∙విజయ్‌కి ఆ ఆలోచనే లేదు ∙వైగో వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికల్లో రాహుల్ గాంధీ మాత్రమే ప్రధాని అభ్యర్థిగా ఉంటారని, తమిళనాడు సీఎం విజయ్‌కి అలాంటి ఆలోచన ఊహల్లో కూడా ఉండదని ఎండీఎంకే నేత వైగో వ్యాఖ్యానించారు. ఇకపై మంత్రులు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా సీఎం విజయ్ చూసుకోవాలని సూచించారు. సోమవారం తిరునెల్వేలిలో వైగో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమిళనాడులో ఒక భారీ ప్రభుత్వ మార్పు వచ్చిందని, టీవీకే ప్రభుత్వాన్ని సీఎం విజయ్ అవి నీతి రహితంగా నడిపిస్తున్నారని కొనియాడారు. గతంలో ప్రతి శాఖలో లంచాలు ఇస్తేనే పనులు జరిగే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. ప్రజలు ఏ ప్రభు త్వ కార్యాలయానికి వెళ్లినా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కమీషన్లు లేకుండా నేరుగా పాల న సాగుతోందన్నారు. 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ ప్రభుత్వానికి తాను 100కి 80 మార్కులు ఇస్తున్నానని, అవినీతిని పూర్తిగా నిర్మూలించడం హిమాలయాన్ని కదిలించినంత కష్టమైన పనిగా పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చక్కగా పనిచేస్తున్నట్టు వైగో అభినందించారు.
రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వం:
‘’రాహుల్ గాంధీని ప్రధానిగా అంగీకరించకపోతే రాజీనామా చేస్తాం’’ అని మంత్రి రాజేష్‌కుమార్ చేసినట్లుగా వచ్చిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సీఎం విజయ్ ఊహల్లో కూడా అలాంటి ఆలోచన ఉండదన్నారు. జాతీయ స్థాయిలో రాహుల్ గాం«దీనే ప్రధాని అభ్యరి్థగా ఉంటారని, మంత్రులు బాధ్యతారాహిత్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా సీఎం విజయ్ నిరోధించాలని సూచించారు. ఇక, కావేరీ నిర్వహణ బోర్డు తన బాధ్యతను విస్మరించిందని, కర్ణాటక ప్రభుత్వానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తూ తమిళనాడుకు ద్రోహం చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు అని, ఈ ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని వైగో డిమాండ్ చేశారు. కాగా, సీఎం విజయ్ భావి ప్రదాని అంటూ మంత్రులు వ్యాఖ్యల తూటాలను అందుకోవడంతో కాంగ్రెస్ నాయకులు గుర్రు మంటున్న విషయం తెలిసిందే.


