ఊపిరి పీల్చుకోవడమే కష్టమైనంత పలుచని గాలి.. అడుగు బయటపెడితే గడ్డకట్టించే చలి.. కళ్లెదుట ఎక్కడ చూసినా మంచుకొండలే.. చెట్లు కనిపించవు.. శీతాకాలంలో దాదాపు ఆరు నెలలు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. అయినా అక్కడ మనుషులు నివసిస్తున్నారు. ఇళ్లలో సంబరాలు చేసుకుంటున్నారు. పశువులను పెంచుతున్నారు. జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇది ఏ సైన్స్ ఫిక్షన్ కథ కాదు.. హిమాలయాల ఒడిలో సముద్ర మట్టానికి 15,050 అడుగుల ఎత్తులో ఉన్న కొమిక్ గ్రామం కథ!
ఆకాశానికి దగ్గరగా కొమిక్..
హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పితి లోయలో ఉన్న కొమిక్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మానవ నివాస ప్రాంతాల్లో ఒకటి. సముద్ర మట్టానికి సుమారు 4,587 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ చిన్న బౌద్ధ గ్రామంలో దాదాపు 100 మంది నివసిస్తున్నారు. గ్రామ ప్రవేశద్వారం వద్దే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటారుబుల్ రోడ్డుతో అనుసంధానమైన గ్రామమని తెలిపే బోర్డు కనిపిస్తుంది. మంచుతో కప్పబడిన హిమాలయ శిఖరాల మధ్య తెల్లని మట్టి, రాతి ఇళ్లు.. నీలాకాశం కింద నిశ్శబ్దంగా కనిపించే ఈ గ్రామం ఫొటోల్లో చూస్తే స్వర్గంలా అనిపిస్తుంది. కానీ అక్కడ నివసించే వారికి మాత్రం ప్రతి రోజు ఓ సవాలే.
ఆక్సిజన్ కూడా విలాసమే!
సముద్ర మట్టంతో పోలిస్తే కొమిక్‌లో ఆక్సిజన్ స్థాయి చాలా తక్కువ. అక్కడికి కొత్తగా వెళ్లే వారికి పలుచని గాలితో శరీరం ఇబ్బంది పడుతుంది. కొందరిలో ఆక్సిజన్ సాచురేషన్ గణనీయంగా పడిపోవచ్చు. అయితే తరతరాలుగా అక్కడే నివసిస్తున్న స్థానికులు ఈ వాతావరణానికి అలవాటు పడిపోయారు. అక్కడి ప్రజల జీవితం ప్రకృతితో నిరంతర పోరాటమే. తీవ్రమైన చలి కారణంగా చెట్లు, చాలా మొక్కలు కూడా పెరగడం కష్టం. నీరు గడ్డకట్టేంత చలి ఉంటుంది. శీతాకాలంలో పరిస్థితులు మరింత దారుణంగా మారతాయి.
One of the world's highest village with motorable roads, #Komic is a hidden gem of Himachal Pradesh where simplicity and resilience flourish amidst breathtaking views. #Komic #HimachalPradesh #Spiti @incredibleindia pic.twitter.com/hnUqmpDkq5
— Dhanraj Nathwani (@DhanrajNathwani) March 27, 2025
ఆరు నెలలు ప్రపంచానికి దూరం!
భారీ మంచు కారణంగా స్పితి లోయలోని పర్వత మార్గాలు మూసుకుపోతాయి. ఫలితంగా కొమిక్ సహా ఈ ప్రాంతంలోని గ్రామాలు సంవత్సరంలో దాదాపు ఆరు నెలల పాటు దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి దాదాపు పూర్తిగా వేరుపడతాయి. ఫోన్, ఇంటర్నెట్ సదుపాయాలు కూడా పరిమితమే. పాఠశాలలు, ఆసుపత్రులు వంటి కీలక సౌకర్యాలు దూరంగా ఉంటాయి. అయినా స్థానికులు తమకు తామే ఏర్పాట్లు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కొమిక్ ఇళ్ల నిర్మాణం కూడా అక్కడి వాతావరణానికి తగ్గట్టుగానే ఉంటుంది. మట్టి, రాళ్లతో నిర్మించే ఇళ్ల గోడలు దాదాపు రెండు అడుగుల మందంతో ఉంటాయి. ఇళ్లకు తెల్లని రంగు వేయడం ద్వారా పగటి సూర్యకాంతిని ప్రతిబింబింపజేసి లోపల వెచ్చదనాన్ని కొంతమేర కాపాడుకుంటారు. చుట్టుపక్కల చెట్లు లేకపోవడంతో ఇంధనం కూడా సమస్యే. యాక్‌లు, ఆవులు, గాడిదల ఎండిన పేడను ఇంధనంగా ఉపయోగిస్తారు. రాత్రి వేళ పశువులను కూడా తీవ్ర చలి నుంచి రక్షించేందుకు ఇళ్లలోనే ఉంచుతారు.
నీరు గడ్డకట్టినా.. జీవితం ముందుకు!
చలికాలంలో నీరు గడ్డకట్టడం సాధారణమే. ఇలాంటి పరిస్థితుల్లో స్థానికులు తమ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక పద్ధతులను అవలంబిస్తారు. పాత్రలు కడగడానికి కూడా కట్టెల సాయంతో నీటిని వేడి చేసుకునే ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక్కడి జీవితం మనకు సాధారణంగా అనిపించే ఎన్నో విషయాల విలువను గుర్తుచేస్తుంది. నీరు, వేడి, ఆక్సిజన్.. మనకు సహజంగా లభించే ఇవన్నీ కొమిక్ ప్రజలకు విలువైన వనరులే. కొమిక్ చుట్టుపక్కల ప్రాంతం ప్రకృతి అందాలతోనే కాదు.. కోట్ల సంవత్సరాల చరిత్రతోనూ ఆశ్చర్యపరుస్తుంది. సమీపంలోని లాంగ్జా గ్రామంలో లభించే సముద్ర జీవుల శిలాజాలు.. ఈ ప్రాంతంలో ఒకప్పుడు టెథిస్ సముద్రం ఉండేదని సూచిస్తున్నాయి. అంటే నేడు మంచుకొండలు కనిపిస్తున్న ఈ ప్రాంతం.. కోట్ల సంవత్సరాల క్రితం సముద్రంలో భాగంగా ఉండేదన్నమాట!.
ప్రపంచంలోనే ఎత్తైన పోస్టాఫీసు..
కొమిక్‌కు సమీపంలోని హిక్కిమ్ గ్రామం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోస్టాఫీసుల్లో ఒకటికి ప్రసిద్ధి చెందింది. పరిమిత కనెక్టివిటీ ఉన్నప్పటికీ దశాబ్దాలుగా ఈ పోస్టాఫీసు ఈ మారుమూల ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తోంది. కొమిక్‌లో జనాభా తక్కువ. ఇళ్లు కూడా కొద్దే. కానీ అక్కడి ప్రజల మధ్య బంధం మాత్రం బలంగా ఉంటుంది. గ్రామంలోని ఒక ఇంట్లో వేడుక జరిగితే.. అది ఒక్క కుటుంబానిదిగా ఉండదు. ఊరంతా కలిసి సంబరాల్లో భాగమవుతుంది.
ప్రకృతి ఎంత కఠినంగా ఉన్నా.. మనుషుల మధ్య ఆప్యాయత మాత్రం ఆ చలిని జయిస్తుంది. మంచుకొండల మధ్య.. ఆకాశాన్ని తాకే ఎత్తులో.. ఆక్సిజన్ తక్కువగా ఉన్నా ఆశలు మాత్రం ఎక్కువగా ఉన్న గ్రామం కొమిక్. ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ చిన్న గ్రామం.. ప్రకృతి ఎంత కఠినమైనా మనిషి జీవించాలనే పట్టుదల ముందు అది కూడా ఓడిపోతుందని నిరూపిస్తోంది.
First snowfall in #Spiti valley
World highest moterable #Komic village pic.twitter.com/qVAFIrcgjc— Ajay Banyal (@iAjay_Banyal) October 17, 2021


