నయవంచన రాజకీయాలు ఇంకెన్నాళ్లు ? | YS Jagan Mohan Reddy lashed out at Chandrababu on BC Reservations | Sakshi
Sakshi News home page

నయవంచన రాజకీయాలు ఇంకెన్నాళ్లు ?

Oct 2 2026 5:08 AM | Updated on Oct 2 2026 5:08 AM

YS Jagan Mohan Reddy lashed out at Chandrababu on BC Reservations

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ ఎంత కాలం మోసం చేస్తారు 

మీరు ఆడుతున్నది డ్రామా అని మీకూ తెలుసు..ఏ కోర్టులోనూ నిలవదనీ తెలుసు 

మీరు ఢిల్లీ వెళ్లినప్పుడు ఎన్నిసార్లు దీనిపై కేంద్రంతో చర్చించారు? 

చెల్లని జీవోలు ఇచ్చి డ్రామాలు ఆడడం వెనుక.. బీసీలను మోసం చేయాలనే కదా? 

మా హయాంలో 139 బీసీ కులాలను కవర్‌ చేస్తూ 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం

11 రాజ్యసభ స్థానాల్లో నాలుగింటిలో బీసీలకు అవకాశం ఇచ్చాం

58 ఎమ్మెల్సీ స్థానాల్లో 28 స్థానాల్లో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాం 

చివరకు స్థానిక సంస్థల్లో కూడా జనరల్‌ స్థానాల్లో బీసీలకే టిక్కెట్లు ఇచ్చాం 

వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీలకు రూ.1.82 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చాం 

మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి, చట్ట సవరణ చేయాలి

సాక్షి,అమరావతి: బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పేరిట సీఎం చంద్రబాబు ఆడుతున్న డ్రామాలు, నయవంచనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. బీసీలపై నయవంచనతో కూడిన రాజకీయాలు ఇంకా ఎన్నాళ్లు చేస్తారు? ఇంకా ఎన్నాళ్లు వారిని మభ్యపెట్టి మోసం చేయాలనుకుంటున్నారని చంద్రబాబుని ప్రశ్నించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ డ్రామాఆడుతున్నారని మీకూ తెలుసు? సుప్రీంకోర్టు గత తీర్పుల వల్ల అది ఏ కోర్టులోనూ నిలబడదని కూడా మీకు తెలుసు? కోర్టులో నిలబడదని తెలిసీ, 44 రోజులుగా మీరు ఆడుతోంది కపట నాటకం కాదా? అంటూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా చంద్రబాబును వైఎస్‌ జగన్‌ కడిగిపారేశారు. ఇవాళ  మీరిచ్చిన జీవోలను కొట్టేస్తూ, హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీసీలకు క్షమాపణలు చెప్పి, లెంపలు వేసుకోండని హితవు పలికారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే... 

కేంద్రాన్ని ఒప్పించండి.. 
చంద్రబాబు గారూ.. నిజంగా మీకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే.. మీరు చేయాల్సింది కేంద్రంలో ఉన్న మీ కూటమి ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి ఆ మేరకు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఒక మార్గాన్ని తీసుకొస్తే గాని, ఈ రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. మరి ఆ దిశగా మీరు ఏం చేశారు? కేంద్రంతో మాట్లాడారా? కనీసం మీ కేంద్ర మంత్రులతో అక్కడి కేబినెట్‌ సమావేశాల్లో ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశారా? మీరు ఢిల్లీ వెళ్లినప్పుడు ఎన్నిసార్లు దీనిపై కేంద్రంతో చర్చించారు? ఇవి చేయకుండా, చెల్లని జీవోలు ఇచ్చి డ్రామాలు చేయడం వెనుక మీ ఉద్దేశం, బీసీలను మభ్య పెట్టి, మోసం చేయాలనే కదా? రాజకీయ స్వార్థం కోసం మీ డ్రామాలు ప్రదర్శించడానికి బీసీలే కావాల్సి వచ్చారా? 

బీసీలపై ప్రేమను చేతల్లో చూపండి 
బీసీలపై ప్రేమ మాటల్లో కాదు చంద్రబాబు గారూ చేతల్లో చూపించాలి. మా ప్రభుత్వ హయాంలో మనసా, వాచా, కర్మణా బీసీల సహా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయపరంగా పైకి తీసుకురావడానికి అన్ని రకాలుగా పనిచేశాం. చరిత్రలో తొలిసారి విప్లవాత్మకమైన చట్టాన్ని, 2019 ఆగస్టులో తీసుకువస్తూ, రాష్ట్రంలోని కార్పొరేషన్లు, బోర్డులు, సొసైటీలు, కమిటీలలోని నామినేటెడ్‌ పదవుల్లో, కాంట్రాక్టు పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాం. పదవులు పొందిన ఎంతోమంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు రాజకీయంగా చైతన్యవంతులయ్యారు.

ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక మెట్టు పైకి వచ్చి, ప్రజాసేవలో పాల్గొన్నారు. దశాబ్దాల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ వర్గాల్లో సరికొత్త నాయకత్వాన్ని తయారు చేసిన ఘనత ఒక్క వైఎస్సార్‌సీపీకే దక్కింది. అంతేకాదు 139 బీసీ కులాలను కవర్‌ చేస్తూ 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. మీ ప్రభుత్వం వద్దే మేం తెచ్చిన చట్టం ఉంది. రెండున్నరేళ్లుగా ఆ చట్టాన్ని ఎందుకు పట్టించుకోలేదు? మా మాదిరి మీరు ఎందుకు అమలు చేయలేదు? కళ్లముందే బీసీలకు మేలు కలిగే చట్టం ఉన్నా ఎందుకు పట్టించుకోలేదు? ఇదీ బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి.  

సంక్షేమ పథకాలతో బీసీలకు బాసట 
అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్‌ కానుక, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహన మిత్ర, చేదోడు, తోడు తదితర సంక్షేమ కార్యక్రమాల్లో బీసీ కుటుంబాలు పెద్ద సంఖ్యలో లబ్ధిపొందాయి. వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీలకు మొత్తం రూ.1.82 లక్షల కోట్ల ప్రయోజనం అందించాం. ఇప్పుడు వీటన్నింటినీ నాశనం చేసి బీసీల ఉసురు తీస్తున్నారు. 

ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బీసీలను పైకి తీసుకురావడం కోసం మేం ఏర్పాటు చేసిన నిచ్చెనలను విరగ్గొట్టారు. పైగా మీరిచ్చిన సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌లు సహా అనేక హామీలను మోసాలుగా మార్చారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే, అది రాజ్యాంగబద్ధమైన చర్యల ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నమీరు, అక్కడ మీ పరపతిని వాడి, కేంద్రాన్ని ఒప్పించి, చట్ట సవరణ ద్వారా 34శాతం రిజర్వేషన్లు తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నాం. 

రాజకీయంగా బీసీలకు మంచి అవకాశాలు కల్పించాం
ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మాకు మేముగా బీసీలకు రాజకీయంగా మంచి అవకాశాలను కల్పించాం. 11 రాజ్యసభ స్థానాల్లో నాలుగు బీసీలకు అవకాశం ఇచ్చాం. 58 ఎమ్మెల్సీ స్థానాల్లో 28 స్థానాల్లో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాం. చివరకు స్థానిక సంస్థల్లో కూడా జనరల్‌ స్థానాల్లో బీసీలకే టిక్కెట్లు ఇచ్చాం. 13 జడ్పీ చైర్‌పర్సన్‌ పదవుల్లో ఆరు, 13 మేయర్‌ పదవుల్లో తొమ్మిది, 84 మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవుల్లో 44 బీసీలకు ఇచ్చాం. 636 మండలాధ్యక్ష పదవుల్లో 239, 639 జడ్పీటీసీల్లో 227 బీసీలకే ఇచ్చాం, చంద్రబాబు గారూ.. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా?

వైఎస్‌ జగన్‌ను కలిసిన వేమూరు విద్యార్థులు
నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌తో యూకేలో ఉన్నతవిద్యకు వెళుతున్నట్లు వెల్లడి 
ఉన్నత పౌరులుగా ఎదగాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్ష
సాక్షి, అమరావతి: బాపట్ల జిల్లా వేమూరుకు చెందిన విద్యార్థులు వేమూరు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు ఆధ్వర్యంలో గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌తో యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌లో ఉన్నతవిద్య అభ్యసించేందుకు వెళుతున్నట్టు వైఎస్‌ జగన్‌కు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువులో ప్రతిభ కనబరిచి, భవిష్యత్తులో సమాజానికి మేలుచేసే ఉన్నత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. వారి ఉన్నత విద్యాభ్యాసం విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. 

‘మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యావ్యవస్థలో చేపట్టిన కార్యక్రమాలు మాలాంటి అనేకమంది విద్యార్థులకు ఉన్నత అవకాశాలు కల్పించాయి. ఆ సమయంలో విద్యారంగంలో మీరు తీసు­కున్న చర్యలు మా ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడ్డాయి’ అని విద్యార్థులు వైఎస్‌ జగన్‌తో పేర్కొన్నారు. వరికూటి అశోక్‌­బాబు కుమారుడు గౌతమ్‌ గైడ్‌ చేయడంతో తాము ఈ సీట్లు సాధించామని చెప్పారు. పేద విద్యార్థులకు ఉన్నతవిద్య అందేలా సహాయం చేసిన గౌత­మ్‌ను వైఎస్‌ జగన్‌ అభినందించారు. వైఎస్‌ జగన్‌ను కలిసిన విద్యార్థుల్లో నడకుర్తి అలెగ్జాండర్, వేణు వాసుమల్ల, మూల్పూరు ప్రసన్నకుమారి, నీరజా భూపతి, రోహిత్‌ వాసుమల్ల ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement