ఆ ఇద్దరు ఐఏఎస్‌లదీ ఒకే కథ! | IAS To Entrepreneur, Two Civil Servants Roman Saini And Divya Mittal Who Chose Different Paths After UPSC Success | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరు ఐఏఎస్‌లదీ ఒకే కథ!

Sep 3 2026 10:57 AM | Updated on Sep 3 2026 11:32 AM

They Cracked UPSC Became IAS Officers Then Chose to Walk Away

సివిల్స్‌లో విజయం సాధారణమేమీ కాదు. మన దేశంలో ఎంతోమంది యువతకు అదొక కల. అందుకోసం ఏళ్ల తరబడి కష్టపడుతుంటారు కూడా. కానీ ఆ ప్రతిష్ఠాత్మక ఉద్యోగాన్ని సాధించిన తర్వాత కూడా.. అదే కెరీర్‌లో జీవితాంతం కొనసాగాలని లేదనుకుంటే?. రోమన్‌ సైనీ, దివ్యా మిట్టల్‌ ప్రయాణాలే దీనికి ఆసక్తికరమైన సమాధానం. ఇద్దరూ తమకు దక్కిన అవకాశాన్ని వదులుకుని.. తమకు నచ్చిన దారిని ఎంచుకున్నారు.

రోమన్‌ సైనీ 2013లో UPSC సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో 18వ ర్యాంక్‌ సాధించి IASలోకి అడుగుపెట్టారు. మరోవైపు దివ్యా మిట్టల్‌ 2012 UPSC పరీక్షలో 68వ ర్యాంక్‌ సాధించి IASకు ఎంపికయ్యారు. ఆమె 2013 బ్యాచ్‌ అధికారిణిగా సర్వీసులో చేరారు. ఒకరు ఐఏఎస్‌లో చేరిన 20 నెలల్లోనే బయటకు వచ్చి స్టార్టప్‌ ప్రపంచంలోకి వెళ్లగా.. మరొకరు 13 ఏళ్ల సుదీర్ఘ సేవ అనంతరం తాజాగా రాజీనామా చేశారు. ఇద్దరి నిర్ణయాల వెనుక దారులు వేరు.. కానీ లక్ష్యం మాత్రం తమకు నచ్చిన జీవితాన్ని ఎంచుకోవడమే. ఒకరు ప్రభుత్వ ఉద్యోగం కంటే వ్యాపారాన్ని ఎంచుకుంటే.. మరొకరు సుదీర్ఘ ప్రజాసేవ తర్వాత కొత్త అధ్యాయం వైపు అడుగులు వేశారు. ఇప్పుడు ఈ ఇద్దరి ప్రయాణాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి.

ఇందులో రోమన్‌ సైనీ ప్రయాణం చాలా ప్రత్యేకం. 16 ఏళ్లకే ఎయిమ్స్‌ ప్రవేశ పరీక్షలో విజయం సాధించి వైద్య విద్య పూర్తి చేసిన ఆయన.. 2013లో యూపీఎస్సీ సివిల్స్‌లో ఆల్‌ ఇండియా 18వ ర్యాంక్‌ సాధించారు. కేవలం 22 ఏళ్ల వయసులో ఐఏఎస్‌ అయ్యారు. అయితే ప్రతిష్ఠాత్మకమైన సివిల్‌ సర్వీస్‌లో ఆయన కెరీర్‌ రెండేళ్లు కూడా కొనసాగలేదు. లాల్‌బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (LBSNAA)లో ఉన్న సమయంలో గౌరవ్‌ ముంజాల్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఐఏఎస్‌ను వీడి ముంజాల్‌తో కలిసి యూన్‌అకాడమీ నిర్మాణంలో భాగమయ్యారు.

ఐఏఎస్‌ నుంచి ఎడ్‌టెక్‌ వైపు..
2015లో ప్రారంభమైన యూన్‌ అకాడమీకి రోమన్‌ సైనీ సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరించారు. ఆన్‌లైన్‌ విద్య అంతగా విస్తరించని సమయంలో తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద సాహసమే. అయితే కొవిడ్‌ సమయంలో యూన్‌ అకాడమీ భారీ స్థాయిలో విస్తరించింది. నెలకు లక్షకు పైగా లైవ్‌ క్లాసులు, దాదాపు 10 లక్షల మంది చెల్లింపు సబ్‌స్క్రైబర్లు ఉన్న దశను సంస్థ చూసింది. తాజాగా యూన్‌ అకాడమీని అప్‌గ్రాడ్‌ 200 మిలియన్‌ డాలర్లకు పైగా విలువైన ఆల్‌-స్టాక్‌ డీల్‌లో కొనుగోలు చేసింది. ఈ పరిణామంతో సైనీ ఐఏఎస్‌ను వదిలి నిర్మించిన అధ్యాయం మరో మలుపు తిరిగింది.

13 ఏళ్ల తర్వాత దివ్యా మిట్టల్‌ రాజీనామా
రోమన్‌ సైనీకి పూర్తి భిన్నంగా దివ్యా మిట్టల్‌ ఐఏఎస్‌లో సుదీర్ఘ ప్రయాణం సాగించారు. ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరులో చదువుకున్న ఆమె.. లండన్‌లో ఉద్యోగం చేసిన తర్వాత భారత్‌కు తిరిగి వచ్చి సివిల్‌ సర్వీసెస్‌లో చేరారు. 2013 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిగా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పనిచేశారు. దేవరియా, మిర్జాపూర్‌, సంత్‌కబీర్‌ నగర్‌ వంటి జిల్లాల్లో జిల్లా మేజిస్ట్రేట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

మీర్జాపూర్‌లోని ఓ మారుమూల కొండ గ్రామానికి పైపుల ద్వారా తాగునీరు అందించడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. దశాబ్దాలుగా నీటి కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు తాగునీరు అందించడం ఆమె సేవా కాలంలోని గుర్తుండిపోయే పనుల్లో ఒకటిగా నిలిచింది.

2026లో ఈ ఇద్దరి కెరీర్‌ ప్రయాణాలు మరోసారి ఆసక్తికరమైన మలుపు తీసుకున్నాయి. యూపీఎస్సీ 2013 బ్యాచ్‌కు చెందిన రోమన్‌ సైనీ అప్పటికే ఐఏఎస్‌ను వదిలి వ్యాపార రంగంలోకి వెళ్లారు. సరిగ్గా 13 ఏళ్ల తర్వాత ఆయన సహ వ్యవస్థాపకుడిగా నిర్మించిన యూన్‌అకాడమీ మరో చేతుల్లోకి వెళ్లింది. రోనీ స్క్రూవాలా నేతృత్వంలోని ఎడ్టెక్‌ సంస్థ అప్‌గ్రాడ్‌, యూన్‌అకాడమీని 200 మిలియన్‌ డాలర్లకు పైగా విలువైన ఆల్‌-స్టాక్‌ డీల్‌లో సొంతం చేసుకుంది. ఒకప్పుడు 3.44 బిలియన్‌ డాలర్ల గరిష్ఠ విలువను అందుకున్న యూన్‌అకాడమీ.. ఇప్పుడు దానితో పోలిస్తే దాదాపు 94 శాతం తక్కువ విలువకు డీల్‌ కావడం విశేషం. ఈ ఒప్పందంతో యూన్‌అకాడమీ షేర్‌హోల్డర్లకు upGradలో వాటాలు దక్కాయి. రోమన్‌ సైనీ మాత్రం సంస్థ నిర్వహణ నుంచి తప్పుకుని ఇకపై అడ్వైజరీ పాత్రలో కొనసాగనున్నారు.

అదే సమయంలో దివ్యా మిట్టల్‌ 13 ఏళ్ల సుదీర్ఘ ఐఏఎస్‌ సేవకు స్వచ్ఛందంగా ముగింపు పలికారు. ఒకరు ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి స్టార్టప్‌ నిర్మించి, 13 ఏళ్ల తర్వాత ఆ సంస్థ కొత్త యాజమాన్యంలోకి వెళ్లడాన్ని చూశారు. మరొకరు 13 ఏళ్లపాటు ఐఏఎస్‌గా సేవలందించిన తర్వాత స్వయంగా ఆ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. ఇద్దరి ప్రయాణాలూ వేర్వేరైనా.. 2026లో మాత్రం ఇద్దరూ తమ జీవితాల్లో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.

ఇద్దరి నిర్ణయాలు భిన్నమైనప్పటికీ.. సందేశం మాత్రం ఒకటే. యూపీఎస్సీలో విజయం అనేది కెరీర్‌కు ముగింపు కాదు.. కొత్త ప్రయాణానికి ఆరంభం మాత్రమే. తాను సాధించిన ప్రతిష్ఠాత్మక స్థానంలోనే జీవితాంతం కొనసాగాల్సిన అవసరం లేదని ఈ ఇద్దరి కథలు చెబుతున్నాయి. ఒకరు ఐఏఎస్‌ నుంచి వ్యాపారవేత్తగా మారితే.. మరొకరు 13 ఏళ్ల పరిపాలనా సేవ తర్వాత కొత్త అధ్యాయం వైపు అడుగులు వేశారు. అందుకే.. యూపీఎస్సీ క్లియర్‌ చేయడమే అంతిమ లక్ష్యం కాదని, ఆ తర్వాత మనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవడమే అసలు సవాల్‌ అని రోమన్‌ సైనీ, దివ్యా మిట్టల్‌ ప్రయాణాలు గుర్తుచేస్తున్నాయి.

ఇదీ చదవండి: రాఘవ్‌ చద్దా ఓటు మిస్సింగ్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement