ప్రేక్షకుల నోట ఆ మాట వినాలని ఉంది: శివానీ నాగారం | Actress Shivani Nagaram about Hey Bhagawan Movie | Sakshi
Sakshi News home page

ప్రేక్షకుల నోట ఆ మాట వినాలని ఉంది: శివానీ నాగారం

Feb 17 2026 12:09 AM | Updated on Feb 17 2026 1:51 PM

Actress Shivani Nagaram about Hey Bhagawan Movie

‘‘వేగంగా వంద సినిమాలు చేయడం కంటే.. నటిగా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఐదు సినిమాలు చేసినా చాలు’ అనుకునే మనస్తత్వం నాది. వెంట వెంటనే సినిమాలు చేయకపోతే ఇండస్ట్రీలో కనిపించకుండా పోతావు అని కొందరు నాతో అన్నారు. కానీ, ఈ అమ్మాయి ఎప్పుడూ మంచి సినిమాలే చేస్తుంది అనే మాట ప్రేక్షకుల నోట వినాలని ఉంది. సెలక్టివ్‌గా సినిమాలు చేసే సాయిపల్లవి, నిత్యామీనన్‌గార్ల బాటలోనే నేను కూడా పయనిస్తాను’’ అని చెప్పారు హీరోయిన్‌ శివానీ నాగారం

సుహాస్‌ హీరోగా నటించిన చిత్రం ‘హే బల్‌వంత్‌!’ (హే భగవాన్‌ టైటిల్‌ను హే భల్‌వంత్‌! గా మార్చారు). గోపీ అచ్చర దర్శకత్వంలో బి.నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్‌ కానుంది. బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ మూవీని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శివానీ మాట్లాడుతూ– ‘‘నా స్వస్థలం హైదరాబాద్‌. గాయనిగా కెరీర్‌ను ప్రారంభించాను. యాక్టర్‌గా తొలిసారి సుహాస్‌తో ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమా చేశాను. ఆ తర్వాత ‘లిటిల్‌ హార్ట్స్‌’ మూవీ చేశాను. ఇప్పుడు మళ్లీ సుహాస్‌తో ‘హే బల్‌వంత్‌’ చేశాను.

నా పాత్రలో అమాయకత్వంతో పాటు కామెడీ కూడా ఉంటుంది. నరేశ్, వెన్నెల కిషోర్, సుదర్శన్‌గార్ల కామెడీ నవ్విస్తుంది. సెకండాఫ్‌లో ఫాదర్‌ అండ్‌ సన్‌ ఎమోషన్‌ ఉంది. తెలుగు అమ్మాయిలకు ఇప్పుడు ఎక్కువగా అవకాశాలు వస్తుండటం సంతోషంగా ఉంది. ప్రస్తుతం తెలుగులో రెండు, తమిళంలో రెండు సినిమాలకు చాన్స్‌ వచ్చింది.. వివరాలు త్వరలోనే చెబుతాను. మంచి కథ, క్యారెక్టర్‌ ఉంటే ఓటీటీ ప్రాజెక్ట్స్‌ చేస్తాను. అవకాశం వస్తే సింగర్‌గాను నిరూపించుకోవాలని ఉంది’’ అని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement