‘పేపర్ లీక్’నిరసనలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ఆర్టికల్ 142 కింద లభించిన అధికారాలను ఉపయోగించుకున్న న్యాయస్థానం
ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థుల కుటుంబాలకు మూడు నెలల్లోగా పరిహారం
కేంద్రానికి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఆదేశం
ప్రజలపై దాడులు, ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన వారిపై కొత్త ఎఫ్‌ఐఆర్‌లు
ఈనెల 5న తలపెట్టిన నిరసన ర్యాలీని రద్దు చేసుకున్న సీజేపీ
న్యూఢిల్లీ: పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసన సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విద్యార్థులపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇందుకు రాజ్యాంగం ప్రకారం తమకు దక్కిన ప్రత్యేక అధికారాలను న్యాయస్థానం ఉపయోగించుకుంది. ఈ కేసులు విద్యార్థులపై భవిష్యత్తుపై ప్రభావం చూపకూడదని స్పష్టంచేసింది. నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు మూడు నెలల్లోగా పరిహారం అందజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కేంద్రం అభ్యర్థన మేరకు నిరసనకారులపై క్రిమినల్ విచారణను ముగించింది. ‘‘యువ నిరసనకారుల భవిష్యత్ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని, వారికి సంపూర్ణ న్యాయం చేయడానికి మేము రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద మాకు లభించిన అధికారాలను ఉపయోగిస్తున్నాం’’అని స్పష్టంచేసింది. కక్షిదారులకు సంపూర్ణ న్యాయం చేకూర్చడానికి ఎలాంటి ఉత్తర్వులైనా జారీ చేసే అధికారాన్ని ఆరి్టకల్ 142 సర్వోన్నత న్యాయస్థానానికి కలి్పస్తుంది. తమ ముందు కుదిరిన అవగాహనకు ఇరుపక్షాలు కట్టుబడి ఉండాలని సూచించింది.
2,873 మందిపై కొత్తగా ఎఫ్‌ఐఆర్‌లు
నిరసనలకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు మహారాష్ట్ర, అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కోరినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం నిరసనకారులపై అన్ని ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేస్తూ ధర్మాసనం ఉత్తర్వు జారీచేసింది. ప్రభుత్వ అభ్యర్థనను మన్నిస్తూ, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్న తీవ్రమైన నేర చరిత్ర కలిగిన 2,873 మంది వ్యక్తులపై కొత్తగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసేందుకు ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు అనుమతి ఇచి్చంది. ప్రజలపై దాడులు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన వారిపై కొత్త ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసేందుకు కూడా సమ్మతి తెలియజేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌ల పరిధి కేవలం ఆ రెండు రకాల నేరాలకు మాత్రమే పరిమితం కావాలని వెల్లడించింది.
సీజేపీ నిరసన ర్యాలీ రద్దు
ఢిల్లీలో సెపె్టంబర్ 5న చేపట్టాల్సిన నిరసన ర్యాలీ రద్దు చేసున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ మంగళవారం ప్రకటించింది. విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సీజేపీ కో–కన్వీనర్ సౌరవ్ దాస్ ఈ మేరకు కోర్టులో ఒక ప్రకటన చదివి వినిపించారు.
ఉపసంహరించుకుంటాం: నడ్డా
నిరసనకారులపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకుంటామని, వారిలో ఎవరిపైనా కఠిన చర్యలు తీసుకోబోమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సెప్టెంబర్ 5న జరగాల్సిన నిరసన ర్యాలీని రద్దు చేయాలన్న సీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. నీట్ పేపర్ లీక్ అనంతరం ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులకు 90 రోజు ల్లోగా తగిన పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
సంపూర్ణ న్యాయం జరిగింది: దీప్కే
సుప్రీంకోర్టు తాజా ఉత్త ర్వును సీజేపీ కన్వీనర్ అభిజీత్ దీప్కే స్వాగతించారు. తమ గళాన్ని వినిపించడానికి వీధులు, సోషల్ మీడియాను ఆశ్రయించిన విద్యార్థులకు, పౌరులందరికీ ఎట్టకేలకు న్యాయం చేకూరిందని అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. తమ డిమాండ్లన్నీ నెరవేరాయి కాబట్టి పాదయాత్రను విరమిస్తున్నామని తెలిపారు. సంపూర్ణ న్యాయం జరిగిందన్నారు. తమ ఆందోళన విజయవంతమైందని వెల్లడించారు. సుప్రీంకోర్టుకు దీప్కే కృతజ్ఞతలు తెలియజేశారు. తమకు మద్దతు ఇచ్చిన ప్రజలకు ఈ తీర్పును అంకితం చేస్తున్నట్లు చెప్పారు. ఇది కేవలం జంతర్ మంతర్ వద్దే కాకుండా, దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరి విజయమని అభివరి్ణంచారు. ప్రజలంతా గళం విప్పకపోయి ఉంటే ఇది సాధ్యమయ్యే దని కాదని వివరించారు.


