388 మండలాల్లో కరువు | State government declares drought hit mandals | Sakshi
Sakshi News home page

388 మండలాల్లో కరువు

Oct 2 2026 5:37 AM | Updated on Oct 2 2026 5:37 AM

State government declares drought hit mandals

 ఎట్టకేలకు కరువు మండలాలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

21 జిల్లాల్లోని 283 మండలాల్లో తీవ్ర కరువు.. 105 మండలాల్లో మధ్యస్థం

రాయలసీమ, ప్రకాశంలో తీవ్ర దుర్భిక్షం 

కరువు జాబితాలోనే రాజధాని అమరావతి, సీఎం సొంత నియోజకవర్గం  

పరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఊసెత్తని సర్కారు 

ఆగస్టు 31 వరకు ఉన్న గణాంకాలతోనే కరువు అంచనా 

కరువు ఛాయలున్నా 300 మండలాలకు కరువు జాబితాలో చోటు లేదు

సాక్షి, అమరావతి: కరువు మండలాలపై ఎట్టకేలకు చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరిచింది. వానల్లేక పొలాలు ఎండిపోతున్నా.. రైతులు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నా పట్టించుకోకుండా తీరిగ్గా స్పందించింది. రాష్ట్రంలో 21 జిల్లాల్లోని 388 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ గురువారం జీవో జారీ చేసింది. ఇందులో 283 మండలాల్లో తీవ్ర కరువు, 105 మండలాల్లో మధ్యస్థ కరువు ఉన్నట్టు పేర్కొంది. ప్రకటించిన మండలాల్లో దాదాపు మూడొంతులు తీవ్ర కరువులోనే ఉన్నాయి.  

లోటు ఆగస్టులోనే స్పష్టం.. ప్రకటన అక్టోబర్‌లో.. 
కరువు అంచనాకు తీసుకున్న వర్షపాతం లెక్కలు ఆగస్టు 31తోనే ముగిసినా.. కరువు మండలాలను ప్రకటించడానికి నెల రోజుల సమయం తీసుకోవడం గమనార్హం. వర్షాభావ తీవ్రత ఆగస్టు నెలాఖరుకే స్పష్టమైంది. అయినా సర్కారు వెంటనే కదల్లేదు. కరువు ప్రతిపాదనలు పంపాలంటూ జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం సెప్టెంబర్‌ 18న మెమో పంపింది. అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కరువు కమిటీ సెప్టెంబర్‌ 30న ఒక్క వర్చువల్‌ భేటీలో పరిశీలించి 21 జిల్లాల్లోని మండలాలను సిఫార్సు చేసింది. మర్నాడే జీవో ఇచ్చింది. నెలంతా నాన్చి, చివర్లో హడావుడిగా ప్రక్రియను ముగించారు. 

ఇదేనా ముందస్తు? 
మాన్యువల్‌ ప్రకారం ఖరీఫ్‌ కరువును అక్టోబర్‌ 31లోగా ప్రకటించాలని చెబుతున్న ప్రభుత్వం తాము ముందుగానే ప్రకటించామని చెప్పుకుంటోంది. దీనికి ముందస్తు కరువు ప్రకటన అని పేరు కూడా పెట్టింది. కానీ అక్టోబర్‌ 31 అనేది చివరి గడువు మాత్రమే. కరువు సూచికలు కనిపించిన వెంటనే ప్రకటించాల్సి ఉంటుంది. జూన్‌ నుంచి వానలు లేక మూడు నెలలుగా నష్టపోతున్న రైతులకు అక్టోబర్‌లో వచ్చిన ప్రకటన ముందస్తు ఎలా అవుతుందన్నది అసలు ప్రశ్న.  

ఆలస్యానికి మూల్యం రైతులదే 
కరువు ప్రకటన ఆలస్యమైతే దాని ఆధారంగా అందాల్సిన సాయం కూడా ఆలస్యమవుతుంది. రుణాల రీషెడ్యూల్, ఇన్‌పుట్‌ సబ్సిడీ, కేంద్రానికి నివేదిక, ఉపాధి హామీ అదనపు పనిదినాలు అన్నీ ఈ ప్రకటనతోనే ముడిపడి ఉన్నాయి. వర్షాభావం స్పష్టమైన వెంటనే ప్రకటించి ఉంటే ప్రత్యామ్నాయ పంటల విత్తనాల సరఫరా వంటి చర్యలకు అవకాశం ఉండేదని రైతు సంఘాలు అంటున్నాయి. ఇప్పుడు ఖరీఫ్‌ సీజన్‌ చివరి దశకు చేరుకుంది. 

ప్రకటన వచ్చినా సాయం మాటే లేదు 
నెల ఆలస్యంగా వచ్చిన జీవోలోనూ రైతుకు ఊరటనిచ్చే మాట లేదు. మండలాల జాబితా, గెజిట్‌ ప్రచురణ ఆదేశాలు తప్ప ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎంత, ఎప్పుడు, పంట నష్టం అంచనా ఎప్పటిలోగా, రుణాల రీషెడ్యూల్, వడ్డీ మాఫీ, కేంద్ర సాయం కోసం నివేదిక, పశుగ్రాసం, తాగునీటి ఏర్పాట్లు వంటి ఏ ఒక్కదానిపైనా స్పష్టత ఇవ్వలేదు. ప్రకటనకే నెల పడితే, సాయానికి ఇంకెన్ని నెలలు పడుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

రాయలసీమ, ప్రకాశంలో మరీ దారుణం 
తీవ్ర కరువు మండలాలు అత్యధికంగా రాయలసీమ, ప్రకాశం ప్రాంతాల్లోనే ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలో 28, అనంతపురంలో 27, నంద్యాలలో 26, అన్నమయ్యలో 25, చిత్తూరులో 24, మార్కాపురంలో 19, ప్రకాశంలో 18, కర్నూలులో 15, వైఎస్సార్‌ కడపలో 14 మండలాలను తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించారు. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి జిల్లాలో 22 మండలాలు తీవ్ర కరువులో ఉన్నాయి. 

కుప్పం.. అమరావతిలోనూ కరువే  
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం తీవ్ర కరువు జాబితాలో ఉంది. చిత్తూరు జిల్లాలో ప్రకటించిన 24 మండలాలూ తీవ్ర కరువులో ఉన్నవే. రాజధాని అమరావతి ప్రాంతమైన తుళ్లూరు మండలం కూడా తీవ్ర కరువు జాబితాలో ఉంది. పల్నాడు జిల్లా అమరావతి మండలం మధ్యస్థ కరువులో ఉంది. 

డెల్టా శివారు భూములకూ దెబ్బ 
సాగునీటికి కొదవలేదనుకునే కృష్ణా డెల్టా సైతం కరువు జాబితాలో చేరింది. కృష్ణా జిల్లాలో 8 మండలాలు తీవ్ర, 9 మండలాలు మధ్యస్థ కరువులో ఉన్నాయి. తీవ్ర కరువు జాబితాలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, నాగాయలంక, కోడూరు వంటి మండలాలు డెల్టా చివరి ప్రాంతాలే. బాపట్ల జిల్లాలో ప్రకటించిన 15 మండలాలూ తీవ్ర కరువు కిందే ఉన్నాయి. 

జాబితాలో లేని 300 మండలాలు  
రాష్ట్రంలో 688 మండలాలు ఉంటే కరువు జాబితాలో చోటు దక్కింది 388కే. కరువు ఛాయలు ఉన్నా మిగతా 300 మండలా­ల రైతులకు మొండిచేయి చూపారని రైతు సంఘాలు చెబుతు­న్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోల­వరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు కరువు జాబితాలో చోటు ఇవ్వలేదు.

సగం సీమలోనే.. 
388 కరువు మండలాల్లో 186 రాయలసీమలోనే ఉన్నాయి. తీవ్ర కరువు మండలాలు 28­3 అయితే, వాటిలో 159 సీమలోనే ఉన్నా­యి. 

అన్నీ తీవ్రమే 
అనకాపల్లి, బాపట్ల, మార్కాపురం, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ప్రకటించిన మండలాలన్నీ తీవ్ర కరువు కిందే ఉన్నాయి 

అగ్రస్థానం కడప 
అత్యధికంగా వైఎస్సార్‌ కడప జిల్లాలో 37 మండలాలు కరువు జాబితాలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement