బిర్యానీ తినేందుకు పుట్టినోళ్లు మనుషులు కాదు : ఎండు చేపలు తింటూ పుట్టాడు! | Nagaon Lok Sabha byelection Dried fish follows biryani in campaign | Sakshi
Sakshi News home page

బిర్యానీ తినేందుకు పుట్టినోళ్లు మనుషులు కాదు : ఎండు చేపలు తింటూ పుట్టాడు!

Oct 2 2026 6:18 PM | Updated on Oct 2 2026 6:25 PM

Nagaon Lok Sabha byelection Dried fish follows biryani in campaign

బిర్యానీ కాదు, ఎండు చేపలు తింటూ పుట్టాడు : మహమ్మద్ బద్రుద్దీన్ అజ్మల్

నగావ్ లోక్‌‌సభ ఉపఎన్నిక నేపథ్యంలో  ‘బిర్యానీ’  వివాదం ఇద్దరు నేతల మద్య మరింత ముదురుతోంది.  బిర్యానీ, బిస్కెట్ల తర్వాత  ఇపుడు ఎండు చేపలు కూడా అభ్యర్థుల తరపున రంగంలోకి దిగాయి. ముఖ్యంగా బిర్యానీ తింటూ ఎంజాయ్‌ చేసేందుకే దేవుడు తనను ఈ భూమిపైకి పంపించాడంటూ కాంగ్రెస్‌ ఎంపీ రకీబుల్‌ హుస్సేన్‌ చేసిన వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఘాటుగా స్పందించారు. బిర్యానీ తినేందుకు పుట్టిన వాళ్లంతా మనుషులు కారు.. జంతువులేనంటూ ప్రతి వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలోని నగావ్‌ లోక్‌సభ సీటుకు ఈ నెల 6వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్న ఇరువురు నేతలు మధ్య జరుగుతున్న మాటల తూటాలు పేలుతున్నాయి. గురువారం సీఎం శర్మ నగావ్‌లోని జురియా ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ "పుట్టిన తర్వాత పసిబిడ్డ తల్లి పాలు తాగుతుందా లేక బిర్యానీ తింటుందా? మొదటి వర్గానికి చెందినవారు మనుషులు, రెండో వర్గానికి చెందినవారు మృగాలు,"అంటూ ఎద్దేవా చేశారు. అంతకుముందు శర్మ, హిందూ పౌరాణిక గాథలలో ఆకలికి పెట్టింది  పేరైన ‘బకాసురుడు’తో హుస్సేన్‌ను పోల్చారు. ప్రభుత్వ పథకాల కోసం కేటాయించిన నిధులను ఆయన దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విమర్శలకు స్పందించిన ఎంపీ హుస్సేన్‌, ‘అవును నేను పుట్టిందే బిర్యానీ తినేందుకు..’అంటూ సమాధానమిచ్చారు. 

మరోవైపు తన ప్రచార కార్యక్రమాలలో ఒకదానిలో, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) అధినేత మహమ్మద్ బద్రుద్దీన్ అజ్మల్ కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సేన్‌ను  పిచ్చోడు అంటూ వ్యాఖ్యానించారు.  అంతేకాదు  బిర్యానీ  కాదు, ఎండిన చేపలు తింటూ పుట్టారంటూ పరోక్షంగా ఆయన బెంగాలీ  అన్నట్టుగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

కాగా ముస్లింలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అక్టోబర్ 6న జరగనుంది. 2024లో ప్రద్యుత్ బోర్డోలోయ్ వరుసగా రెండోసారి ఈ స్థానాన్ని గెలుచుకున్నారు, కానీ ఏప్రిల్ 2026లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిగా దిస్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలవడానికి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు, దీంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.1999 నుండి 2014 వరకు నాగ్‌గావ్ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. ఆతరువాత రాజెన్ గోహైన్ వరుసగా నాలుగుసార్లు బీజేపీ తరపున గెలిచారు. 2019 - 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ దీనిని తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో బీజేపీ మాజీ అధికారి దేవాశిష్ శర్మను అభ్యర్థిగా బరిలోకి దింపింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే శిబమోని బోరా , AIUDFకి చెందిన అజ్మల్ ఆయనకు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు.ఈ నియోజకవర్గంలో తొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థులతో సహా మొత్తం 12 మంది ఇతర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రచార సమయంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కేవలం రాజకీయ విమర్శలతో పాటు వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతుండటంతో, ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement