భారత షూటర్ నీరూ ధండాకు పసిడి పతకం
ఏషియాడ్ మహిళల ట్రాప్ ఈవెంట్‌లో తొలిసారి గోల్డ్
టీమ్ విభాగంలో భారత్‌కు రజతం కూడా
ఆసియా క్రీడల షూటింగ్‌లో మంగళవారం పోటీలకు పదో రోజు... ఇప్పటి వరకు ఎన్నో అంచనాలు పెట్టుకున్న టాప్ షూటర్లంతా విఫలం కావడంతో మన దేశానికి ఒక్క వ్యక్తిగత స్వర్ణం కూడా దక్కలేదు. కానీ పదో రోజు ఎట్టకేలకు ఆ సంబరం తీరింది. మహిళల ట్రాప్ ఈవెంట్‌లో నీరూ ధండా సత్తా చాటి బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆసియా క్రీడల చరిత్రలో కూడా ఈ ఈవెంట్‌లో ఇదే తొలి పసిడి పతకం కావడం విశేషం. మరోవైపు నీరూ అత్యుత్తమ ప్రదర్శన కారణంగానే టీమ్ ఈవెంట్‌లో కూడా భారత్‌కు రజతం లభించింది. ఈ పతకంలో నీరూకు ఆషిమా ఆహ్లావత్, మనీషా కీర్ తోడుగా నిలిచారు. మొత్తంగా ఇప్పటివరకు 14 పతకాలు గెలుచుకున్న మన షూటింగ్ బృందం మిగిలిన రెండు రోజుల్లో మరిన్ని పతకాలపై గురి పెట్టింది.
నగోయా: ఆసియా క్రీడల షూటింగ్‌లో భారత్ ఖాతాలో తొలి వ్యక్తిగత స్వర్ణం చేరింది. మహిళల ట్రాప్ ఈవెంట్‌లో భారత షూటల్ నీరూ ధండా అగ్రస్థానంలో నిలిచి పసిడిని సొంతం చేసుకుంది. మొత్తం 30 టార్గెట్‌లలో ఆమె 28 టార్గెట్‌లను విజయవంతంగా ఛేదించగలిగింది. సున్ యునాంగ్ (చైనా; 26) రజత పతకం గెలుచుకోగా, హాజర్ అబ్దుల్ మాలిక్ (కువైట్; 21)కు కాంస్యం దక్కింది. మొత్తం ఆరు సిరీస్‌లలో రెండో, ఐదో సిరీస్‌లలో 4 చొప్పున టార్గెట్‌లను కొట్టిన నీరూ... మిగిలిన నాలుగు సిరీస్‌లలో 5 చొప్పున పూర్తి స్కోర్‌ను ఛేదించింది. ఆసియా క్రీడల పురుషుల ట్రాప్‌లో భారత్ తరఫున 1978లో రణ్‌దీర్ సింగ్, 2010లో రంజన్ సోధి స్వర్ణాలు గెలిచారు.
నీరూ ప్రదర్శన ఆమెకు వ్యక్తిగత స్వర్ణాన్ని అందించడంతో పాటు భారత జట్టు రజతం గెలవడంలో కూడా కీలకపాత్ర పోషించింది. మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో నీరూ, ఆషిమా, మనీషా సభ్యులుగా ఉన్న జట్టు రెండో స్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్‌లో నీరూ 118 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా... ఆషిమా 106 పాయింట్లతో 16వ స్థానంతో, మనీషా 104 పాయింట్లతో 23వ స్థానంతో ముగించారు. అయితే ఈ ముగ్గురు కలిసి సాధించిన మొత్తం 328 పాయింట్లతో భారత్‌కు రజతం దక్కింది. చైనా (346 పాయింట్లు) స్వర్ణం సాధించగా, కువైట్ (325 పాయింట్లు)కు కాంస్యం లభించింది.
అనారోగ్యం నుంచి ఆసియా పతకం వరకు..
రెండు నెలల క్రితమే షూటింగ్ ప్రపంచకప్‌లో నీరూ ధండా స్వర్ణం గెలిచింది. ట్రాప్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత షూటర్‌గా నిలవడంతోనే ఆమెపై అంచనాలు పెరిగాయి. అయితే ఆ తర్వాత అనూహ్యంగా పరిస్థితి మారిపోయింది. ఆసియా క్రీడల కోసం జపాన్ చేరడానికి పది రోజుల ముందు నీరూ తీవ్ర అనారోగ్యంతో బాధపడింది. తీవ్రమైన జ్వరంతో హెచ్1ఎన్1 వ్యాధి లక్షణాలతో ఆమె భోపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదు రోజుల పాటు ఏమీ తినలేకపోయింది. అసలు ఆసియా క్రీడలకు వెళతానా లేదా అనే సందేహాలు వచ్చాయి.
దాదాపు నాలుగు వారాలు పూర్తిగా శిక్షణకు దూరమైంది. అయితే ఇలాంటి స్థితిలో కోచ్ మన్షేర్ సింగ్ నీరూను ఎంతో ప్రోత్సహించాడు. నువ్వు లక్ష్యం నుంచి దృష్టి మరల్చవద్దు అంటూ స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశాడు. దాంతో అన్నీ వెనక్కి తోసి ఆమె శక్తిని కూడదీసుకుంది. హరియాణాలోని జింద్ జిల్లాలో పుట్టినా ... కుటుంబం మధ్యప్రదేశ్‌లోని శివపురికి వలస వెళ్లడంతో నీరూ అక్కడే పెరిగింది. ఆమె కెరీర్ కూడా మధ్యప్రదేశ్‌లోనే మొదలైంది. 2018 ఆసియా క్రీడల్లో ట్రాప్‌లో రజతం సాధించిన ఆమె కజిన్ లక్షయ్ షెరాన్ ప్రేరణతో నీరూ పూర్తి స్థాయిలో ఆటపై దృష్టి పెట్టింది.

లక్షయ్ తండ్రి ఇచ్చిన గన్‌తోనే ఆమె ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఆ తర్వాత 2019లో భోపాల్‌కు చేరి మధ్యప్రదేశ్ స్టేట్ షూటింగ్ అకాడమీలో శిక్షణతో తన ఆటకు మెరుగులు దిద్దుకుంటూ నీరూ దూసుకుపోయింది. రైతు అయిన తండ్రి షూటింగ్‌లాంటి ఖరీదైన క్రీడకు అండగా నిలిచే పరిస్థితి లేకపోయింది. ఇలాంటి స్థితిలో ప్రభుత్వం అందించిన గన్, ఇతర ఎక్విప్‌మెంట్‌తోనే ఆమె సాధన చేయగలిగింది. ప్రస్తుతం ఆర్మీలో ఆమె నాయబ్ సుబేదార్‌గా పని చేస్తోంది. ‘ఈ విజయం సరిహద్దులోని సైనికులకు అంకితం. వారితో పోలిస్తే నా ఘనత గొప్పదేమీ కాదు. అందరి లక్ష్యం కూడా ఒలింపిక్ పతకమే. అయితే ఈ విజయాలు వాటి వైపు సాగేందుకు పునాదిరాళ్లుగా ఉపకరిస్తాయి’ అని నీరూ వ్యాఖ్యానించింది.
‘ట్రాప్’ అంటే...
సామాన్యుల భాషలో చెప్పాలంటే ‘ట్రాప్’ ఈవెంట్ సరిగ్గా పక్షులను వేటాడటంలాంటిదే! ఇప్పుడు షూటింగ్ ఈవెంట్‌లో కూడా లక్ష్యాలను బర్డ్స్ లేదా పీజియాన్స్ అనే పిలుస్తారు. పాత కాలంలో పంజరాల నుంచి పక్షులను విడిచి పెట్టగానే తుపాకీతో వాటిని వేటాడేవారు. ఇప్పుడు మెకానికల్ పద్ధతిలో లక్ష్యాలను నిర్దేశిస్తారు. ట్రాప్ హౌస్‌లో నిలిచి ఉండే షూటర్ సిద్ధం కాగానే... డిస్క్ ఆకారంలో ఉండే మట్టితో తయారు చేసిన ఒక ‘బర్డ్’ దూసుకొస్తుంది. దీనిని షూటర్ కొట్టాల్సి ఉంటుంది.

ప్రస్తుత పోటీల్లో ఐదేసి టార్గెట్‌ల చొప్పున ఆరు సిరీస్‌లు (మొత్తం 6్ఠ5 = 30 పాయింట్లు) ఉంటాయి. ‘డబుల్ ట్రాప్’లో ఒకేసారి రెండు బర్డ్స్‌లను కొట్టాల్సి ఉంటుంది. ట్రాప్, డబుల్ ట్రాప్, స్కీట్‌లను ‘షాట్‌గన్’ ఈవెంట్లుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఒలింపిక్స్‌లో ట్రాప్, స్కీట్ మాత్రమే ఉన్నాయి. 2020 టోక్యో ఒలింపిక్స్ నుంచే డబుల్ ట్రాప్‌ను తప్పించారు. భారత ఆటగాడు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో డబుల్ ట్రాప్‌లోనే రజతం గెలిచాడు.


