బెంగళూరు: చామరాజనగర్ జిల్లాలో కర్ణాటక అటవీశాఖ సిబ్బంది జరిపిన కాల్పుల్లో ముగ్గురు అనుమానిత వేటగాళ్లు మృతి చెందిన ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో తమిళనాడు ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ వైఖరిపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రా లేక ఒక నిర్దిష్ట వర్గానికేనా అని ప్రశ్నించింది.
హనూరు వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనపై సీఎం డీకే శివకుమార్‌కు విజయ్ లేఖ రాయగా, ఆర్చ్‌బిషప్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, నష్టపరిహారం కోరారని కర్ణాటక భాజపా అధ్యక్షుడు బీవై విజయేంద్ర పేర్కొన్నారు. మృతులకు కులం, మతం రంగు పులమడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. బీజేపీ, జేడీ(ఎస్)లు మానవతా దృక్పథంతో అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తి, మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. మరోవైపు, కర్ణాటక అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని తమిళనాడు నేతలను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హెచ్చరించారు.
కాగా ఆంథోనీ స్వామి, జాన్ రోస్ పీటర్, కుమార్‌ల మృతిని ముఖ్యమంత్రి విజయ్ ‘నరమేధం’గా అభివర్ణిస్తూ, ఎదురుకాల్పుల వివరాలను తిరస్కరించారు. ఈ అంశంపై తమిళనాడు అసెంబ్లీలోనూ గందరగోళం చెలరేగింది. మరోవైపు వారి వద్ద ఆయుధాలు, జంతు మాంసం, నిత్యావసరాలు లభ్యమైనందున వారు వేటగాళ్లేనని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఘటనపై వాస్తవాలను నిర్ధారించేందుకు బీజేపీ నిజనిర్థారణ కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్. మహేష్, కార్యదర్శి లక్ష్మీ అశ్విన్ గౌడ, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అనిల్ థామస్, మాజీ ఎమ్మెల్యే సి.ఎస్. నిరంజన్ కుమార్, హనూరు వెంకటేష్‌లతో కూడిన ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి వారం రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించనుంది.
ఇది కూడా చదవండి: బాయ్‌ఫ్రెండ్ సాయంతో తాతను చంపించి.. బాలిక పైశాచికం!


