సాక్షి, తాడేపల్లి: రాయలసీమ తీవ్ర కరువుతో అల్లాడుతుంటే చంద్రబాబు ఈవెంట్లతో కాలం గడుపుతున్నారని.. ‘రైజింగ్ రాయలసీమ’ ఈవెంట్లు ఎవరి కోసం? అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతుకు కావాల్సింది ఈవెంట్లు, పబ్లిసిటీ కాదు.. కష్టకాలంలో ప్రభుత్వ భరోసా. రైతులకు తక్షణమే రుణాల రీ షెడ్యూల్, ఇన్‌పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం అందించాలి’’ అని డిమాండ్ చేశారు.
‘‘కేవలం 388 మండలాలకే కరువు పరిమితం చేయడం అన్యాయం. వాస్తవ పరిస్థితులను పరిశీలించి అర్హమైన అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి. జూన్ నుంచే వర్షాభావ పరిస్థితులు ఉన్నా సెప్టెంబరు చివరి వరకు కరువు ప్రణాళిక ఎందుకు సిద్ధం చేయలేదు?. వేల ఎకరాల్లో చీనీ సహా పండ్ల తోటలు ఎండిపోతున్నాయి. రైతులు లక్షలు ఖర్చుపెట్టి కొత్త బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. టమోటా, అరటి, బత్తాయి, ఉల్లి రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. ఈ రెండేళ్లలో ఉద్యాన రంగానికి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి’’ అంటూ కన్నబాబు నిలదీశారు.
‘‘వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంటే ఇప్పుడు ‘హబ్‌లు ఏర్పాటు చేస్తాం’ అంటూ కొత్త ప్రకటనలు చేయడం వల్ల రైతుకు తక్షణ ప్రయోజనం ఏమిటి?. గతంలో అనేక ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తున్నాయని ప్రచారం చేశారు. ప్రకటించిన వాటిలో ఎన్ని ప్రాజెక్టులు వాస్తవంగా గ్రౌండ్ అయ్యాయో ప్రభుత్వం చెప్పాలి. చంద్రబాబును ‘వాటర్ మ్యాన్’ అని పొగిడే వారు ఒక్కసారి రాయలసీమలో ఎండిపోయిన పొలాలు, రైతుల కష్టాలను చూడాలి. విశాఖకు తన ప్రార్థనల వల్లే వర్షం వచ్చిందని చంద్రబాబు చెప్పుకున్నారు. అదే నిజమైతే నాలుగు నెలల ముందే ప్రార్థించి కరువును ఎందుకు నివారించలేకపోయారు?’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.
‘‘ఇప్పుడు ‘రోడ్డు డాక్టర్లు’ అంటున్నారు.. ముందు ‘కరువు డాక్టర్లను’ తీసుకొచ్చి రైతులను దుర్భిక్షం నుంచి బయటపడేయండి. ఈవెంట్లతో కరువు పోదు.. పబ్లిసిటీతో రైతు కష్టాలు తీరవు. ‘రైజింగ్ రాయలసీమ’ అని పేరు పెట్టడం కాదు.. కరువుతో కుంగిపోతున్న రాయలసీమ రైతును కాపాడండి’’ అని కన్నబాబు హితవు పలికారు.
‘‘మదనపల్లెలో సీఎం చంద్రబాబు మొదలుకాని సినిమాకే విజయోత్సవ సభ నిర్వహించారు. ప్రచారం తప్ప పని చేయకుండా తనకు తానే డబ్బా కొట్టుకోవడం ఒక్క చంద్రబాబుకే సాధ్యం. మదనపల్లెలో ప్రకటించింది లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్ కాదు... లక్ష అబద్ధాల ప్రభుత్వం. పంటలు, తోటలు ఎండిపోయి రైతులు అల్లాడుతుంటే హార్టికల్చర్ హబ్ పేరిట సంబరాలు జరుపుతారా?. వ్యవసాయాన్ని గబ్బు పట్టించి, ఇప్పుడు హబ్‌లంటూ సరికొత్త విన్యాసాలు చేస్తున్నారు.
..గతంలో అమరావతికి హైపర్‌లూప్, బుల్లెట్ ట్రైన్, మెట్రో, సీ-ప్లేన్ అన్నట్లే ఇదీ ఒక పిట్టల దొర కథ. లాక్‌హీడ్ ప్లాంట్, సౌదీ అరాంకో, ఎయిర్‌బస్, అలీబాబా డేటా సెంటర్ తరహాలోనే ఈ హబ్ ప్రచారం కూడా గాల్లో కలిసిపోతుంది. రోజూ మాటలు, ఈవెంట్లతో ప్రజలను మభ్యపెట్టడమే కూటమి ప్రభుత్వ నైజం. 2026-27 బడ్జెట్‌లో హార్టికల్చర్ శాఖకు కేటాయించింది కేవలం రూ. 1,123 కోట్లే. లక్ష కోట్ల ప్రాజెక్టు అని ప్రచారం చేసుకుంటున్న హబ్‌కు బడ్జెట్‌లో పెట్టింది కేవలం రూ. 200 కోట్లా?. హబ్‌లో రూ. 60 వేల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు ఎవరు పెడుతున్నారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి’’ కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: బాబు కుట్రలను దీటుగా ఎదుర్కొందాం


