లక్నో: ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి దివ్యా మిట్టల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించారు. అయితే తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు, వారి ప్రశ్నలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలతో కలిసి కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ను తన కర్మభూమిగా పేర్కొంటూ.. అక్కడి నుంచే తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు వీడియో సందేశంలో వెల్లడించారు.
2013 బ్యాచ్‌కు చెందిన దివ్యా మిట్టల్ 2026, ఆగస్టు 30న తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత, కుటుంబ కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆమె రాజీనామాను ఆమోదించడంతో సెప్టెంబర్ 15 నుంచి అది అమల్లోకి వచ్చింది. అనంతరం ఆమె ఏమి చేయబోతున్నారనే దానిపై సస్పెన్స్ వీడింది. రాజకీయాలు తనకు పదవి కోసం మార్గం కాదని దివ్యా మిట్టల్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల వరకు తమ సమస్యలను తీసుకెళ్లలేని, తీసుకెళ్లినా వినిపించని ప్రజల తరఫున గొంతుకగా నిలవాలనుకుంటున్నట్లు చెప్పారు.
మిర్జాపూర్‌లోని లహురియాదహ్ ప్రాంతంలో ఓ మహిళను కలిసిన సందర్భాన్ని ఆమె గుర్తుచేశారు. ఐదో తరగతి తర్వాత పిల్లల చదువుకు ఇబ్బందులు ఎదురవుతున్నందున గ్రామంలో తదుపరి తరగతి పాఠశాలను ప్రారంభించాలని ఆ మహిళ కోరినట్లు తెలిపారు. పాఠశాలకు అనుమతి వచ్చినప్పటికీ మూడేళ్ల తర్వాత కూడా నిర్మాణం ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. సమస్య వనరుల కొరత కాదని.. సంకల్పం లేకపోవడమేనని వ్యాఖ్యానించారు. ప్రత్యేక కార్యదర్శి రెవెన్యూ హోదాలో ఉన్న సమయంలో ఓ వ్యక్తి ప్రభుత్వ భూమి పట్టాకు సంబంధించిన పత్రాలను తీసుకుని తనను కలిశారని దివ్యా మిట్టల్ తెలిపారు. పట్టా లభించినా భూమిపై వాస్తవ స్వాధీనం కల్పించలేదని చెప్పారు. సంబంధిత నివేదికలో అవకతవకలు గుర్తించి చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
యువత ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఆమె ప్రస్తావించారు. పోటీ పరీక్షలకు ఏళ్ల తరబడి సిద్ధమయ్యే విద్యార్థులకు పేపర్ లీక్ ఘటనలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని అన్నారు. అదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో అనేక ఉద్యోగాల స్వరూపం మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇద్దరు కుమార్తెల తల్లిగా భవిష్యత్ తరాలపై తనకు ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడిని మార్చడం తన లక్ష్యం కాదని, రాజకీయాల్లోనే మార్పు రావాలని దివ్యా మిట్టల్ అన్నారు.
దివ్యా మిట్టల్ ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరులో విద్యాభ్యాసం చేశారు. అనంతరం లండన్‌లో ఉద్యోగం చేసిన ఆమె భారత్‌కు తిరిగి వచ్చి యూపీఎస్సీకి సిద్ధమై ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. మిర్జాపూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో గ్రామాలకు పైపుల ద్వారా నీటిని అందించే కార్యక్రమంతో ఆమె గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వివిధ పరిపాలనా బాధ్యతలు నిర్వహించారు. ఆమె రాజీనామా అనంతరం కాంగ్రెస్ నేత అజయ్ రాయ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందించినప్పటికీ.. దివ్యా మిట్టల్ మాత్రం తన రాజీనామా ఆలోచించి తీసుకున్న నిర్ణయమని అప్పట్లో తెలిపారు.
ఇదీ చదవండి: దుబాయ్‌లో గుండె జబ్బులు.. భారతీయులే అధికం!


