ఇండి కూటమి భేటీలో దేశ వ్యాప్తంగా నిరసనలకు నిర్ణయం | INDIA alliance key decisions | Sakshi
Sakshi News home page

ఇండి కూటమి భేటీలో దేశ వ్యాప్తంగా నిరసనలకు నిర్ణయం

Sep 30 2026 4:18 PM | Updated on Sep 30 2026 5:27 PM

INDIA alliance key decisions

ఢిల్లీలో మంగళవారం ఇండి కూటమి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల సంఘం పనితీరు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై చర్చించేందుకు ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఈ సమావేశం జరిగింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించేందుకు పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెట్టే నోటీసు ముసాయిదాపై కూటమి చర్చించింది.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘అక్టోబర్ 2 నుంచి 8 వరకు ఇండి కూటమి నేతలం జిల్లా, కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసనలు చేపడతాం. అక్టోబర్ 6న ప్రతిపక్ష ఎంపీలు ఎన్నికల సంఘం వరకు పాదయాత్ర నిర్వహిస్తాం. సంస్థలను ఏ విధంగా స్వాధీనం చేసుకుంటున్నారో రాష్ట్రపతికి తెలియజేయడానికి ప్రతిపక్ష నాయకులం అందరం అక్టోబర్ రెండవ వారంలో  కలవడానికి అపాయింట్‌మెంట్ కోరుతాం. 

అక్టోబర్-నవంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా ఐదు ప్రధాన ర్యాలీలు నిర్వహిస్తాము. ర్యాలీల తేదీలు, వేదికలను త్వరలోనే ఖరారు చేస్తాము. నవంబర్ 1న ఢిల్లీలో ఒక భారీ ర్యాలీని నిర్వహిస్తాం. ఓటు చోరీపై రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ చెప్పే మాటలను ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు’’ అని తెలిపారు.

కాగా, ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిలిపివేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఓటరు జాబితాల నుంచి పేర్లు తొలగించిన అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని ఇండి కూటమి నేతలు కోరుతున్నారు. కూటమిలో 21 పార్టీలు పాల్గొన్నాయి. గతంలో 23 పార్టీలుగా ఉన్న ఇండి కూటమి నుంచి డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశానికి దూరంగా ఉన్నాయి. 

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సమావేశానికి హాజరుకావడం కాలేదు. ఆయన స్థానంలో ఎంపీలు హరేంద్ర మాలిక్, మొహిబ్బుల్లా నద్వీ పాల్గొన్నారు. సమావేశానికి డీఎంకే దూరంగా ఉన్నప్పటికీ, జ్ఞానేశ్ కుమార్‌పై పార్లమెంట్‌లో తొలగింపు తీర్మానం వస్తే మద్దతు ఇస్తామని ఆ పార్టీ ప్రతినిధి టీకేఎస్ ఎలంగోవన్ తెలిపారు.

ఇదీ చదవండి: అప్పుడు అన్ని వేళ్లు బాబు వైపు చూపించలేదా?: రాచమల్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement