జెన్‌–జీలోనూ మొహమాటపు పోకడలు! | Gen Z Misses Career Opportunities Due to Fear of Judgment says LinkedIn | Sakshi
Sakshi News home page

జెన్‌–జీలోనూ మొహమాటపు పోకడలు!

Sep 3 2026 5:10 AM | Updated on Sep 3 2026 5:10 AM

Gen Z Misses Career Opportunities Due to Fear of Judgment says LinkedIn

కెరీర్‌కు సాయపడేవారినీ కలవడం లేదు 

రకరకాల మొహమాటాలు ∙లింక్డిన్‌ నివేదిక

జెన్‌–జీ అంటే కేర్‌ఫ్రీ అనుకుంటున్నాం కానీ వారిలోనూ ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే మొహమాటం ఉన్నట్లు తాజా అధ్యయనం స్పష్టం చేసింది. ఈ మొహమాటం కారణంగా వారు కెరియర్‌లో ఎదిగేందుకు సాయపడగల వ్యక్తులను సంప్రదించడం లేదని, నెట్‌వర్కింగ్‌కు ఆసక్తి చూపడం లేదని లింక్డ్‌ఇన్‌ జరిపిన ఈ అధ్యయనం తెలిపింది. 

బుధవారం విడుదలైన ఈ నివేదిక ప్రకారం నిత్యం ఆన్‌లైన్‌లోనే ఉండే తరానికి చెందిన జెన్‌–జీ ప్రొఫెషనల్స్‌లో 83 శాతం మంది ఈ రకమైన పోకడలు చూపుతున్నట్లు తెలిసింది. జడ్జ్‌ చేస్తారేమో అన్న సంకోచం 44 శాతం మందిని పీడిస్తూంటే.. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందేమో అన్న మొహమాటంతో 39 శాతం మంది సాయపడే వారికి దూరంగా ఉంటున్నారట. 

మరీ కృతకంగా ఉంటుందేమో అన్న అనుమానంతో ఇతరుల సలహాలు కోరడం, రిలేషన్‌షిప్‌ను మెయిన్‌టెయిన్‌ చేయడం, కొత్త అవకాశాలను అందుకోవడం వంటివి చేయని వారు సుమారు 37 శాతం మంది ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. భారత్‌తోపాటు యూకే, యూఎస్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్, సింగపూర్, బ్రెజిల్, యూఏఈ, సౌదీ అరేబియాల్లో ఈ ఏడాది జూలై 20వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకూ దాదాపు 18,050 మంది పార్ట్‌టైమ్‌ ఉద్యోగుల (18 – 80 ఏళ్ల వారు)ను ప్రశ్నించడం ద్వారా ఈ నివేదిక రూపుదిద్దుకుంది. 

భారత్‌ విషయానికి వస్తే... జెన్‌–జీలో 79 శాతం మందికి ప్రొఫెషనల్‌ రిలేషన్‌షిప్స్‌ అవసరం, ప్రాముఖ్యత గురించి తెలుసు. కానీ సంగం కంటే ఎక్కువ మంది (53 శాతం) వీటిని ఎలా మొదలుపెట్టాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు 53 శాతం మంది పరిచయస్తులను (కాంటాక్ట్‌లు) అసలైన కనెక్షన్స్‌గా మార్చుకోవడం ఎలాగో తెలియక ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఖర్చులవుతాయన్న ఆందోళన అదనం. లింక్డ్‌ఇన్‌  డేటా ప్రకారం ఆయా కంపెనీల్లో ఎవరైనా తెలిసి ఉంటే ఇతరులతో పోలిస్తే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు దాదాపు 8.5 రెట్లు ఎక్కువ. 

 అయితే, జెన్‌–జీలో సుమారు 59 శాతం మందికి ప్రొఫెషనల్‌ రిలేషన్‌షిప్స్‌ ఎలా పెంపొందించుకోవాలో ఎవరూ చెప్పలేదట. చాలామంది తమంతట తాము నేర్చుకోవడమో.. లేక పరిమితమైన సలహా, సూచనల ద్వారా ముందుకెళ్లడమో చేశారని లింక్డ్‌ఇన్‌ నివేదిక చెబుతోంది. ఫలితంగా ఉద్యోగం కోసం లేదా వృత్తిలో ఎదిగేందుకు ఎవరిని సంప్రదించాలి? ఎప్పుడు సంప్రదించాలి? ఏం మాట్లాడాలి? వంటి విషయాలపై అవగాహన పెంచుకోవడం కష్టమవుతోందని తెలిపింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. జెన్‌–జీ ఈ సమస్యలు ఎదుర్కొంటూంటే మిలినియల్స్‌ (1981–1996 మధ్య పుట్టిన వారు), అంతకు ముందు తరం జెన్‌ ఎక్స్‌ (1965–1980 మధ్య పుట్టిన వారు) ఉద్యోగులు మాత్రం అప్పుడే ఉద్యోగాల్లోకి చేరిన అపరిచితులకు సైతం తాము సాయం చేస్తామని చెప్పడం విశేషం.             

 – న్యూఢిల్లీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement