విజయ్‌తో విభేదాల్లేవు.. ఆయనే ప్రధాని అభ్యర్థి! | Vijay Backs Rahul Gandhi as PM Face Congress Denies Rift With TVK | Sakshi
Sakshi News home page

విజయ్‌తో విభేదాల్లేవు.. ఆయనే ప్రధాని అభ్యర్థి!

Sep 1 2026 8:44 AM | Updated on Sep 1 2026 8:53 AM

Vijay Backs Rahul Gandhi as PM Face Congress Denies Rift With TVK

తమిళనాడు రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వాములైన తమిళగ వెట్రి కళగం (టీవీకే), కాంగ్రెస్‌  మధ్య విభేదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయడాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే టీవీకే మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఆ ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తూ హస్తం పార్టీకి అసహనం తెప్పిస్తోంది. ఆ వెంటనే అసెంబ్లీలో సీటింగ్‌ మార్పు.. ఇరు పార్టీల మధ్య గ్యాప్‌నకు కారణమనే చర్చా నడిచింది. ఈ క్రమంలో తమిళనాడు కాంగ్రెస్‌ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడు అసెంబ్లీలో కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత తరహై కత్‌బర్ట్‌(Tharahai Cuthbert) మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌గాంధీని విజయ్‌ కూడా అంగీకరించారని ఆమె పేర్కొన్నారు. ‘‘సీఎం రాహుల్‌గాంధీనే ప్రధాని అభ్యర్థిగా ఎంచుకున్నారు. ఆయన కూడా అదే విధంగా ముందుకు వెళ్తున్నారు’’ అని తెలిపారు.

‘కాంగ్రెస్‌ ఎవరికీ బానిస కాదు’
టీవీకేకు కాంగ్రెస్‌ లోబడి పనిచేయడం లేదని తరహై కత్‌బర్ట్‌ స్పష్టం చేశారు. తమిళనాడులో తమ పార్టీ స్వతంత్రంగా విస్తరిస్తోందని, కాంగ్రెస్‌ ప్రజాస్వామ్యబద్ధమైన స్వతంత్ర పార్టీ అని పేర్కొన్నారు. కూటమిలో ఉన్నప్పటికీ పార్టీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు.

అందుకే సీటు మారాల్సి వచ్చింది
ఇదిలా ఉండగా.. అసెంబ్లీలో తన సీటు మార్పుపైనా కత్‌బర్ట్‌ వివరణ ఇచ్చారు. అంతకు ముందు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీవీకే ఎమ్మెల్యేలతోనే కూర్చున్నారు. తాజా తాజా వివాదం నేపథ్యంలో వాళ్లు కావాలనే సీటు మారి విపక్ష సభ్యులతో కూర్చున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేతగా కొత్త బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలోనే తనకు ముందు వరుసలో సీటు కేటాయించారని, దీనికి ఎలాంటి రాజకీయ కారణం లేదని కత్‌బర్ట్‌ స్పష్టం చేశారు. 

ఇక ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదానికి సంబంధించి రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదవడాన్ని కూడా కత్‌బర్ట్‌ ప్రస్తావించారు. రాహుల్‌కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీజేపీ ఆందోళన చెందుతోందని ఆరోపించారు. 2029లో రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ఇటీవల ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వేలో ప్రధాని పదవికి విజయ్‌ మూడో స్థానంలో నిలిచిన నేపథ్యంలో టీవీకే కార్యకర్తలు ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీనిపై కాంగ్రెస్‌ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

‘విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా చేస్తే బయటకొస్తాం’
అంతకు ముందు.. విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా టీవీకే ముందుకు తీసుకెళ్తే కాంగ్రెస్‌ మంత్రులు తమిళనాడు ప్రభుత్వాన్ని వీడతారని ఆ పార్టీకి చెందిన మంత్రి ఎస్‌. రాజేశ్‌ కుమార్‌ హెచ్చరించారు. ఆగస్టు 30న మార్తాండంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2029 ఎన్నికలకు రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా టీవీకే అంగీకరించకపోతే తాను, మరో కాంగ్రెస్‌ మంత్రి విశ్వనాథన్‌ వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి విజయ్‌ కేబినెట్‌ నుంచి బయటకు వస్తామని ప్రకటించారు.

విజయ్‌–రాహుల్‌ మధ్య సాన్నిహిత్యం
మరోవైపు విజయ్‌, రాహుల్‌గాంధీ మధ్య మంచి సంబంధాలున్నాయని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. కరూర్‌ ఘటన తర్వాత విజయ్‌కు రాహుల్‌ ఫోన్‌ చేసి సంఘీభావం తెలపడాన్ని గుర్తు చేశారు. అలాగే ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే సంచలన అరంగేట్రం చేసింది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే ఆధిపత్యానికి సవాల్‌ విసిరింది. విజయ్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్‌గాంధీని ఆహ్వానించగా.. వేదికపై ఆయనను తన ‘సోదరుడు’గా విజయ్‌ అభివర్ణించారు. టీవీకే ప్రభుత్వానికి రాహుల్‌గాంధీ కూడా మద్దతు ప్రకటించారు.

మొత్తంగా.. విజయ్‌ నాయకత్వంలోని తమిళనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్‌ భాగస్వామ్యం కొనసాగుతున్నప్పటికీ, 2029 ప్రధాని అభ్యర్థిత్వం అంశం మాత్రం కూటమిలో కొత్త చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతానికి ఇరు పార్టీల నేతలు విభేదాలు లేవని చెబుతున్నా.. విజయ్‌ పేరును ప్రధాని అభ్యర్థిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు, రాహుల్‌గాంధీకి కాంగ్రెస్‌ మద్దతు నేపథ్యంలో భవిష్యత్తులో ఈ అంశం కూటమి మధ్య విభేదాలకు కారణమయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్‌ చెప్పిన ఆ గుంటనక్క ఎవరు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement