సిరిసిల్ల ప్రజాపాలన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
టీఆర్‌ఎస్ హయాంలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారింది... సిరిసిల్ల ఓట్లను కేసీఆర్ కుటుంబం పచ్చనోట్లుగా మలుచుకుంది
గత పాలకులు మానేరు ఇసుక, బతుకమ్మల చీరల్లోనూ కమీషన్లకు కక్కుర్తి పడ్డారు
వెయ్యి రోజుల ప్రజాపాలనలో నేత కార్మికుల కోసం రూ.1,741 కోట్లు ఖర్చు చేశాం
సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తాం..
చేనేత బిడ్డను శాసనమండలికి పంపుతాం..
కుటుంబ పాలన కావాలో.. ప్రజాపాలన కావాలో తేల్చుకోవాలన్న సీఎం
సిరిసిల్ల/సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆర్థికంగా విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. సిరిసిల్ల అంటే సిరులకు నిలయమని, అయితే పదేళ్ల టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) హయాంలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందని విమర్శించారు. సిరిసిల్ల ఓట్లను కేసీఆర్ కుటుంబం పచ్చనోట్లుగా మలచుకుని రూ.లక్షల కోట్ల ఆస్తులను సంపాదించుకుందని, గోదావరి నీళ్లు, మానేరు ఇసుక, చివరికి ఆడబిడ్డల బతుకమ్మల చీరల్లోనూ కమీషన్లకు కక్కుర్తి పడ్డారని ఆరోపించారు. తాము రాష్ట్రంలోని పేదలకు రేషన్‌కార్డులిచ్చి సన్న బియ్యం ఇస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు చేస్తున్నామని అన్నారు. రూ.20,617 కోట్ల రుణమాఫీ చేశామని, ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తూ.. అప్పులకు వడ్డీలు కడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరా మహిళా శక్తి చీరలు అందిస్తున్నామని చెప్పారు.
బీఆర్‌ఎస్ అమలు చేసిన ఏ ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయకుండా కొనసాగిస్తున్నామని సీఎం చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తల దెబ్బకు గజ్వేల్ గడీ కూలిందని, ఇప్పుడు సిరిసిల్ల గడీని కూల్చేందుకు ఫిరంగులై పేలుదామన్నారు. రానున్న ఎన్నికలలో సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఢిల్లీ హైకమాండ్‌ను ఒప్పించి మంత్రివర్గంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. సిరిసిల్ల అభివృద్ధి తన బాధ్యత అని అన్నారు. బుధవారం కరీంనగర్‌లో రూ.51 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారం¿ోత్సవాలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప్‌లు, పలు కార్పొరేషన్ల చైర్మన్లతో కలిసి 3 కి.మీ పాదయాత్రగా వెళ్లి, బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రజా పాలన బహిరంగ సభలో మాట్లాడారు.
ఆరు సార్లు గెలిచినా ఆత్మహత్యలు ఎందుకు ఆపలేదు?
‘2009 నుంచి 2023 వరకు ఆరుసార్లు కేటీఆర్ గెలిచినప్పటికీ చేనేత కార్మికుల ఆత్మహత్యలను ఎందుకు ఆపలేదు? కార్మికుల గల్ఫ్ వలసలు ఎందుకు ఆగలేదని ప్రజలు ఆలోచించాలి. గల్ఫ్ దేశాలకు వెళ్లిన కార్మికులు ప్రమాదవశాత్తు మరణించినప్పుడు కనీసం వారి మృతదేహాలను స్వస్థలాలకు తీసుకురాలేని పరిస్థితి గత పాలనలో ఉండేది. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక పాలసీ రూపొందించాలని స్థానిక నాయకులు కోరగా, విదేశాల్లో వలస కార్మికులు మరణిస్తే మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడంతో పాటు సంబంధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించేలా ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వెయ్యి రోజుల ప్రజాపాలనలో నేత కార్మికుల కోసం రూ.1,741 కోట్లు ఖర్చు చేశాం. రాజన్న సిరిసిల్ల జిల్లాకు రూ.1,700 కోట్ల నిధులు మంజూరు చేశాం. వేములవాడలో నూలు డిపో ఏర్పాటు చేశాం. వేములవాడ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకున్నాం. ఈ పండుగకు ప్రభుత్వం చిలక పచ్చ చీరలను పంపిణీ చేస్తుంది. సిరిసిల్లలో మార్పు రాబోతోంది. రాబోయే శాసనమండలి ఎన్నికల్లో ఒక పద్మశాలి బిడ్డను శాసనమండలికి పంపించాలి.
మానేరు ఇసుకను దోచుకున్నారు..
2004, 2006, 2008 ఎన్నికల్లో మూడుసార్లు కరీంనగర్ జిల్లా ప్రజలు కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించినప్పటికీ 2009లో కేసీఆర్ పాలమూరుకు వలస వెళ్లారు. కరీంనగర్, పాలమూరు ప్రజలను మోసం చేస్తూ గజ్వేల్‌కు వెళ్లారు. కల్వకుంట్ల కుటుంబం రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడింది. గోదావరి జలాలను అడ్డం పెట్టుకుని మానేరు ఇసుకను దోచుకున్నారు. నేరెళ్ల బాధితులు ఇందుకు సజీవ సాక్ష్యం. ఇసుక దోపిడీని అడ్డుకున్న నేరెళ్ల దళితులను లారీలతో తొక్కించి చంపించింది వాస్తవం కదా? ఆనాడు మీరాకుమార్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబులను నిర్బంధించిన మాట వాస్తవం కాదా? మానేరు నదిపై నిర్మించిన చెక్‌డ్యాంలు కొట్టుకుపోయి కేసీఆర్ ఇంట్లో నోట్ల కట్టలుగా తేలాయి. కేసీఆర్ కాళేశ్వరంలో రూ.లక్ష కోట్లు సంపాదిస్తే.. కేటీఆర్, రవీందర్‌రావు, సంతోష్‌రావు మానేరు ఇసుక దొంగలు. మిడ్ మానేరులో నిర్వాసితుల రూపంలో సంతోష్‌రావు, సౌమ్యారావు, రవీందర్‌రావు, 2015లో ఇళ్ల పట్టాలు, ముంపు బాధితుల ప్యాకేజీలు తీసుకున్నారు. ఈ రోజు సంతోష్‌రావు రూ.10 వేల కోట్లు ఎలా సంపాదించాడు? వేములవాడ శివయ్య, భద్రాచలం రామయ్యను మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ ఒక్కరే. మిడ్ మానేరు డ్యాం ముంపులో ఇళ్లు కోల్పోయిన కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇళ్ల స్థలాలు పొందలేదా?
కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలి..
అమెరికాలో ఎన్ని బాత్రూంలు కడిగారో, వేల కోట్లు ఎలా సంపాదించారో కేటీఆర్ వెల్లడించాలి. హైటెక్ సిటీలో డెక్కన్ సరాయి పేరిట ఉన్న ఫైవ్‌స్టార్ హోటళ్లు, ఎట్ హోం పేరిట ఉన్న అపార్ల్‌మెంట్లు కేటీఆర్ కుటుంబానికి ఎలా వచ్చాయి? ఈ చిట్టా నాడు అసెంబ్లీలో చెప్పకుండా దాచాను. ఇంకా పార్ట్ –2 ఉంది. అసెంబ్లీలో కూర్చోబెట్టి కడిగేస్తా. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావు ఆక్రమించిన భూముల మీద కేటీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలి. కేసీఆర్ సీఎం అయ్యి..ఆయన కుమారుడు, అల్లుడు, కొడుకు, తోడల్లుడి కుమారుడు, వారి కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు వస్తే.. మేం పొన్నం, అడ్లూరిలని మంత్రులను చేసుకున్నం. సామాజిక న్యాయం పాటించాం. దళితుడు కుర్చీలో కుర్చుంటే ఓర్వలేని కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు. కుటుంబ పాలన కావాలో, ప్రజాపాలన కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి. వైఎస్–డీఎస్‌ల కాంబో తరహాలోనే రేవంత్–మహేశ్ కాంబోలో మళ్లీ గెలుస్తాం..’ అని రేవంత్ అన్నారు.
ఎన్నిసార్లైనా కేంద్రాన్ని కలవాల్సిందే..
‘తాము ఎన్నికలపుడే రాజకీయాలు చేస్తామని అభివృద్ధి కోసం కేంద్రంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సాగుతామని ముఖ్యమంత్రి అన్నారు. రూ.వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు నిర్మించినా కేంద్రం అనుమతులు ఇవ్వకపోతే ప్రయోజనం ఉండదు. కానీ కొందరు మా పర్యటనలను లెక్కేస్తున్నారు. సమస్యలు పరిష్కరించుకునేందుకు ఎన్నిసార్లైనా కేంద్రాన్ని కలవాల్సిందే. సిద్ధాంతాలు వేరైనా అభివృద్ధి కోసం ఒకరికొకరం సహకరించుకుంటాం అని చెప్పారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో 10.50 లక్షల మంది పర్మినెంట్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు 4 కోట్ల మందికి సేవలందిస్తున్నారు. 3% ఉద్యోగులు 97% మందికి సేవలందిస్తున్నారు. మీరంతా కష్టపడితేనే పేదలకు న్యాయం జరుగుతుంది..’ అని అన్నారు.
ప్రజాపాలన–2 వస్తుంది: పీసీసీ చీఫ్
పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. వేములవాడ రాజన్న సాక్షిగా ప్రజాపాలన–2 తెలంగాణ రాష్ట్రంలో తప్పనిసరిగా వస్తుందని అన్నారు. సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడి ఆస్తులు ప్రతి ఎన్నికకు పెరుగుతున్నాయని, ఏ వ్యాపారం చేస్తే ఆస్తులు పెరిగాయో చెప్పాలని ప్రశ్నించారు. రూ.కోట్ల జీతాలు తీసుకుంటున్న ప్రతిపక్ష నాయకుడు ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు. మంత్రి అజహరుద్దీన్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, వేణుగోపాల్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర మంత్రులతో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా పాల్గొన్నారు.


