'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్ | Stranger Things Series Telugu Review | Sakshi
Sakshi News home page

Stranger Things Review: వేలకోట్ల బడ్జెట్.. ఓటీటీని ఏలిన సిరీస్.. ఎలా ఉందంటే?

Jan 2 2026 4:38 PM | Updated on Jan 2 2026 4:52 PM

Stranger Things Series Telugu Review

గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'స్ట్రేంజర్ థింగ్స్' గురించే మాట్లాడుకుంటున్నారు. ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఓటీటీలో ఈ వెబ్ సిరీస్‌ చూసిన వాళ్లకు కొత్తగా చెప్పనక్కర్లేదు. తెలియని వాళ్లకు దీని గురించి వివరించాలంటే ఇదో ఫాంటసీ థ్రిల్లర్ అడ్వెంచరస్ సిరీస్. 2016లో మొదలై 2026లో ముగిసింది. న్యూఇయర్ సందర్భంగా చిట్టచివరి ఫినాలే ఎపిసోడ్ స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. పదేళ్ల పాటు సాగిన ఈ సిరీస్‌కి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ వేశారు. ఇంతకీ ఈ సిరీస్ ఎలా ఉంటుంది? ఎందులో చూడొచ్చు? అనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: బిగ్‌ స్కామ్‌పై వెబ్‌ సిరీస్‌.. విడుదలకు లైన్‌ క్లియర్‌)

కథేంటి?
అమెరికాలోని హాకిన్స్ అనే గ్రామం. మైకేల్, విలియమ్, లూకస్, డస్టిన్ అనే నలుగురు పిల్లలు. ఓ రోజు రాత్రి మైకేల్ అలియాస్ మైక్ ఇంట్లో అందరూ కలిసి డంజన్స్ అండ్ డ్రాగన్స్ గేమ్ ఆడతారు. పూర్తయిన తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్తారు. విలియమ్ అలియాస్ విల్‌ మాత్రం కనిపించకుండా పోతాడు. ఇంతకీ విల్ ఏమయ్యాడు? మరోవైపు ఫ్రెండ్ కోసం వెతుకుతుండగా.. మిగిలిన ముగ్గురు పిల్లలకు ఎలెవన్ అనే అమ్మాయి కనిపిస్తుంది. ఈమెకు సూపర్ పవర్స్ ఉంటాయి. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె గతమేంటి? విల్‌ని కనిపెట్టడంలో ఈమె ఎలాంటి పాత్ర పోషించింది అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
సినిమాలు చూడటం మనకు ఎప్పటినుంచో ఉన్న అలవాటు. 2-3 గంటల్లో ఇవి ముగిసిపోతాయి. కాకపోతే కొన్నేళ్లుగా పెరిగిన ఓటీటీ కల్చర్ వల్ల పరభాషా సినిమాలు, వెబ్ సిరీస్‌లు మనకు పరిచయమయ్యాయి. అలాంటి వాటిలోని ఓ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్'. తెలుగు ప్రేక్షకుల్లో దీన్ని ఇప్పటికే చాలామంది చూసి ఉంటారు. ఎందుకంటే 2016 నుంచి ఇది సీజన్ల వారీగా స్ట్రీమింగ్ అవుతూ వచ్చింది. లాక్‌డౌన్ టైంలో దీనికి మన దేశంలోనూ విపరీతమైన పాపులారిటీ వచ్చింది.

ఇదో ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ సిరీస్. ఓ చిన్న గ్రామంలో నలుగురు పిల్లలకు ఓ సూపర్ పవర్స్ ఉన్న అమ్మాయికి స్నేహం ఏర్పడితే తర్వాత ఏమైందనేదే స్టోరీ లైన్. కాకపోతే పిల్లాడు తప్పిపోవడంతో మొదలయ్యే ఈ సిరీస్.. తర్వాత అనుహ్యమైన మలుపులు, అద్భుతమైన సన్నివేశాలు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, మర్చిపోలేని పాత్రలు.. ఇలా ప్రతి దశలోనూ ఆశ్చర్యపరుస్తుంది. చిన్నపిల్లాడి నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ అర్థమయ్యాలా ఉండటం ఈ సిరీస్ స్పెషాలిటీ.

పదేళ్ల పాటు సాగిన ఈ సిరీస్‌లో మొత్తంగా 42 ఎపిసోడ్స్ ఉంటాయి. తొలి మూడు సీజన్లలో ఒక్కో ఎపిసోడ్ సగటున 50 నిమిషాల పాటు ఉంటుంది. నాలుగో సీజన్‌లో మాత్రం ఎపిసోడ్ యావరేజ్ గంట 10 నిమిషాలు. రీసెంట్‌గా రిలీజైన ఐదో సీజన్‌లోనూ ఒక్కో ఎపిసోడ్ గంటకు పైనే నిడివితో ఉంటుంది. జనవరి 1న స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ఫినాలే ఎపిసోడ్ అయితే ఏకంగా 2 గంటలు ఉంది.

మిగిలిన సిరీస్‌ల కంటే 'స్ట్రేంజర్ థింగ్స్' ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం స్టోరీ చెప్పిన విధానం. ఇందులో డార్క్ హారర్ ఎలిమెంట్స్, ఉలిక్కిపడేలా చేసే జంప్ స్కేర్ సీన్లకు కొదవలేదు. తొలి మూడు సీజన్లలో హారర్ అంశాలు ఓ రేంజులో ఉంటే నాలుగో సీజన్‌లో అంతకు మించి అనేలా ఉంటుంది. కేవలం విజువల్స్ అనే కాదు సౌండ్, పాత్రలు, నిర్మాణ విలువలు ఒకటేమిటి ఇలా సిరీస్‌లోని ప్రతి అంశం ఆశ్చర్యపరుస్తుంది. మరి ముఖ్యంగా విలన్ వెక్నా, మైండ్ ఫ్లయిర్‌ని చూస్తే భయమేస్తుంది.

ఈ సిరీస్ అంతా కూడా 80ల్లో జరుగుతుంది. అందుకు తగ్గట్లే అప్పటి పరిస్థితులు, దుస్తులు, వస్తువులు.. ఇలా ప్రతి ఒక్క దాన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకున్నారు. ఈ సిరీస్ మొత్తం బడ్జెట్ రూ.5000-6000 కోట్ల పైనే ఉంటుంది! వ్యూస్ కూడా అందుకు తగ్గట్లే వచ్చాయి. ఇ‍ప్పటికీ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ ఉంది కానీ బూతులు ఎక్కువ. వీలైతే ఇంగ్లీష్ వెర్షన్‌లోనే చూడండి. ఈ సిరీస్‌ని మీరు ఒక్కసారి చూడటం మొదలుపెట్టారంటే అయిపోయేంతవరకు అస్సలు ఆపరు.

గత నెలరోజుల్లో చిట్టచివరిదైన ఐదో సీజన్‌ని మూడు భాగాలుగా రిలీజ్ చేశారు. తొలి నాలుగు సీజన్లు వావ్ అనేలా ఉంటాయి. చివరి దానిలో మాత్రం వావ్ ఫ్యాక్టర్స్ కంటే వీలైనంత ఎమోషనల్ కంటెంట్ ఉండేలా దర్శకద్వయం ఢప్పర్ బ్రదర్స్ ప్లాన్ చేశారు. అయితే ఈ సిరీస్‌కి ఎలాంటి ముగింపు ఇస్తారా అని అందరూ ఎదురుచూశారు. కానీ చాలా సింపుల్‌గా తేల్చేయడం ఈ సిరీస్ ఫ్యాన్స్‌కి అస్సలు నచ్చలేదు. ప్రస్తుతానికైతే భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఎలెవన్ పాత్ర చనిపోయిందా? బతికుందా అనే విషయాన్ని ప్రేక్షకులకే వదిలేశారు.

ఐదో సీజన్లలో ఈ సిరీస్‌ని ముగించారు. కానీ దీనికి 'స్పిన్ ఆఫ్' ఉంటుందని దర్శకద్వయం చెప్పుకొచ్చారు. దీని పేరు కూడా 'స్ట్రేంజర్ థింగ్స్' అనే పెడతామని క్లారిటీ ఇచ్చారు.  ఇప్పటివరకు వచ్చిన సిరీస్ 1980ల్లో హాకిన్స్ అనే ఊరిలో జరిగింది. స్పిన్ ఆఫ్‌లో భాగంగా ప్రస్తుత కాలంలో మరో ఊరిలో జరిగే కథతో కొత్త సిరీస్ తీయబోతున్నారు.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: 'రంగస్థలం'లో ఆ పాట సుకుమార్‌కి నచ్చలేదు.. ఎవరూ ఏడవకపోవడంతో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement