ఎల్‌ నినో పంజా.. ఐఎండీ షాకింగ్‌ అప్‌డేట్‌! | El Nino Intensifies: IMD Warns of Below Normal Rainfall in Sep 2026 | Sakshi
Sakshi News home page

ఎల్‌ నినో పంజా.. ఐఎండీ షాకింగ్‌ అప్‌డేట్‌!

Sep 3 2026 7:17 AM | Updated on Sep 3 2026 7:25 AM

El Nino Intensifies: IMD Warns of Below Normal Rainfall in Sep 2026

దేశంలో వర్షాల తీరును ఎల్‌ నినో ప్రభావం మార్చేస్తోంది. పసిఫిక్‌ మహాసముద్రంలో మారుతున్న సముద్ర ఉష్ణోగ్రతల ప్రభావంతో ఇటు నైరుతి రుతుపవనాల పనితీరుపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా దక్షిణ భారతంలో ఈ పరిస్థితులు మరీ ఘోరంగా ఉన్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌ లోటు వర్షపాతంతో ముగుస్తుందా? అనే అనుమానాల నడుమ.. భారత వాతావరణ విభాగం (IMD) షాకింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది.

దేశంలో వర్షాలపై ఎల్‌ నినో ప్రభావం మరింత స్పష్టమవుతోంది. పసిఫిక్‌ మహాసముద్రంలో పరిస్థితులు బలపడుతున్న నేపథ్యంలో సెప్టెంబర్‌లోనూ దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. అయితే ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణ ప్రాంతంలో వర్షాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆగస్టులో దక్షిణ ద్వీపకల్పంలో సాధారణం కంటే 27 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతం నుంచి వచ్చే వర్ష వ్యవస్థలు దక్షిణం వైపు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవడం కూడా ఇందుకు కారణమైంది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళలో వర్షాలపై ఆందోళన పెరిగింది.

ఆగస్టులో దేశానికీ లోటే
నైరుతి రుతుపవనాలకు కీలకమైన ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా 16.3 శాతం వర్షపాతం లోటు నమోదైంది. నెలలో సాధారణంగా కురవాల్సిన వర్షాలతో పోలిస్తే ఈ లోటు కనిపించింది. ఆగస్టు చివరి నాటికి దాదాపు 42 శాతం జిల్లాలు లోటు వర్షపాతం పరిధిలో ఉండగా.. మరో 5 శాతం జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. అంటే లోటు కేవలం ఒకటి రెండు రాష్ట్రాలకు పరిమితం కాలేదన్నమాట.

అల్పపీడనాలు.. ఉత్తరానికే మళ్లాయి
ఈసారి వర్షాల అసమాన పంపిణీకి అల్పపీడనాల గమనం కూడా ఒక కారణంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన పలు అల్పపీడన వ్యవస్థలు ఉత్తర దిశగా పయనించి మధ్య, ఉత్తర భారతంపై ఎక్కువ ప్రభావం చూపాయి. దీంతో అక్కడ కొన్ని ప్రాంతాలకు భారీ వర్షాలు అందగా.. దక్షిణ ద్వీపకల్పంలో ఆశించిన వర్షాలు పడలేదు. ఒకే దేశంలో ఒకచోట వరదలు.. మరోచోట వర్షాభావం కనిపించడానికి ఇదీ ఒక కారణం.

సెప్టెంబర్‌లోనూ నిరాశే
సెప్టెంబర్‌ సాధారణంగా నైరుతి రుతుపవనాల చివరి కీలక నెల. ఈ సమయంలో కురిసే వర్షాలు ఖరీఫ్‌ పంటలకు, నేలలో తేమను నిలబెట్టుకోవడానికి ఎంతో అవసరం. అయితే ఈసారి దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ వర్షపాతం దీర్ఘకాల సగటులో 91 శాతం కంటే తక్కువగా ఉండొచ్చని IMD అంచనా వేసింది. దీంతో సీజన్‌ ముగిసేలోపు వర్షాల లోటు కొంత మేర భర్తీ అయ్యే అవకాశాలు తగ్గాయి.

రుతుపవనాలకు బలహీన ముగింపు?
జూన్‌–సెప్టెంబర్‌ కాలాన్ని నైరుతి రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. సెప్టెంబర్‌లోనూ వర్షాలు తగ్గితే.. మొత్తం సీజన్‌ సాధారణం కంటే గణనీయమైన లోటుతో ముగిసే అవకాశం ఉంది. అదే జరిగితే వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో నేల తేమ, సాగునీరు, జలాశయాల నిల్వలపై ఒత్తిడి పెరగొచ్చు. అయితే స్థానికంగా కురిసే భారీ వర్షాలు ఈ పరిస్థితిని కొంతవరకు మార్చే అవకాశం ఉంటుంది.

పంటలకు కీలక దశ
ప్రస్తుతం ఖరీఫ్‌ పంటలు కీలక ఎదుగుదల దశలో ఉన్నాయి. పత్తి, సోయాబీన్‌, మొక్కజొన్న, పప్పుధాన్యాలకు తగినంత నేలతేమ అవసరం. వర్షాల విరామం ఎక్కువైతే పంటల దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు నేలలో తేమ తక్కువగా ఉంటే రబీ పంటల సాగు ప్రారంభ సమయంలోనూ రైతులకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

వర్షాలే కాదు.. వేడి కూడా?
వర్షాల లోటుతోపాటు ఉష్ణోగ్రతల పరిస్థితిపైనా IMD నిఘా పెట్టింది. సెప్టెంబర్‌లో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా ఉంది. వర్షాలు తగ్గడం, నేల తేమ పడిపోవడం, వేడి పెరగడం ఒకేసారి జరిగితే నీటి అవసరం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయం, తాగునీటి వనరులపై దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంది.

ముందున్నది కీలక సమయం
ఎల్‌ నినో ప్రభావం ఒక్కసారిగా దేశమంతా ఒకే విధంగా కనిపించదు. సముద్ర ఉష్ణోగ్రతలు, గాలుల కదలికలు, ఇతర సముద్ర–వాతావరణ వ్యవస్థలు కూడా భారత వర్షపాతాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే రానున్న నెలల్లో దీని తీవ్రత ఎలా మారుతుంది? దాని ప్రభావం శీతాకాలం, తదుపరి వర్షాకాలం వరకు ఎంతవరకు కొనసాగుతుంది? అన్నది కీలకంగా మారింది. ఐఎండీ అంచనా ప్రకారం.. ఎల్‌ నినో ఎఫెక్ట్‌ మార్చి వరకూ కొనసాగనుంది.

మొత్తంగా.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల పంపిణీ దక్షిణాదికి పెద్దగా కలిసిరాలేదు. ఉత్తర, మధ్య భారతానికి అల్పపీడన వ్యవస్థల ద్వారా వర్షాలు అందుతుండగా.. దక్షిణ ద్వీపకల్పంలో లోటు కొనసాగుతోంది. సెప్టెంబర్‌లోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోతే వ్యవసాయం, నేలతేమ, నీటి వనరులపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశముంది. దీంతో ఎల్‌ నినో ప్రభావం రానున్న నెలల్లో ఎలా మారుతుందన్నది దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: జెన్‌జీ.. కేర్‌ ఫ్రీ అనుకునేరు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement