ఎవరైనా దేనికైనా సమాధానం ఇవ్వకుండా అలా చూస్తూ కూర్చుటే వాళ్లని బండరాయిలా చూస్తూ కూర్చున్నావేంటి అని ప్రశ్నిస్తారు. ఇది ఇప్పటి జనరేషన్ ‘జన్ జెడ్’లో కనిపిస్తోందట. నేటి డిజిటల్ ప్రపంచంలో మెసేజ్‌లు, డీఎంలు, గ్రూప్ చాట్లు, సోషల్ మీడియా సంభాషణలు రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. అయితే ఎవరో మన మెసేజ్‌ను చూసి వెంటనే స్పందించకపోతే.. దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారని, సమాధానం ఇవ్వడంలేదని భావించడం సహజం. కానీ ‘జెన్ జెడ్’ ఈ ‘బండరాయి’తనానికి కొత్త అర్థం ఇస్తోంది.
‘జెన్ జెడ్’ డిజిటల్ సంభాషణలో ప్రతి మెసేజ్‌కు వెంటనే సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తోంది. మెసేజ్‌ను సీన్ చేశారంటే అది చూసినట్లు మాత్రమే. అదే సమయంలో రిప్లై ఇచ్చే సమయం, మూడ్ లేదా మానసిక శక్తి లేకపోవచ్చు. అందుకే ఆన్‌లైన్‌లో ఉన్నప్పటికీ సంభాషణకు అందుబాటులో ఉండకపోవచ్చు. చాలామంది మెసేజ్ చదివిన తర్వాత కాస్త సమయం తీసుకుని ప్రశాంతంగా సమాధానం ఇవ్వాలని అనుకుంటారు. అయితే పని, చదువు లేదా ఇతర పనుల్లో పడిపోయినప్పుడు ఆ రిప్లై విషయం మర్చిపోవచ్చు. దీంతో అవతలి వ్యక్తికి కావాలనే తనను పట్టించుకోవడం లేదనే భావన కలగొచ్చు. కానీ అసలు కారణం మాత్రం వేరే అయి ఉండొచ్చు.
‘జెన్ జెడ్’ డిజిటల్ ఎటికెట్‌లో మరో ముఖ్యమైన విషయం.. ప్రతి సంభాషణను ఎక్కువసేపు కొనసాగించాల్సిన అవసరం లేదనుకోవడం. కొన్ని సందర్భాల్లో మెసేజ్‌కు రియాక్షన్ ఇవ్వడం, ‘అవును’, ‘ఓకే’, ‘హ్మ్’ వంటి చిన్న సమాధానాలు ఇవ్వడం ద్వారా సంభాషణను ముగించవచ్చు. ప్రతిసారీ పెద్ద సమాధానం ఆశించడం అవతలి వ్యక్తిపై అనవసరమైన ఒత్తిడిని పెంచవచ్చు. అయితే ప్రతి సందర్భాన్ని ఒకేలా చూడకూడదు. ముఖ్యమైన, సున్నితమైన లేదా పనికి సంబంధించిన మెసేజ్‌ను పదేపదే సీన్ చేసి వదిలేస్తే దాన్ని అవతలి వ్యక్తి మరోలా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సన్నిహిత సంబంధాల్లో తరచూ స్పందించకపోవడం దూరం లేదా కోపానికి సంకేతంగా భావించే అవకాశం ఉంది.
డిజిటల్ ఎటికెట్ అంటే ప్రతి మెసేజ్‌కు వెంటనే సమాధానం ఇవ్వడమే కాదు. అవతలి వ్యక్తి సమయం, భావాలను గౌరవించడం కూడా అందులో భాగమే. వెంటనే స్పందించలేని పరిస్థితిలో ‘ఇప్పుడు బిజీగా ఉన్నాను.. తర్వాత మాట్లాడతాను’ అని చిన్న మెసేజ్ పెట్టడం కూడా సరిపోతుంది. ‘జెన్ జెడ్’ డిజిటల్ కమ్యూనికేషన్‌లో కనిపిస్తున్న ప్రధాన మార్పు ఇదే. ఫోన్ చేతిలో ఉండటం అంటే ప్రతి సంభాషణకు వెంటనే సిద్ధంగా ఉన్నట్లు కాదు. కాబట్టి ఎవరైనా మెసేజ్ చూసి రిప్లై ఇవ్వకపోతే వెంటనే దాన్ని ఇగ్నోర్‌గా భావించాల్సిన అవసరం లేదు. డిజిటల్ ప్రపంచంలో ప్రతి ‘సీన్’కు ఒకే అర్థం ఉండకపోవచ్చని ‘జెన్ జెడ్’ అంటోంది.
ఇదీ చదవండి: శిష్యుడి మృతి.. ప్రేమానంద ఆశ్రమంలో అసలేం జరుగుతోంది?


