రంగా విగ్రహాలకే ఎందుకు అభ్యంతరం? | KRPS questioned the state government regarding the statues of Vangaveeti Ranga | Sakshi
Sakshi News home page

రంగా విగ్రహాలకే ఎందుకు అభ్యంతరం?

Oct 2 2026 5:18 AM | Updated on Oct 2 2026 5:18 AM

KRPS questioned the state government regarding the statues of Vangaveeti Ranga

సమావేశంలో అభివాదం చేస్తున్న జేఏసీ నేతలు

ఆయన విగ్రహం, దిమ్మె కూల్చడమంటే రంగాను, కాపులను అవమానించడమే 

ఇది యావత్‌ కాపు జాతికి జరిగిన పరాభవం 

చంద్రబాబు ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సిందే 

తెలగ, బలిజ, కాపు జేఏసీ, కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): రాష్ట్రవ్యాప్తంగా వందలు, వేలల్లో ఎంతోమంది రాజకీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటుచేశారని, వాటన్నింటికీ లేని అభ్యంతరం వంగవీటి రంగా విగ్రహాలకు మాత్రమే ఎందుకుని తెలగ, బలిజ, కాపు జేఏసీ (టీబీకే జేఏసీ), కాపు రిజర్వేషన్‌ పో­రాట సమితి (కేఆర్‌పీఎస్‌) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించా­యి. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో రంగా విగ్రహం తొలగించడం, దిమ్మెను కూల్చివేయడాన్ని ఖండించాయి. ఇది రంగా, యావత్‌ కాపు జాతికి జరిగిన అవమానమని జేఏసీ నేతలు మండిపడ్డారు. ఈ ఘటనను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని.. ఘటనకు చంద్రబాబు సర్కారు మూల్యం చెల్లించాల్సిందేనంటూ టీబీకే జేఏసీ, కేఆర్‌పీఎస్‌ నేతలు హెచ్చరించారు. 

విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం తెలగ, బలిజ, కాపు జేఏసీ నేత దాసరి రాము మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం మీద నిరసన తెలిపేందుకు సమావేశమయ్యామన్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో ఏడాది క్రితమే దిమ్మె ఏర్పాటుచేశారని.. అక్కడ విగ్రహం పెట్టడానికి అనుమతివ్వాలని అప్పటినుంచి పంచాయతీ వాళ్లను.. ఎమ్మెల్యేను అడుగుతూనే ఉన్నారన్నారు. కానీ, అక్కడున్న కమ్మ సామాజికవర్గానికి చెందిన వారి ఒత్తిడికి లోనై అనుమతులివ్వడానికి నిరాకరించారని దాసరి రాము చెప్పారు. 

ఏడాదిగా ఎంతగానో ఎదురుచూసి ఇటీవలే కాపులు రంగా విగ్రహం పెట్టారని, అయితే, దానిని దొంగతనంగా తీసుకెళ్లి ఎక్కడో దాచిపెట్టారన్నారు. రెండో రోజు మరో విగ్రహం ఏర్పాటుచేస్తే.. పోలీసుల సహకారంతో ఆ విగ్రహాన్ని తరలించి విగ్రహ దిమ్మెను కూల్చివేశారన్నారు. రాష్ట్రంలో ఏ విగ్రహాలకి లేని లా అండ్‌ ఆర్డర్‌ సమస్య వంగవీటి రంగా విగ్రహానికే ఎందుకు వస్తోందంటూ ఆయన ప్రశ్నించారు. ఈ రౌడీ ముఖం మేం పొద్దున్నే చూడాలా.. కోట్లు ఖర్చుచేసైనా విగ్రహం పెట్టకుండా అడ్డుకుంటామని అంటున్నారట.. ఇదేనా కాపులకు, రంగాకు ఇచ్చే గౌరవమని రాము ప్రశ్నించారు.

ప్రభుత్వం కాపులను అణచివేస్తోంది 
కేఆర్‌పీఎస్‌ రాష్ట్ర కన్వీనర్‌ రావి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కాపులను అణచివేస్తోందని, కుల వివక్ష చూపుతోందని ఆరోపించారు. కాపులను ఏమార్చడానికి, తప్పుదోవ పట్టించడానికే వేరే ప్రాంతంలో విగ్రహం పెట్టిస్తున్నారని మండిపడ్డారు. రంగా విగ్రహం కూ­ల్చి, కాపులపట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని.. ముందుగా నిర్ణయించిన ప్రదేశంలోనే రంగా విగ్రహం ఏర్పాటుచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement