వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు
స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో సుదీర్ఘ కసరత్తు
జిల్లాల వారీగా క్షేత్రస్థాయి పరిస్థితులపై నేతలతో సమగ్ర సమీక్ష
ఎన్నికల సన్నాహాలు, అభ్యర్థుల ఎంపికపై విస్తృత చర్చ
అభ్యర్థుల ఎంపిక, ఎన్నికలను ఎదుర్కోవడంపై నేతలకు దిశానిర్దేశం
చంద్రబాబు మోసాలు, దౌర్జన్యాలు, స్కామ్‌లు, అరాచకాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు
అందుకే స్థానిక ఎన్నికలను సజావుగా జరిపే ఉద్దేశం చంద్రబాబుకు లేదు
ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపు
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను దీటుగా ఎదుర్కొందామని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. అన్నివర్గాల ప్రజలు చంద్రబాబు పాలనపై ఆగ్రహంతో ఉండటంతో స్థానిక ఎన్నికలను సజావుగా జరిపించే ఉద్దేశం ఆయనకు లేదని చెప్పారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీ నేతలు, శ్రేణులు ధైర్యంగా నిలబడాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసే దిశగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విస్తృత కసరత్తు చేపట్టారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం దౌర్జన్యాలను ఎదుర్కోవడంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలతో ఆయన ముఖాముఖి సమావేశమయ్యారు. జిల్లాలవారీగా క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సుదీర్ఘంగా, సమగ్రంగా సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలం, ఎన్నికల సన్నాహాలు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై నేతలతో విస్తృతంగా చర్చించారు.
ఉత్సాహంగా వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులు
జిల్లాల అధ్యక్షులు, రీజినల్ కో–ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ జిల్లాల వారీగా సమీక్షించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తగిన అభ్యర్థుల ఎంపికలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని, స్థానిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ అన్నివిధాలుగా సన్నద్ధంగా ఉందని పార్టీ నేతలు వైఎస్ జగన్‌కు వివరించారు. వెన్నుపోటు పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, పాలన, స్థానిక సమస్యలు తదితర అంశాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని పలువురు నేతలు వివరించారు. ప్రజల మద్దతు వైఎస్సార్‌సీపీకే ఉందని, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే పార్టీదే విజయమని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ నేతలకు బెదిరింపులు
స్థానిక ఎన్నికల అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలకు అధికార పార్టీ నుంచి బెదిరింపులు వస్తున్నాయని పలువురు నాయకులు వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. పోలీసు వ్యవస్థ దుర్వినియోగం కొనసాగుతోందని, ఎన్నికల్లో పోటీకి అవసరమైన సర్టిఫికెట్ల జారీలో కూడా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వంపై నానాటికీ పెరుగుతున్న అసంతృప్తిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక విపక్షంపై దౌర్జన్యాలకు దిగుతున్నారని వివరించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొందాం
నేతల ద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకున్న వైఎస్ జగన్ మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలను సాఫీగా జరిపించే ఉద్దేశం చంద్రబాబుకు లేదని చెప్పారు. చంద్రబాబు మోసాలు, దౌర్జన్యాలు, స్కామ్‌లు, అరాచకాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ప్రతి వర్గం కూడా చంద్రబాబు పాలన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉందని, అందుకే స్థానిక ఎన్నికలను సజావుగా జరిపే ఆలోచన చంద్రబాబుకు లేదని తెలిపారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీ శ్రేణులు ధైర్యంగా నిలబడాలని వైఎస్ జగన్ నేతలకు సూచించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రతి స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకత్వం సమన్వయంతో పని చేయాలని, కార్యకర్తలకు అండగా నిలవాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికలో స్థానిక పరిస్థితులు, ప్రజాదరణ, పార్టీ పట్ల నిబద్ధత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక జరగాలని నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.


