‘2027లో బంగారం’.. షాకిస్తున్న బాబా వంగా అంచనాలు! | gold prices reaching new heights Baba Vangas 2027 prophecy predicts | Sakshi
Sakshi News home page

‘2027లో బంగారం’.. షాకిస్తున్న బాబా వంగా అంచనాలు!

Oct 1 2026 8:30 AM | Updated on Oct 1 2026 8:30 AM

gold prices reaching new heights Baba Vangas 2027 prophecy predicts

బంగారం ధరలు ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో రికార్డు స్థాయిలలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2027లో పసిడి ధరలు భారీగా పెరగనున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ అంచనా వైరల్ అవుతోంది. అది బల్గేరియాకు చెందిన ప్రముఖ భవిష్యవేత్త బాబా వంగా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం లేదా నగదు కొరత ఏర్పడి సంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలపై నమ్మకం తగ్గితే పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గుచూపుతారని ఆ ప్రచారంలో పేర్కొంటున్నారు. అయితే బాబా వంగా నిజంగా ఇలాంటి అంచనా వేశారనేందుకు ఎలాంటి ధృవీకరించిన ఆధారం లేదని విశ్లేషకులు అంటున్నారు.

25 నుంచి 40 శాతం పెరుగుతుందా?
ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న కొన్ని పోస్టుల ప్రకారం.. ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఏర్పడితే బంగారం ధరలు 25 నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని బాబా వంగా పేరుతో ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె ఈ విషయాన్ని చెప్పినట్లు నిర్ధారించే ప్రామాణిక రికార్డు ఏదీ లేదు. బాబా వంగా తన భవిష్యవాణులను రాతపూర్వకంగా నమోదు చేసినట్లు తగిన ఆధారాలు కూడా లేవు. ఆమె పేరుతో అనేక అంచనాలు వెలుగులోకి వస్తున్నాయి.

రూ.2.82 లక్షలకు పసిడి?
కొన్ని ఆన్‌లైన్ కథనాల్లో 2027లో భారత్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2.62 లక్షల నుంచి రూ.2.82 లక్షల మధ్యకు చేరవచ్చని పేర్కొంటున్నారు. మరో ప్రచారంలో రూ.2.1 లక్షల వరకు పెరగవచ్చని చెబుతున్నారు. అయితే ఇవి ఆర్థిక సంస్థలు ప్రకటించిన అధికారిక ధరల అంచనాలు కావు. బాబా వంగా పేరుతో ప్రచారంలో ఉన్న భవిష్యవాణికి జోడించిన ఊహాగానాలు మాత్రమే. అందువల్ల వీటిని నిర్ధారిత మార్కెట్ అంచనాలుగా పరిగణించకూడదు.

జేపీ మోర్గాన్ అంచనా ఏంటి?
ఇదిలా ఉండగా.. ప్రముఖ ఆర్థిక సంస్థలు కూడా 2027లో బంగారం ధరలు పెరిగే అవకాశాలపై తమ అంచనాలను వెల్లడించాయి. జేపీ మోర్గాన్ గ్లోబల్ రీసెర్చ్ ప్రకారం.. 2026 నాలుగో త్రైమాసికంలో బంగారం ధర ఔన్సుకు సుమారు 6,000 డాలర్లుగా ఉండవచ్చని అంచనా. 2027 చివరి నాటికి ఔన్సుకు 6,300 డాలర్లకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకులు,పెట్టుబడిదారుల నుంచి బంగారానికి ఉన్న డిమాండ్ వంటి అంశాలు ధరలను ప్రభావితం చేయవచ్చని తెలిపింది. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానం, భౌగోళిక రాజకీయ పరిణామాలపై ఈ అంచనా ఆధారపడి ఉంటుందని జేపీ మోర్గాన్ పేర్కొంది.

యూబీఎస్, డాయిష్ బ్యాంక్ అంచనాలు
యూబీఎస్ కూడా 2027 తొలి అర్ధభాగంలో బంగారం ధర ఔన్సుకు 5,000 డాలర్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు డాయిష్ బ్యాంక్ 2026 నాలుగో త్రైమాసికానికి ఔన్సుకు 4,600 డాలర్ల లక్ష్యాన్ని కొనసాగించింది. ఇటీవల బంగారం ధరల్లో వచ్చిన దిద్దుబాటు దాదాపుగా ముగిసినట్లేనని ఆ సంస్థ పేర్కొన్నట్లు సెప్టెంబర్ విశ్లేషణను గుర్తుచేస్తూ ట్రేడింగ్‌వ్యూ తెలిపింది.

ఎవరీ బాబా వంగా?
బాబా వంగా అసలు పేరు వాంగెలియా పాండేవా దిమిత్రోవా. 1911లో జన్మించిన ఆమె బల్గేరియాకు చెందిన భవిష్యవాణులు చెప్పే మహిళ. మూలికా వైద్యురాలిగా ప్రసిద్ధి చెందారు. 12 ఏళ్ల వయసులో సుడిగాలిలో చిక్కుకున్న తర్వాత ఆమె చూపును కోల్పోయినట్లు చెబుతుంటారు. సెప్టెంబర్ 11 ఉగ్రదాడులు, చెర్నోబిల్ విపత్తు, ప్రిన్సెస్ డయానా మరణం, 2004 హిందూ మహాసముద్ర సునామీ, బ్రెగ్జిట్, ఐసిస్ ఎదుగుదల వంటి అనేక సంఘటనలను ఆమె ముందుగానే చెప్పారని అంటారు. ఆమె చెప్పిన అంచనాల్లో సుమారు 85 శాతం నిజమయ్యాయని కూడా ప్రచారం ఉంది.

ఇదీ చదవండి: ప్రపంచానికి షాక్‌.. 31 ఏళ్ల సన్యాసి కఠోర సాధన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement