ఇద్దరు గుజరాత్‌ కేడర్‌ ఐఏఎస్‌లకు బిగ్‌ షాక్‌.. కేంద్రం కీలక నిర్ణయం! | Centre prematurely retires 2 Gujarat IAS officers, Here Details | Sakshi
Sakshi News home page

ఇద్దరు గుజరాత్‌ కేడర్‌ ఐఏఎస్‌లకు బిగ్‌ షాక్‌.. కేంద్రం కీలక నిర్ణయం!

Oct 3 2026 9:09 AM | Updated on Oct 3 2026 10:45 AM

Centre prematurely retires 2 Gujarat IAS officers, Here Details

గుజరాత్‌ కేడర్‌కు చెందిన ఇద్దరు ఐఏఎస్‌ అధికారులపై కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. సర్వీస్‌ రికార్డులను సమీక్షించిన అనంతరం 2010, 2011 బ్యాచ్‌లకు చెందిన కే. రాజేశ్‌, గౌరవ్‌ దహియాలను ముందస్తుగా రిటైర్‌ చేయాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (DoPT) నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉన్నతాధికారులు వెల్లడించారు.

2011 బ్యాచ్‌కు చెందిన కే. రాజేశ్‌ 2022 జూలై నుంచి సస్పెన్షన్‌లో ఉన్నారు. సీబీఐ నమోదు చేసిన లంచం కేసులో ఆయనను అరెస్ట్‌ చేయడంతో గుజరాత్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. మరోవైపు 2010 బ్యాచ్‌ అధికారి గౌరవ్‌ దహియా గతంలో సస్పెన్షన్‌కు గురై, 2023 జూలైలో తిరిగి విధుల్లో చేరారు. ప్రస్తుతం గాంధీనగర్‌లో అదనపు అభివృద్ధి కమిషనర్‌గా పనిచేస్తున్నారు.

లంచం కేసులో రాజేశ్‌..
సీబీఐ ఆరోపణల ప్రకారం.. అనర్హులకు ఆయుధ లైసెన్సులు మంజూరు చేయడం, అర్హత లేని వారికి ప్రభుత్వ భూములు కేటాయించడం, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను క్రమబద్ధీకరించడం వంటి వ్యవహారాల్లో రాజేశ్‌ లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గాంధీనగర్‌లో జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో జాయింట్‌ సెక్రటరీగా పనిచేస్తున్న సమయంలో ఆయనను సీబీఐ అరెస్ట్‌ చేసింది. సీబీఐ రిమాండ్‌ అనంతరం రాజేశ్‌ను సబర్మతి సెంట్రల్‌ జైలుకు తరలించారు. 2022 ఆగస్టులో ఈడీ కూడా ఆయనను అదుపులోకి తీసుకుని.. సీబీఐ కేసు ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు చేపట్టింది. అనంతరం ఆయుధ లైసెన్సులు, ప్రభుత్వ భూముల కేటాయింపులు తదితర ఆరోపణలకు సంబంధించి సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. తర్వాత రాజేశ్‌కు బెయిల్‌ లభించింది.

దహియాపై గతంలో ఆరోపణలు..
మరో అధికారి గౌరవ్‌ దహియాపై 2019లో ఢిల్లీకి చెందిన ఓ మహిళ చేసిన ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్‌ వేటు పడింది. తాను అప్పటికే వివాహితుడని చెప్పకుండా 2018 ఫిబ్రవరిలో తనను వివాహం చేసుకున్నారని ఆమె ఆరోపించారు. మోసం, క్రిమినల్‌ బెదిరింపులు, వేధింపులకు పాల్పడ్డారని కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఆరోపణలను దహియా ఖండించారు. తనను ఆ మహిళ ‘హనీ ట్రాప్‌’ చేసి బ్లాక్‌మెయిల్‌ చేసిందని ఆరోపించారు. వివాహానికి సంబంధించినవిగా చూపించిన ఫొటోలను మార్ఫింగ్‌ చేశారని కూడా ఆయన వాదించారు. ఈ వ్యవహారంపై గుజరాత్‌ ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేయగా, గాంధీనగర్‌ పోలీసులు కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు. అనంతరం 2023 జూలైలో దహియాను తిరిగి విధుల్లోకి తీసుకుని గాంధీనగర్‌ అదనపు అభివృద్ధి కమిషనర్‌గా నియమించారు.

సర్వీస్‌ రికార్డుల సమీక్షతో ముగింపు..
ఇద్దరు అధికారుల గత సర్వీస్‌ రికార్డులను కేంద్రం సమీక్షించిన అనంతరం ఈ ముందస్తు పదవీ విరమణ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో ఇద్దరు గుజరాత్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారులపై కేంద్ర స్థాయిలో కొనసాగుతున్న అధికారిక చర్యలకు ముగింపు పలికినట్లైంది.

ఇదీ చదవండి: విజయ్‌ టార్గెట్‌ స్టాలిన్‌ సంచలన ఆరోపణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement