కొచ్చి: దేశవ్యాప్తంగా మడ్-రేసింగ్ (Mud-racing)లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బైక్ రేసర్, పోలీసు అధికారి జీమోన్ ఆంటోనీ (44) కన్నుమూశారు. కొచ్చిలోని కలమస్సేరి సమీపంలోని మంజుమ్మెల్ ప్రాంతానికి చెందిన ఆయన, కలమస్సేరి పోలీస్ స్టేషన్‌లో సీనియర్ సివిల్ పోలీస్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేరళ పోలీస్ విభాగం నుంచి మడ్-రేసింగ్‌లో పాల్గొన్న ఏకైక రేసర్‌గా ఆయన పేరొందారు.
రేసింగ్ రంగంలోకి ప్రవేశం
జీమోన్ ఆంటోనీ తన 18వ ఏట నుంచే రేసింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. ఆ వయసులో ఒక సొంత బైక్ తీసుకోవాలన్న ఆసక్తితో, ప్రముఖ రేసర్ బిను జాన్ సలహా మేరకు ఆయన ‘యామహా RX 135’ బైక్‌ను కొనుగోలు చేశారు. ఆ పరిణామం ఆయన జీవితంలో కీలక మలుపుగా మారింది. అనంతరం బిను జాన్ వద్దే ప్రత్యేక శిక్షణ తీసుకున్న జీమోన్, ప్రొఫెషనల్ బైక్ రేసర్‌గా మారారు. కెరీర్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 100కు పైగా ప్రముఖ పోటీలలో పాల్గొని, అనేక రేసుల్లో విజేతగా నిలిచారు.
సాధించిన విజయాలు, ఛాంపియన్‌షిప్‌లు
ఆయన జాతీయ స్థాయిలో ఎన్నో ప్రతిష్టాత్మక టైటిళ్లను గెలుచుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, తమిళనాడులోని కోయంబత్తూర్ వేదికలుగా జరిగిన ‘ఎంఆర్‌ఎఫ్ 2-వీలర్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్‌షిప్’లను ఆయన కైవసం చేసుకున్నారు. గోవాలో నిర్వహించిన ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ రైడర్ మేనియా 2019’ టైటిల్‌తో పాటు తమిళనాడులోని ఈరోడ్‌లో జరిగిన ‘ఎంఆర్‌ఎఫ్ 2-వీలర్ నేషనల్ స్ప్రింట్ ర్యాలీ ఛాంపియన్‌షిప్’ను కూడా గెలిచారు. అంతేకాకుండా, 2022లో ‘ఎప్‌ఎంఎసస్సీఐ నేషనల్ ర్యాలీ స్ప్రింట్ ఛాంపియన్’గా నిలిచి రేసింగ్ చరిత్రలో తనదైన ముద్ర వేశారు.
ఇదీ చదవండి: ‘వర్క్ ఫ్రమ్ ఫారెస్ట్’.. మూడు రోజులకు రూ.14 వేలు!


