Hey Bhagawan Movie
-
‘హే బల్వంత్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
యంగ్ హీరో సుహాస్‌కి ఈ మధ్యకాలంలో సరైన హిట్టే పడలేదు. వరుస సినిమా చేస్తున్నప్పటికీ..ఏ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ విజయాన్ని అందించలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ‘హే బల్వంత్’(హే భగవాన్ చిత్రం టైటిల్ మార్పు) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో సుహాస్‌కి జోడీగా నటించిన శివానీ నాగారం.. ఇందులోనూ హీరోయిన్గా చేసింది. సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై బన్నీవాస్, వంశీ నందిపాటి సంయుక్తంగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. మరి ఈ చిత్రంతో అయిన సుహాస్ హిట్ ట్రాక్ ఎక్కడా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే...తల్లిలేని కృష్ణ(సుహాస్)కి చిన్నప్పటి నుంచి ఓ కోరిక ఉంటుంది. పెద్దయ్యాక తండ్రి రావు బల్వంత్(నరేశ్) చేసే బిజినెస్ టేకోవర్ చేసి.. మంచి పేరు సంపాదించాలనుకుంటాడు. అయితే నాన్న చేసే బిజినెస్ ఏంటి అనేది మాత్రం అతనికి తెలియదు. నాన్నను, నాన్నమ్మ(అన్నపూర్ణమ్మ)ను అడిగినా.. చెప్పరు. చదువు పూర్తయిన తర్వాత బిజినెస్ చూసుకుంటానంటే తొలుత నాన్న ఒప్పుకోడు. కానీ ఓ కారణంగా రావు బల్వంత్ వ్యాపారం కృష్ణ చేతుల్లోకి వెళ్తుంది. చిన్నప్పటి నుంచి ఏవోవో కలలు కన్న కృష్ణకి ఆ వ్యాపారం ఏంటనేది తెలిశాక..షాక్‌కి గురవుతాడు. తాను ఊహించినదానికి భిన్నంగా నాన్న వ్యాపారం ఉంటుంది. ప్రేమించిన అమ్మాయి మిత్ర(శివానీ నాగారం)కి కూడా ఆ వ్యాపారం గురించి చెప్పుకోలేని పరిస్థితి. అసలు బల్వంత్ రావు చేసే వ్యాపారం ఏంటి? దాని వల్ల కృష్ణకు ఎదురైన సమస్యలు ఏంటి? కృష్ణ చేసే వ్యాపారం గురించి ప్రియురాలు మిత్రకు తెలిసిన తర్వాత ఏం జరిగింది? మిత్ర తాత(బాబు మోహన్)కి కృష్ణ బిజినెస్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఈ బిజినెస్ వల్ల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న పీవీబీ (హర్ష వర్ధన్)కి వచ్చిన సమస్య ఏంటి? చంప(స్రవంతి) ఎవరు? ఈ కథలో బెజ్జం దుర్గారావు (అజయ్ ఘోష్), యువన్ (వెన్నెల కిశోర్) పాత్రలకి ఉన్న ప్రాధాన్యత ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పేరుకు ఇది కామెడీ చిత్రం కానీ ఇందులో చాలా సెన్సిబుల్ టాపిక్‌ని చర్చించారు. సమాజం మొత్తం ఛీ కొట్టే ఓ వృత్తిలో మహిళలు ఎదుర్కొనే అవమానాలు, బాధలను చూపిస్తూ.. చట్టవిరుద్ధమైన ఓ వ్యాపారానికి జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పాటు తండ్రి-కొడుకుల అనుబంధాన్ని, చదువు యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ మంచి సందేశాన్ని అందించాడు దర్శకుడు. అయితే ఈ విషయాలన్నీ సీరియస్‌గా చెప్పకుండా లైటర్ వేలో కామెడీగా చూపించి..చివరిలో భావోద్వేగానికి లోనయ్యేలా చేశారు.వినోదంతో పాటు భావోద్వేగాలకు పెద్ద పీటవేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్లో చూపించినట్లుగా ఈ సినిమా కథ మొత్తం హీరో తండ్రి చేసే బిజినెస్ చుట్టూనే తిరుగుతుంది. సినిమా ప్రారంభంలోనే ఆ వ్యాపారం ఏంటో చూపించారు. అది తెలిశాక హీరో ఎలా రియాక్ట్ అవుతాడా అనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో పెరుగుతుంది. ఇక హీరో ఆ బిజినెస్‌ని తన చేతుల్లోకి తీసుకున్నాక అసలు కథ ప్రారంభం అవుతుంది. ప్రియురాలికి ఆ వ్యాపారం గురించి తెలియకుండా హీరో చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. ప్రకృతి వైద్యం ఎపిసోడ్లో వెన్నెల కిశోర్ చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. ఇక ద్వితియార్థం మొత్తం ఓ శవం చుట్టూనే కథనం తిరుగుతుంది. ఆ శవాన్ని తిసుకురావడానికి హీరో గ్యాంగ్ చేసే ప్రయత్నాలు ఒకవైపు.. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు వెన్నెల కిశోర్ చేసే హంగామా మరోవైపు.. ఇలా ద్వితియార్థం కొనసాగుతుంది. ఇక ప్రీక్లైమాక్స్‌లో బాలకృష్ణ, ఎన్టీఆర్‌లను అనుకరిస్తూ నరేశ్ చెప్పే డైలాగులు నవ్వులు పూయిస్తుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కథనం నెమ్మదిగా సాగుతుంది. కాస్త బుర్రపెట్టి చూస్తే..ట్విస్టులతో పాటు తర్వాత ఏం జరుగుతుందనేది కూడా ఊహించొచ్చు. క్లైమాక్స్‌లో నరేశ్ ప్లాష్‌బ్యాక్ స్టోరీ బావోధ్వేగానికి గురి చేస్తుంది. లాజిక్స్ వెతక్కుండా సినిమా చూస్తే మరి పగలబడి కాకపోయినా.. సరదాగా నవ్వుకోవచ్చు. ఎవరెలా చేశారంటే.. కృష్ణ పాత్రకు సుహాస్ న్యాయం చేశాడు. ఎప్పటిమాదిరే తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు సుహాస్‌తో పాటు మరో హీరో నరేశ్ అని చెప్పొచ్చు. రావు బల్వంత్ పాత్రలో జీవించేశాడు. సినిమా మొత్తం నవ్విస్తూనే చివరిలో భావోద్వేగానికి లోనయ్యేలా చేశాడు. మహేశ్ బాబు ‘పోకిరీ’ సీన్‌తో పాటు బాలకృష్ణ, ఎన్టీఆర్‌లను ఇమిటేట్ చేస్తూ చెప్పే డైలాగుకు పడి పడి నవ్వుతారు. మిత్ర పాత్రకి శివాని న్యాయం చేసింది. హీరో స్నేహితుడిగా సుదర్శన్ వేసే పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. యాంకర్ స్రవంతి పోషించిన చంప పాత్రకి సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంది. అయితే డబ్బింగ్ విషయంలో ఆమె ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. అన్నపూర్ణమ్మ, హర్షవర్దన్, అజయ్ ఘోష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
సుహాస్ ‘హే బల్వంత్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అదే బాధగా అనిపిస్తుంది : సుహాస్
నా కెరీర్ మొత్తంలో అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన సినిమా ‘హే బల్వంత్’. కథ వినగానే నచ్చింది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్‌గా కనెక్ట్ అయ్యాను. సినిమా మేము అనుకున్నదాని కంటే వందరెట్లు బెటర్‌గా వచ్చింది’ అన్నారు యంగ్ హీరో సుహాస్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘హే బల్వంత్' (హే భగవాన్ చిత్రం టైటిల్ మార్పు) . శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో సుహాస్ మంగళవారం పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలు..భగవాన్ అంటే భగవంతుడు అనే అర్థం వస్తుంది కాబట్టి టైటిల్ మార్చాలని సెన్సారు వారు సూచించడంతో హేబల్‌వంత్‌గా మార్చాం. సినిమాలో నరేష్ క్యారెక్టర్ పేరు మార్చాం. సినిమా టైటిల్‌తో పాటు సినిమా కాన్సెప్ట్‌ను కూడా సెన్సారు వాళ్లు పరిగణనలోకి తీసుకున్నారు.చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలని ఆలోచించే కుర్రాడు, నాన్న బిజినెస్‌ను టేకప్ చేయాలని అనుకుంటాడు. అప్పుడు అతనికి ఎదురైన పరిణామాలు ఏమిటి? నాన్న బిజినెస్ ఏమిటి? ఇలా సినిమా పూర్తి ఎంర్‌టైన్‌మెంట్‌గా, నా పాత్ర కూడా వినోదాత్మకంగా ఉంటుంది. ఈ మూవీతో నాకు విజయం అందుతుందనే నమ్మకం ఉంది.ప్రతి సినిమా కోసం మీ ఎఫర్ట్ పెడుతున్నాను. కానీ సరైన విజయం అందడం లేదు. విజయం కోసం ఎదురుచూడటమే కాస్త బాధగా అనిపిస్తుంది. కానీ వెంటనే తదుపరి సినిమాకు రెడీ అవుతున్నాను.వరుస ఫెయిల్యూర్స్ తరువాత అందరూ కంట్రోల్‌గా ఆలోచించి సినిమా చేయమని చెప్పారు. ఇంట్లో మా శ్రీమతి కూడా చెప్పింది. అందుకే మంచి సినిమాలు చేయాలని కొంత బ్రేక్ ఇచ్చి హేబల్‌వంత్ చేశాను. ఈ సినిమాపై చాలా నమ్మకం ఉంది. ‘మంచి యాక్టర్. మంచి సినిమా పడాలి’ అనే సానుభూతి అందరిలో ఉంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.తమిళ్ సినిమా మందాడిలో మెయిన్ విలన్‌గా చేస్తున్నా. సినిమా రిజల్ట్ తరువాత తమిళంలో బిజీ అయ్యే అవకాశం ఉంది. నేను వెయిట్ చేసిన లుక్ అండ్ క్యారెక్టర్. అంబాజీ పేట సినిమా చూసి ఈ సినిమా కోసం నన్ను అప్రోచ్ అయ్యారు.నా కెరీర్ ప్రారంభంలో షార్ట్ఫిల్మ్స్లో నేను కామెడీ పాత్రలే చేశాను. ఈ సినిమాలో నా పాత్రను చూసి మా ఆవిడ కూడా ఇలాంటి సినిమాలు చేయమని కోరింది. లక్కీగా నాకు ఈ సినిమా వచ్చింది.కెరీర్ పట్ల సంతోషంగా ఉన్నాను. ఈ సినిమా హిట్ అయితే అది ఇంకా పెరుగుతుంది. అందరూ సినిమా మీద ఫుల్ కాన్పిడెంట్‌గా ఉన్నారు. పెద్ద విజయం రాబోతుంది. ఈ సినిమా మా వైఫ్ కూడా చూసి ఫుల్ ఎంజాయ్ చేసింది.ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నాను. ఆయన కథ అందిస్తున్నాడు. వాళ్ల అసోసియేట్ దర్శకుడు. తెలుగులో కొన్ని కథలు వింటున్నాను.త్వరలోనే ఫైలన్ అవుతాయి. -
ప్రేక్షకుల నోట ఆ మాట వినాలని ఉంది: శివానీ నాగారం
‘‘వేగంగా వంద సినిమాలు చేయడం కంటే.. నటిగా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఐదు సినిమాలు చేసినా చాలు’ అనుకునే మనస్తత్వం నాది. వెంట వెంటనే సినిమాలు చేయకపోతే ఇండస్ట్రీలో కనిపించకుండా పోతావు అని కొందరు నాతో అన్నారు. కానీ, ఈ అమ్మాయి ఎప్పుడూ మంచి సినిమాలే చేస్తుంది అనే మాట ప్రేక్షకుల నోట వినాలని ఉంది. సెలక్టివ్‌గా సినిమాలు చేసే సాయిపల్లవి, నిత్యామీనన్గార్ల బాటలోనే నేను కూడా పయనిస్తాను’’ అని చెప్పారు హీరోయిన్ శివానీ నాగారం. సుహాస్ హీరోగా నటించిన చిత్రం ‘హే బల్వంత్!’ (హే భగవాన్ టైటిల్‌ను హే భల్వంత్! గా మార్చారు). గోపీ అచ్చర దర్శకత్వంలో బి.నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్ కానుంది. బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ మూవీని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శివానీ మాట్లాడుతూ– ‘‘నా స్వస్థలం హైదరాబాద్. గాయనిగా కెరీర్‌ను ప్రారంభించాను. యాక్టర్‌గా తొలిసారి సుహాస్‌తో ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమా చేశాను. ఆ తర్వాత ‘లిటిల్ హార్ట్స్’ మూవీ చేశాను. ఇప్పుడు మళ్లీ సుహాస్‌తో ‘హే బల్వంత్’ చేశాను.నా పాత్రలో అమాయకత్వంతో పాటు కామెడీ కూడా ఉంటుంది. నరేశ్, వెన్నెల కిషోర్, సుదర్శన్గార్ల కామెడీ నవ్విస్తుంది. సెకండాఫ్‌లో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంది. తెలుగు అమ్మాయిలకు ఇప్పుడు ఎక్కువగా అవకాశాలు వస్తుండటం సంతోషంగా ఉంది. ప్రస్తుతం తెలుగులో రెండు, తమిళంలో రెండు సినిమాలకు చాన్స్ వచ్చింది.. వివరాలు త్వరలోనే చెబుతాను. మంచి కథ, క్యారెక్టర్ ఉంటే ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తాను. అవకాశం వస్తే సింగర్‌గాను నిరూపించుకోవాలని ఉంది’’ అని చెప్పారు. -
అలాంటి కంటెంట్‌కి లేని సమస్య.. టైటిల్స్‌కి ఎందుకు?
ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కాస్త పద్ధతిగా ఉండేవి. కానీ గత కొన్నేళ్లలో చూసుకుంటే సెన్సార్ బోర్డ్ ఏమైనా కళ్లు ముసుకుందా అన్నట్లే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని చిత్రాల్లో బూతులు వినిపిస్తుంటాయి. మరికొన్నింటిలో అయితే మితిమీరిన హింస కనిపిస్తూనే ఉంటుంది. అసలు సెన్సార్ దాటుకుని ఈ మూవీస్ ఎలా బయటకు వచ్చాయా అనేది అంతుచిక్కని ప్రశ్న. వీటిపై విమర్శలు వస్తూనే ఉంటాయి. అలాంటిది ఇప్పుడు విచిత్రంగా సెన్సార్ బోర్డ్.. తెలుగు సినిమా టైటిల్స్‌పై దండయాత్ర చేస్తున్నట్లు కనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)గత నెలన్నర రోజుల్లోనే ఏకంగా నాలుగు తెలుగు సినిమాల టైటిల్స్ విషయంలో సెన్సార్ చాలా ఇబ్బంది పెట్టేసింది. గత నెలలో రిలీజైన 'వనవీర' విషయానికొస్తే.. తొలుత వీళ్లు 'వానర' అనే టైటిల్ అనుకున్నారు. దాదాపు ఆ పేరుతో ప్రమోషన్ అంతా చేసుకున్నారు. తీరా సెన్సార్ జరిగే సమయానికి పేరు మార్చాలని బోర్డ్ చెప్పింది. తప్పని పరిస్థితుల్లో 'వనవీర' అని మార్చుకున్నారు. దీంతో అప్పటివరకు చేసిన ప్రమోషన్స్ అంతా వృథా అయినట్లేగా.గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన 'కపుల్ ఫ్రెండ్లీ' అనే సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీనికి 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ విషయం గురించి ప్రమోషన్లలో మాట్లాడిన డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని.. టైటిల్‌ని 'ఫ్రెండ్లీ కపుల్' అని మారిస్తే యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తాం లేదంటే ఏ సర్టిఫికెట్ ఇస్తామని.. సెన్సార్ తమతో చెప్పిందని అన్నారు. చివరకు మూవీ టీమ్.. పేరు మార్చకుండానే సినిమాని రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: మాజీ ఎంపీ కూతురితో యువ హీరో నిశ్చితార్థం.. పెళ్లెప్పుడంటే?)ఈ వారాంతంలో థియేటర్లలోకి రావాల్సిన సుహాస్ 'హే భగవాన్' సినిమాకు ఇప్పుడు టైటిల్ మార్చేశారు. భగవాన్ బదులుగా బల్వంత్ అని పేరు పెట్టారు. తద్వాతా 'హే బల్వంత్' అయింది. అలానే 'చాయ్ వాలా' అనే మూవీకి కూడా 'నవాబ్స్ కేఫ్' అని టైటిల్ మార్పించారు. పైన చెప్పిన నాలుగు సినిమాల టైటిల్స్‌లోనూ బూతులు గానీ, కించపరిచే పదాలు గానీ లేవు. పోనీ వాటిపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారా అంటే లేదు. అలాంటిది సెన్సారే తనకు తానుగా టైటిల్ మార్చాల్సిందేనని చెప్పడం ఇక్కడ వింతగా విడ్డూరంగా అనిపిస్తుంది.రీసెంట్గా రిలీజైన పలు టీజర్లు, సినిమాలు చూస్తే రక్తం ఏరులైపారుతుంది. లేదంటే టీనేజీ రొమాన్స్‌ని మితిమీరి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాటిపై సెన్సార్ ఎందుకు అసలు దృష్టి పెట్టట్లేదు అని నెటిజన్లు.. ఎత్తిచూపుతున్నారు. వీటితో లేని సమస్య.. టైటిల్స్‌కి ఎందుకొచ్చిందా అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'ప్రభాస్'కు గాయం.. అసలు విషయం చెప్పిన టీమ్) -
నాలుగు రోజుల్లో రిలీజ్.. 'హే భగవాన్' టైటిల్ మార్పు
టాలీవుడ్‌ను సెన్సార్ సమస్యలు ప్రభావితం చేస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం 'కపుల్ ఫ్రెండ్లీ, వానర సినిమాల టైటిల్స్ మార్చాలని సెన్సార్ బోర్డ్ సూచించింది. ఇప్పుడు తాజాగా సుహాస్ సినిమాకు అలాంటి ఇబ్బందే వచ్చింది. విడుదలకు కేవలం నాలుగురోజుల ముందు టైటిల్ మార్చాలని CBFC పేర్కొంది. దీంతో తప్పని పరిస్థితిల్లో సినిమా పేరును మార్చి పోస్టర్‌ను విడుదల చేశారు.తండ్రీ తనయుల మధ్య అనుబంధాన్ని 'హే భగవాన్' మూవీలో ఓ కొత్త కోణంలో చూపిస్తామని దర్శకుడు గోపీ అచ్చర అన్నారు. అయితే, తాజాగా సెన్సార్ సూచన ప్రకారం ఈ టైటిల్‌ను 'హే బల్వంత్'(Hey Balwanth)గా మార్చారు. దీంతో నెటిజన్లు షాకవుతున్నారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తర్వాత సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన చిత్రమిది. వీకే నరేశ్, యాంకర్ స్రవంతి కీలక పాత్రలు పోషించారు. బి.నరేంద్రరెడ్డి నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.సంతోష్ శోభన్ నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీకి CBFC నుండి A సర్టిఫికేట్ లభించింది. కేవలం టైటిల్ కారణంగానే ఆ సర్టిఫికేట్ వచ్చిందని నిర్మాత, డిస్ట్రీబ్యూటర్ ధీరజ్ మొగిలినేని చెప్పారు. అదే 'ఫ్రెండ్లీ కపుల్' టైటిల్ పెడితే 'U/A' వచ్చేదని ఆయన గుర్తుచేశారు. దీంతో పెద్దలు మాత్రమే థియేటర్లలో సినిమా చూడాల్సి ఉంటుందనేది తెలిసిందే. మరోవైపు వానర మూవీ టైటిల్‌ను కాస్త వనవీరగా మార్చారు. హనుమంతుడితో ముడిపడి ఉన్న పేరు కావడంతో సున్నితమైన కుల,రాజకీయ అంశాలు ఉండటం వల్ల సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పలు కారణాలతో చిన్న సినిమాలకు సెన్సార్ చిక్కులు తప్పడం లేదని విమర్శలు వస్తున్నాయి. -
లుంగీ ధరించి రమ్మన్నారు.. నో చెబితే..: యాంకర్
సుహాస్ హీరోగా నటిస్తున్న హే భగవాన్ చిత్రంలో యాంకర్, బిగ్‌బాస్ ఫేమ్ స్రవంతి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 20న ఈ మూవీ విడుదల కానుంది. దీంతో స్రవంతి ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొంటూ సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా దూసుకెళ్తెంది. హీరోయిన్ల డ్రెస్‌ల గురించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యాంకర్ డ్రెస్‌లు ఎవరు సెలక్ట్ చేస్తారనేది స్రవంతి క్లారిటీ ఇచ్చింది.' ఏదైనా ఒక సినిమా ఈవెంట్‌కు వెళ్లితే మా కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి అనేది వాళ్లే డిసైడ్ చేస్తారు. ఎలాంటి దుస్తులు ధరించాలనేది మా చాయిస్ కాదు. శ్రీవిష్ణు నటించిన సింగల్ మూవీ ఈవెంట్ కోసం లుంగీ కట్టుకుని రమ్మని చెప్పారు. అప్పుడు అదే పనిగా కళ్లజోడు, లుంగీ కొనుగోలు చేసి వాటిని ధరించి యాంకరింగ్ చేశాను.నో చెబితే అవకాశాలు రావు. అందుకే ఈ విషయంలో మాకు ఆప్షన్ ఉండదు. దుస్తుల విషయంలో మాకు ఆప్షన్ ఇస్తే నేను ట్రెడిషనల్ డ్రెస్‌నే ఎంపిక చేసుకుంటాను. కొన్ని సినిమాలకు చీరలు కట్టుకునే ప్రమోషన్స్ కార్యక్రమాలకు పాల్గొన్నాను. నా వద్ద సుమారు వెయ్యికి పైగా చీరలు ఉన్నాయి.' అని స్రవంతి చెప్పింది.హీరోయిన్ల దుస్తుల గురించి నటుడు శివాజీ వ్యాఖ్యలు సబబుగానే ఉన్నాయని స్రవంతి పేర్కొంది. కానీ, మహిళల గురించి మాట్లాడుతూ ఆయన నుంచి రెండు పదాలు తప్పుగా దొర్లాయి.. వాటిని తాను కూడా సమర్ధించను. తర్వాత శివాజీ కూడా క్షమించాలని బహిరంగంగానే చెప్పారని ఆమె గుర్తు చేసింది. -
ఓటీటీ కోసం చేసే సినిమాలు పెరిగాయి : వంశీ నందిపాటి
‘‘హే భగవాన్’ ఎంటర్టైన్మెంట్ మూవీ. స్టోరీ లెవల్ నుంచే ఈ ప్రాజెక్టులో ఉన్నాను. ఇప్పుడు సమర్పకుడిగా ఉన్నాను. ఈ సినిమాలో బిజినెస్ అనే అంశం ఉంటుంది. ఒక కొడుకు తన తండ్రి గురించి అర్థం చేసుకోవడానికి ఆ అంశం ఉపయోగపడుతుంది. ఈ సినిమాలో వినోదంతో పాటు భావోద్వేగాలు ఉన్నాయి. ప్రేక్షకులను నవ్వించడంతో పాటు హృదయానికి హత్తుకునే సినిమా ఇది’’ అని వంశీ నందిపాటి అన్నారు. సుహాస్, శివానీ నాగారం జోడీగా గోపీ అచ్చర దర్శకత్వం వహించిన చిత్రం ‘హే భగవాన్’. బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 20న రిలీజ్ కానుంది. బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వంశీ నందిపాటి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో హీరో తండ్రి పాత్ర పేరు భగవాన్.. అందుకే ‘హే భగవాన్’ టైటిల్ పెట్టాం. కొంతకాలం నుంచి సుహాస్ ఎదురు చూస్తున్న కమర్షియల్ సక్సెస్ ఈ సినిమాతో సాధించబోతున్నాడు. కథ పరంగా ఏవైనా మార్పులుంటే కన్విన్సింగ్‌గా చెబితే దర్శకులు కూడా ఒప్పుకుంటారు. అయితే కంటెంట్‌లో బలం ఉంటేనే మనం కూడా ఏమైనా చేయగలం.దర్శకుడు హ్యాపీ అయితే సినిమా బాగుంటుందనేది నా నమ్మకం. ఇక ‘లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి’ మూవీస్ తర్వాత చిన్న సినిమాలు పెరిగాయి. ఇటీవల ఫిల్మ్‌ఛాంబర్‌లో ఒక నెలలోనే 300 సినిమాల టైటిల్స్ రిజిస్టర్ అయ్యాయి. ఓటీటీ బిజినెస్‌లు కావడం లేదని ఓ క్లారిటీ వచ్చింది. అయితే కేవలం ఓటీటీ కోసం చేసే సినిమాలు పెరిగాయి. నిర్మాతగా మంచి చిత్రాలు అందించాలనేది నా లక్ష్యం. బన్నీ వాసుగారు నాకు బ్రదర్‌లాంటి వారు. మా ఇద్దరి అభిప్రాయాలు ఒకే విధంగా ఉంటాయి. ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్‌గా మార్చి 6న రిలీజ్ చేస్తున్నాను. సత్యదేవ్‌తో పాటు శ్రీవిష్ణుతో సినిమాలు చేస్తున్నాను. ‘పొలిమేర–3’ షూట్‌ని ఏప్రిల్ లేదా మేలో ప్రారంభిస్తాం. ఈ మూవీని అన్ని దక్షిణాది భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఈటీవీ విన్‌తో కలిసి ఓ ప్రాజెక్టు చేస్తున్నాను’’ అని చెప్పారు.


