రోడ్డు దాటుతుంటే ప్రమాదం.. తప్పెవరిది? | Who Is at Fault Pedestrian or Driver | Sakshi
Sakshi News home page

రోడ్డు దాటుతుంటే ప్రమాదం.. తప్పెవరిది?

Oct 1 2026 7:41 AM | Updated on Oct 1 2026 7:42 AM

Who Is at Fault Pedestrian or Driver

రోడ్డుపై నడిచే వారికి ప్రతి అడుగు ఓ ప్రమాదమే. ముఖ్యంగా రోడ్డు దాటే సమయంలో వాహనం ఢీకొంటే బాధ్యత ఎవరిది అనే ప్రశ్న తలెత్తుతుంది. పాదచారి తప్పు చేశాడా? డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపాడా? అనే విషయాన్ని కేవలం ప్రమాదం జరిగిన తీరు చూసి నిర్ణయించలేం. ప్రమాదం జరిగిన ప్రదేశం, ట్రాఫిక్ నిబంధనలు, వాహన వేగం, పాదచారి పరిస్థితి, డ్రైవర్ అప్రమత్తత తదితర అంశాలను పరిశీలించిన తర్వాతే బాధ్యత ఎవరిదనేది చట్టం నిర్ణయిస్తుంది.

పాదచారుల భద్రతకూ నిబంధనల్లో ప్రాధాన్యం
2017లో వచ్చిన మోటర్ వెహికల్స్ (డ్రైవింగ్) రెగ్యులేషన్స్ ప్రకారం పాదచారులను రహదారి భద్రతలో ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు. వాహన డ్రైవర్లు, వాహనాల్లో ఉన్నవారు పాదచారులు, సైకిల్‌దారులు, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్ లేని చోట పాదచారులు రోడ్డు దాటుతున్నప్పుడు వాహన వేగాన్ని తగ్గించాలి. అవసరమైతే వాహనాన్ని ఆపి పాదచారికి ముందుగా దారి ఇవ్వాల్సి ఉంటుంది. రోడ్డుపక్కన పాదచారుల కోసం ఫుట్‌పాత్ లేదా సైకిళ్లకు ప్రత్యేక మార్గం ఉంటే, సాధారణంగా వాహనాలను అక్కడ నడపకూడదు.

జీబ్రా క్రాసింగ్‌ దగ్గర మరింత అప్రమత్తత
పాదచారులు రోడ్డు దాటేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతమే జీబ్రా లేదా పాదచారి క్రాసింగ్. ఇలాంటి ప్రాంతాలకు చేరుకునే సమయంలో డ్రైవర్ మరింత జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కూడా వాహనాన్ని పాదచారి క్రాసింగ్‌కు ముందే ఆపాలి. సిగ్నల్ వాహనాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ, అప్పటికే పాదచారి కూడలి లేదా సంబంధిత క్రాసింగ్‌లో ఉన్నట్లయితే అతడికి దారి ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల ప్రమాద సమయంలో పాదచారి ఎక్కడ ఉన్నాడు, వాహనం ఎలా నడిపారు వంటి అంశాలు కీలకంగా మారతాయి.

తప్పుడు విధానంలో రోడ్డు దాటితే?
పాదచారి రోడ్డును ఎక్కడి నుంచి దాటుతున్నాడన్న ఒక్క అంశంతోనే ప్రమాదానికి బాధ్యుడిని నిర్ణయించరు. ఆ ప్రాంతంలో పాదచారుల కోసం మార్గం లేదా సిగ్నల్ ఉందా, వాహనం ఎంత వేగంతో వచ్చింది, డ్రైవర్‌కు ప్రమాదాన్ని గుర్తించి వాహనాన్ని అదుపు చేసేంత సమయం ఉందా వంటి అంశాలను దర్యాప్తులో పరిశీలిస్తారు. అంటే పాదచారి నిర్లక్ష్యం కనిపించినా, డ్రైవర్ బాధ్యతను పూర్తిగా విస్మరించరు. అదే విధంగా ప్రతి ప్రమాదానికీ డ్రైవర్‌దే తప్పు అని కూడా ముందుగానే నిర్ణయించలేం.

డ్రైవర్ నిర్లక్ష్యానికి ఎలాంటి చర్యలు?
డ్రైవర్ నిర్లక్ష్యంగా లేదా ప్రమాదకరంగా వాహనం నడిపి ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించినట్లు తేలితే భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)సెక్షన్ 281 కింద చర్యలు తీసుకోవచ్చు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి మరణించి, ఆ ఘటన ఉద్దేశపూర్వక హత్య పరిధిలోకి రాకపోతే బీఎన్‌ఎస్‌ సెక్షన్ 106(1) కింద చర్యలు ఉండొచ్చు. ఈ సెక్షన్ కింద గరిష్ఠంగా ఐదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత గాయపడిన వారికి వీలైనంత త్వరగా వైద్యం అందేలా చూడటం కూడా డ్రైవర్ బాధ్యత. మోటర్ వెహికల్స్ యాక్ట్ సెక్షన్ 134 ప్రకారం పోలీసులకు అవసరమైన సమాచారం అందించడంతో పాటు, ఘటనను వీలైనంత త్వరగా, గరిష్ఠంగా 24 గంటల్లో సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలి.

బాధితులకు పరిహారం ఎలా లభిస్తుంది?
రోడ్డు ప్రమాదాల్లో మరణం లేదా తీవ్ర గాయాలకు గురైన వారికి మోటర్ వెహికల్స్ యాక్ట్‌లో పరిహారం పొందే నిబంధనలు ఉన్నాయి. సెక్షన్ 164 ప్రకారం వాహనం వినియోగంతో జరిగిన ప్రమాదంలో మరణిస్తే చట్టబద్ధ వారసులకు రూ.5 లక్షలు, తీవ్ర గాయాలైతే రూ.2.5 లక్షల పరిహారం కల్పించే నిబంధన ఉంది. ఈ నిబంధన కింద పరిహారం కోరే వ్యక్తి వాహన యజమాని లేదా వాహనానికి సంబంధించిన తప్పును నిరూపించాల్సిన అవసరం లేదు. అదనంగా మోటర్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (ఎంఏసీటీ) ద్వారా కూడా మరణం లేదా గాయాలకు సంబంధించిన పరిహారం కోసం దావా చేయవచ్చు. మొత్తంగా చూస్తే.. రోడ్డు దాటే సమయంలో ప్రమాదం జరిగితే పాదచారి లేదా డ్రైవర్‌లో ఎవరో ఒకరినే ముందుగానే దోషిగా నిర్ణయించలేం. ఘటనాస్థల ఆధారాలు, ట్రాఫిక్ నిబంధనలు, ఇరువురి ప్రవర్తన, ప్రమాద పరిస్థితులను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే బాధ్యతను నిర్ణయిస్తారు.

ఇదీ చదవండి: పెంటగాన్‌పై సైబర్ దాడి.. భారీగా సైనిక సిబ్బంది వివరాలు లీక్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement