గుజరాత్‌లో అమల్లోకి యూసీసీ చట్టం  | President Droupadi Murmu gives assent to Gujarat Uniform Civil Code | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో అమల్లోకి యూసీసీ చట్టం 

Oct 3 2026 5:33 AM | Updated on Oct 3 2026 5:33 AM

President Droupadi Murmu gives assent to Gujarat Uniform Civil Code

సెప్టెంబర్‌ 17న రాష్ట్రపతి ఆమోదం 

గెజిట్‌లో వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం

అహ్మదాబాద్‌: బీజేపీ పాలిత గుజరాత్‌ రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) చట్టం అమల్లోకి వచ్చింది. అసెంబ్లీ ఆమోదం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పంపించిన యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం లభించింది. ఈ విషయాన్ని గుజరాత్‌ ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీన వెలువరించిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. మార్చి 24వ తేదీన అసెంబ్లీ ఆమోదం పొందిన ఈ బిల్లుపై సెప్టెంబర్‌ 17వ తేదీన రాష్ట్రపతి సంతకం చేశారని, గెజిట్‌ నోటిఫికేషన్‌తో ఇది అమల్లోకి వచ్చిందని వివరించింది. 

ఈ చట్టం వివాహం, విడాకులు, వారసత్వం, లివ్‌–ఇన్‌ రిలేషన్‌షిప్‌లకు సంబంధించిన అంశాల్లో గుజరాత్‌తోపాటు, రాష్ట్రం వెలుపల ఉండే నివాసితులకు సైతం వర్తిస్తుంది. ఇందులో బహుభార్యత్వాన్ని నిషేధించారు. వివాహ సమయంలో ఇరుపక్షాల్లో ఎవరికీ భాగస్వామి అంటే భర్త లేదా భార్య జీవించి ఉండకూడదని ఈ చట్టం పేర్కొంటోంది. తద్వారా ఈ చట్టం ఏకపత్నీత్వం లేదా ఏకభర్తృత్వ నిబంధనను తప్పనిసరి చేసింది. బలవంతంగా, ఇష్టానికి విరుద్ధంగా వివాహమాడితే ఏడేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

 అయితే, రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 342 కింద షెడ్యూల్డ్‌ తెగల వారికి, రాజ్యాంగంలోని 21వ భాగంలోని రక్షణ హక్కులు కల్పించిన వారికి మాత్రం యూసీసీ నుంచి మినహాయింపు ఉంటుంది. వివాహ కనీస వయస్సును పురుషులకు 21 ఏళ్లు, మహిళలకు 18 ఏళ్లుగా ఈ చట్టం నిర్ధారించింది. సప్తపది, నిఖా, ఆనంద్‌ కరాజ్, మంగళ్‌ ఫెరా వంటి విధానాల ద్వారా వివాహాలను జరుపుకోవచ్చు. వివాహాల నమోదు తప్పనిసరి. వివాహమైన 60 రోజుల్లోగా రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే రూ.10 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 

విడాకులను సైతం నమోదు చేయించుకోవాలి. కొన్ని తెగల్లో హలాలా వంటి ఆచారాలపై నిషేధం ఉంది. లివ్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్‌లను సైతం తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. అవి ముగిసిపోతే ఆ విషయాన్ని కూడా తెలియపర్చాలి. ఈ సంబంధాల ద్వారా పుట్టిన సంతానానికి వారసత్వ హక్కులు వర్తిస్తాయి. భర్త లేదా భాగస్వామి వదిలేసిన మహిళలు భరణం కోరే హక్కుంటుంది. 

బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో ఇప్పటికే యూసీసీ అమల్లోకి వచ్చిన సంగతి తెల్సిందే.  ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన బిల్లును బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ 2024 ఫిబ్రవరిలో ఆమోదించింది..అనంతరం రాష్ట్రపతి సంతకం చేశారు. 2025 జనవరి 27వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక యూసీసీ చట్టం తీసుకువచ్చిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. ఈ చట్టంలోని నిబంధనల్లో చాలా వరకు గుజరాత్‌ యూసీసీలోనూ ఉన్నాయి. గిరిజనులు, ఇతర ప్రత్యేక వర్గాలకు మినహాయింపులు, రక్షణలు ఇందులోనూ ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement