్, బియానా మోమిన్, వినీత్, నరైన్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వీళ్లందరి సంగతి పక్కనబెడితే అసలు కుక్కలతో ఇంత బాగా ఎలా యాక్టింగ్ చేయించగలిగారా అనే సందేహం కచ్చితంగా వస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ వాడారో లేదో తెలీదు గానీ మూవీ అంతా చాలా సహజంగా.. మనం కూడా కొండపై, అడవుల్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. చివరగా చెప్పొచ్చేది ఏంటంటే ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. స్టోరీ నెమ్మదిగా ఉన్నాసరే పర్లేదు డిఫరెంట్ కాన్సెప్ట్ చూద్దామనుకుంటే మాత్రం 'ఎకో' బెస్ట్ ఆప్షన్.
- చందు డొంకాన
(ఇదీ చదవండి: 'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్)


