ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఐఏఎస్ అధికారి దివ్యా మిట్టల్ పేరు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పదమూడేళ్ల సర్వీసు తర్వాత హఠాత్తుగా ఐఏఎస్‌కు రాజీనామా చేసిన ఆమె.. రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం ఊపందుకుంది. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. జెన్‌జీ ఉద్యమ ప్రభావం కూడా రాజకీయ పార్టీలను కొత్త ముఖాల వైపు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో దివ్యా మిట్టల్‌ను తమవైపు తిప్పుకునేందుకు పలు పార్టీలు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే.. రాజకీయ ప్రవేశంపై దివ్యా మిట్టల్ మాత్రం ముందుగానే ఓ స్పష్టమైన నిర్ణయంతో ఉన్నట్లు తాజాగా ఆమె వ్యాఖ్యలతో తేలింది.
తాజాగా బీజేపీ నేత ప్రశాంత్ ఉమ్రావ్ చేసిన సోషల్ మీడియా పోస్టు.. యూపీ రాజకీయాలను కుదిపేసింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్(43) రహస్యంగా కలిశారని అన్నారాయన. ‘‘చీకటి మాటున భేటీ’’ అంటూ చేసిన సంచలన ఆరోపణతో చేసిన ఈ పోస్టుతో.. ఆమె కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో.. యువతలో మంచి క్రేజ్ ఉన్న ఆమెను ప్రత్యక్షంగానే సమాజ్‌వాదీ పార్టీ ఆహ్వానించడం, అదే సమయంలో కాంగ్రెస్‌తో ఆ పార్టీకి జరుగుతున్న సీట్ల పంపకం పంచాయితీ, రాహుల్‌ను ఆమె కలిశారన్న ప్రచారం ఈ ఎపిసోడ్‌ను మలుపుల మీద మలుపులు తిప్పుతోంది.

దివ్యకు అఖిలేశ్ ఆహ్వానం
దివ్యా మిట్టల్ రాజకీయ ప్రవేశం నేపథ్యంలో ఎస్పీ–కాంగ్రెస్ సీట్ల పంచాయితీకి కూడా ఈ వ్యవహారం ముడిపడింది. కాంగ్రెస్ 150 సీట్లలో పోటీ చేయాలని చెబుతుండగా.. ఎస్పీ 350 స్థానాల్లో సన్నాహాలు చేస్తోందన్న వార్తలు వచ్చాయి. ఇక దివ్యా మిట్టల్ విషయంలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు మరో చర్చకు దారితీశాయి. ఆమె రాజకీయాల్లోకి వస్తున్న విషయంపై స్పందిస్తూ.. ‘‘హరా ఔర్ లాల్ గమ్ఛా డాల్ లేన్’’ అంటూ ఎస్పీ పార్టీ రంగులను సూచించేలా వ్యాఖ్యానించారు. ఆమె ఎస్పీలో చేరితే స్వాగతిస్తామన్న సంకేతంగా ఈ వ్యాఖ్యను తీసుకున్నారు.
ఏం జరిగిందో చెప్పిన దివ్యా మిట్టల్..
రాహుల్ గాంధీతో రహస్య భేటీ అంటూ వచ్చిన ప్రచారంపై దివ్యా మిట్టల్ సుమారు తొమ్మిది నిమిషాల వీడియో విడుదల చేసి స్పందించారు. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ.. తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ధృవీకరించిన ఆమె.. ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేశారు. యూపీ నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమవుతుందని, అది ఏ పార్టీ జెండా కింద ఉండదని తెలిపారు. పార్టీతో కాదు.. ప్రజలతో కలిసి రాజకీయాలు అనేదే తన విధానమని చెప్పారు. ‘‘గత నెల ఐఏఎస్‌కు రాజీనామా చేశాను. ఎన్నో ప్రశ్నలను వదిలి వచ్చాను. తర్వాత ఏంటి? అనే ప్రశ్నకు సమాధానం.. రాజకీయాలు’’ అని ఆమె అన్నారు. ఉత్తరప్రదేశ్ తన కర్మభూమి అని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పని చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.
ప్రజల గొంతుకగా..
ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్నా.. వాటి అమలు జరగని సందర్భాలు తనను రాజకీయాల వైపు నడిపించాయని దివ్యా మిట్టల్ చెప్పారు. మంజూరైన పాఠశాలలు నిర్మాణానికి నోచుకోకపోవడం, భూములు కేటాయించినా లబ్ధిదారులకు అందకపోవడం, అధ్వాన్న రహదారులు, పేపర్ లీక్‌లతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినడం వంటి అంశాలను ప్రస్తావించారు. మిర్జాపూర్ జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు లహురియా దహ్ గ్రామంలో ఓ మహిళ.. ఇల్లు, పింఛన్ కాకుండా పిల్లల కోసం పాఠశాల కావాలని కోరిన ఘటనను గుర్తుచేశారు. నిధులు, నిబంధనలు, అనుమతులు ఉన్నప్పటికీ మూడేళ్లు గడిచినా నిర్మాణం ప్రారంభం కాలేదన్నారు. ‘‘అన్నీ ఉన్నాయి.. కానీ ఉద్దేశం లేదు’’ అంటూ వ్యవస్థలో నిర్ణయం, అమలు మధ్య ఉన్న అంతరాన్ని వివరించారు.
कुछ दिन पहले IAS से त्यागपत्र दिया था और आपके मन में कई सवाल छोड़ दिए थे। अपनी बात इस वीडियो में कह दी है। अगर आपको लगे कि ये आपकी भी बात है, तो 9198956957 पर whatsapp मैसेज करिए। pic.twitter.com/mtS6gzBzRw
— Divya Mittal (@divyamittal_IAS) September 29, 2026
ఐఐటీ–ఐఐఎం చదువు.. లండన్‌లో ఉద్యోగం
దివ్యా మిట్టల్ 2013 బ్యాచ్ యూపీ కేడర్ ఐఏఎస్ అధికారి. ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరులో చదువుకున్నారు. సివిల్ సర్వీసెస్‌లోకి రాకముందు లండన్‌లో ఎక్సోటిక్ డెరివేటివ్స్ ట్రేడర్‌గా పనిచేశారు. సంత్‌కబీర్‌నగర్, మిర్జాపూర్, డియోరియా జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. మిర్జాపూర్ కలెక్టర్‌గా మారుమూల లహురియా దహ్ గ్రామానికి పైపుల ద్వారా తాగునీరు అందించే కార్యక్రమంతో గుర్తింపు పొందారు. గోండా సీడీవో, యూపీ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ జాయింట్ ఎండీ, బరేలీ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. తర్వాత యూపీ రూరల్ రోడ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా ఆగస్టులో ఐఏఎస్‌కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. తీవ్ర చర్చనీయాంశంగా మారారు.
ఇదీ చదవండి: లండన్ పరీక్ష నుంచి భారతీయుల పోరాటం దాకా..


