లేటు వయసులో కవలలకు జన్మనిచ్చి అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంగాయమ్మ పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాత విషయమే కదా.. ఇప్పుడెందుకు తెర మీదకు వచ్చింది? అని చాలామంది అనుకుంటున్నారు. ఏడేళ్ల తర్వాత ఆమె కథ గుర్తు చేసుకోవడానికి ఓ ప్రత్యేక కారణం లేకపోలేదు. ఆ కవల పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు? తల్లి వయసు పెరుగుతున్న నేపథ్యంలో వారి భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న చర్చే ఇందుకు కారణంగా మారింది.
2019లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంగాయమ్మ, ఆమె భర్త రాజారావు ఐవీఎఫ్ ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యారు. దాదాపు ఆరు దశాబ్దాల వైవాహిక జీవితం తర్వాత వారికి సంతానం కలగడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. డోనర్ అండాన్ని ఉపయోగించి, రాజారావు స్పెర్మ్‌తో ఐవీఎఫ్ చికిత్స నిర్వహించారు. అనంతరం సిజేరియన్ ద్వారా మంగాయమ్మ ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. వారికి రమా తులసి, ఉమా తులసి అని పేర్లు పెట్టారు. అలా వాళ్ల కథ దేశవ్యాప్తంగా ఆ టైంలో వైరల్ అయ్యింది.
57 ఏళ్ల నిరీక్షణ తర్వాత..
మంగాయమ్మకు 1962లో రాజారావుతో వివాహమైంది. ఎన్నో ఏళ్లుగా సంతానం కోసం ఎదురుచూశారు. అన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు ఈ దంపతులు ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనాలని నిర్ణయించుకున్నారు. 2019లో వైద్యుల పర్యవేక్షణలో ఐవీఎఫ్ చికిత్స చేయించుకోగా.. తొలి ప్రయత్నంలోనే గర్భం దాల్చారు. మెనోపాజ్ దశ దాటిపోవడంతో.. డోనర్ అండాన్ని రాజారావు వీర్యంతో ఫలదీకరించి ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా గర్భధారణ చేశారు.
ఆ వయసులో తల్లి కావడం సంచలనం..
విదేశాల్లో ఇలాంటివి సహజమే కావొచ్చేమో!. కానీ, మన మంగాయమ్మ 74 ఏళ్ల వయసులో పిల్లలకు జన్మనివ్వడం దేశంలో పెద్ద చర్చకే దారితీసింది. వయసు కారణంగా సహజంగా గర్భం దాల్చే అవకాశం లేకపోవడంతో ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగి చివరకు కవలలు జన్మించారు. దీంతో వృద్ధాప్యంలో మాతృత్వంపై వైద్య, సామాజిక, నైతిక అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
ఏడాదికే భర్త మృతి
అయితే మంగాయమ్మ కుటుంబంలో ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. కవలలు జన్మించిన మరుసటి ఏడాదే ఆమె భర్త రాజారావు గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటికి ఆయన వయసు 84 ఏళ్లు. దీంతో ఇద్దరు చిన్నారుల బాధ్యత పూర్తిగా మంగాయమ్మపై పడింది. భర్తను కోల్పోయిన తర్వాత కూడా ఆమె తన పిల్లలను చూసుకుంటూ వారి పెంపకాన్ని కొనసాగించారు.
74-year-old Andhra woman had twins through IVF😮 pic.twitter.com/WBXKsnc5Wv
— Vije (@vijeshetty) August 31, 2026
ఇప్పుడు ఏడేళ్ల వయసు..
2019లో జన్మించిన రమా తులసి, ఉమా తులసి ప్రస్తుతం ఏడేళ్ల వయసులో ఉన్నారు. మంగాయమ్మ వయసు మాత్రం ఇప్పుడు 80 ఏళ్లకు చేరువైంది. ఈ నేపథ్యంలో తల్లి వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల భవిష్యత్తు, సంరక్షణ ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు తాజాగా తెరపైకి వస్తున్నాయి. వాళ్లు ఇప్పుడు ఎలా ఉన్నారు? అనే ప్రశ్నతో.. ఇదే అంశం పాత కథనాలను, అప్పటి ఫొటోలను సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయ్యేలా చేసింది.
అప్పట్లోనూ విమర్శలు..
వృద్ధాప్యంలో ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనడంపై అప్పట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒకవైపు ఎన్నో ఏళ్ల కలను దంపతులు నెరవేర్చుకున్నారంటూ పలువురు అభినందించగా.. మరోవైపు తల్లిదండ్రుల అధిక వయసు కారణంగా పిల్లల భవిష్యత్తు, ఆరోగ్యం, సంరక్షణ వంటి అంశాలపై ప్రశ్నలు తలెత్తాయి.
ఇప్పుడు వయసుపై చర్చ ఎందుకు?
భారత్‌లో సహాయక పునరుత్పత్తి సాంకేతికతకు సంబంధించిన నిబంధనలు కూడా ఈ చర్చకు మరో కోణాన్ని తీసుకొచ్చాయి. 2021లో వచ్చిన చట్టం ప్రకారం ఐవీఎఫ్ సేవలకు మహిళల వయసుపై పరిమితులు విధించారు. దీంతో మంగాయమ్మ అంత వయసులో ఐవీఎఫ్ ద్వారా తల్లి అయిన ఘటన అప్పటి నిబంధనల నేపథ్యంలోనూ ప్రత్యేకంగా నిలిచింది.
మొత్తంగా.. ఆలస్యంగానైనా తల్లైన మంగాయమ్మ కథ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నది కేవలం ఆమె రికార్డు కోసం కాదు. ఏడేళ్ల వయసుకు చేరుకున్న ఆమె కవలల భవిష్యత్తు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులుగా మారడంపై అప్పట్లో మొదలైన చర్చ మళ్లీ తెరపైకి రావడమే తాజా వైరల్‌కు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఇదీ చదవండి: ఆ కుటుంబాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు!


