డబుల్ సెంచరీ వీరుడు లక్ష్య (PC: SCA Instagram)
భారత అండర్-19 క్రికెట్ జట్టు మరోసారి అదరగొట్టింది. స్వదేశంలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో యూత్ వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. తాజాగా యూత్ టెస్టు సిరీస్‌లోనూ శుభారంభం చేసింది.
టాస్ గెలిచిన ఆసీస్
రాజ్‌కోట్ వేదికగా ఆదివారం మొదలైన తొలి యూత్ టెస్టులో ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో ఆసీస్ జట్టును మట్టికరిపించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. నిరంజన్ షా స్టేడియంలో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
చెలరేగిన ఇషాన్ ఓం
భారత బౌలర్ల ధాటికి తాళలేక కంగారూ టాపార్డర్ కుదేలు కాగా.. మిడిలార్డర్ కాస్త మెరుగ్గా రాణించింది. ఓపెనర్లు నీల్ పటేల్ (11), హేడేన్ బార్బూలోవిక్ (0).. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ మాథ్యూ లాఫ్ (1) తేలిపోయారు. నాలుగో స్థానంలో వచ్చిన జేడ్ హాలిక్ అర్ధ శతకం (59) చేయగా.. ఐదో నంబర్ బ్యాటర్ బ్లేక్ క్యాటిల్ (102) శతక్కొట్టాడు.
ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 217 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో స్పిన్నర్ ఇషాన్ ఓమ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. పేసర్ మోహిత్ ఉల్వా మూడు వికెట్లు కూల్చాడు. కెప్టెన్, పార్ట్‌టైమ్ స్పిన్నర్ యశ్‌వర్దన్ చౌహాన్ రెండు వికెట్లు తీశాడు.
లక్ష్య డబుల్ సెంచరీ
ఈ క్రమంలో తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. మంగళవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా 494 పరుగుల మేర భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ లక్ష్య రాయ్‌చందాని ఆసీస్‌పై రికార్డు డబుల్ సెంచరీ (281 బంతుల్లో 24 ఫోర్లు, 4 సిక్స్‌లు: 240)తో చెలరేగగా.. కెప్టెన్ యశ్‌వర్దన్ అర్ధ శతకం (54)తో రాణించాడు.
లోయర్ ఆర్డర్‌లో ఊహించని రీతిలో పదో నంబర్ బ్యాటర్ మోహిత్ ఉల్వా 92 పరుగులతో ఆకట్టుకున్నాడు. మిగిలిన వారిలో వికెట్ కీపర్ బ్యాటర్ మానవ్ కృష్ణ 25, ఆయాన్ అక్రం 26 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో కేసీ బార్టన్ మూడు వికెట్లు తీయగా.. థియో సింగోస్, స్పెన్సర్ గ్రీన్, కొనొర్ గ్రెగరీ తలా రెండు.. ఎలి బ్రేయిన్ ఒక వికెట్ తీశారు.
ఈసారి కెప్టెన్ సాబ్
ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 277 పరుగుల భారీ ఆధిక్యం లభించగా.. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్ 229 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్ ఇన్నింగ్స్ మీద 48 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈసారి కూడా ఇషాన్ ఓం నాలుగు వికెట్లతో చెలరేగగా.. యశ్‌వర్దన్ అనూహ్యంగా ఆరు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తొలి యూత్ టెస్టు సంక్షిప్త స్కోర్లు
👉భారత్- 494
👉ఆస్ట్రేలియా- 217 & 229
👉ఫలితం: ఆసీస్‌పై ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో భారత్ గెలుపు.
చదవండి: IND vs WI: విండీస్‌తో రెండో వన్డే.. భారత తుదిజట్టులో మార్పు!


