సామ్ హార్పర్ (PC: CApondicherry X)
ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత్- ‘ఎ’ బౌలర్లు ఆరంభంలో అదరగొట్టారు. కంగారూ టాపార్డర్‌ను కకావికలం చేసి శుభారంభం అందించారు. అయితే, మిడిలార్డర్ కుదురుగా ఆడటంతో తొలి రోజే ఆసీస్‌ను ఆలౌట్ చేసే అవకాశం భారత్ చేజారింది.
రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడేందుకు ఆసీస్ ‘ఎ’ జట్టు భారత్‌కు వచ్చింది. ఇందులో భాగంగా పుదుచ్చేరి వేదికగా సిరీస్ జరగుతుండగా.. తొలి టెస్టులో భారత్ ఆసీస్‌ను 162 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
టాపార్డర్ కుదేలు
ఇరుజట్ల మధ్య మంగళవారం రెండో అనధికారిక టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు సామ్ కొన్‌స్టాస్ (2), జోష్ ఫిలిప్ (5) ఇలా వచ్చి అలా వెళ్లారు. కొన్‌స్టాస్‌ను షమ్స్ ములానీ, జోష్‌ను నచికేత్ భూటే త్వరత్వరగా పెవిలియన్‌కు పంపారు.
ఇక వన్‌డౌన్‌లో వచ్చిన నాథన్ మెక్‌స్వీనీ (76 బంతుల్లో 34) నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా.. ములాని అతడి ఆశలపై నీళ్లు చల్లాడు. మరోవైపు.. కెప్టెన్ పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌ను నచికేత్ డకౌట్ చేశాడు. దీంతో ఆసీస్ 96 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఏడో స్థానంలో వచ్చి శతక్కొట్టాడు
ఇలాంటి దశలో జేసన్ సంఘా (46), లియామ్ స్కాట్ (34) ఇన్నింగ్స్ గాడిన పెట్టగా.. వికెట్ కీపర్ బ్యాటర్, ఏడో స్థానంలో వచ్చిన సామ్ హార్పర్ అజేయ శతకం సాధించాడు. అతడికి టాడ్ మర్ఫీ (91 బంతుల్లో 33) సహకారం అందించాడు.
101 పరుగులతో అజేయంగా
ఫలితంగా మంగళవారం నాటి మొదటిరోజు ఆట పూర్తయ్యేసరికి ఆసీస్ ‘ఎ’ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేయగలిగింది. సామ్ హార్పర్ 153 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 101 పరుగులతో అజేయంగా నిలవగా.. అతడికి తోడుగా జై రిచర్డ్‌సన్ సున్నా పరుగులతో ఉన్నాడు.
భారత బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ షమ్స్ ములాని, రైటార్మ్ పేసర్ నచికేత్ భూటే చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. మరో పేసర్ అన్షుల్ కాంబోజ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. భారత అండర్-19 జట్టు ఆసీస్ అండర్-19 జట్టును తొలి యూత్ టెస్టులో మంగళవారం ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో చిత్తు చేసింది.


