తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీవీకే అధినేత, సీఎం విజయ్ ఎన్నికల పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీవీకే ఎన్నికల ప్రచార గీతం కోసం సంగీత దర్శకుడు థమన్‌కు రూ.10 లక్షలు చెల్లించారన్న ఆరోపణకు ఎలాంటి ఆధారాలు లేవని విజయ్ స్పష్టం చేశారు. వాస్తవంగా ఆ మొత్తం చెల్లించినట్లు నిరూపించే ఒప్పందం, ఇన్వాయిస్, రసీదు, కోట్, చెల్లింపు తేదీ, చెల్లించిన వ్యక్తి, తీసుకున్న వ్యక్తి వంటి వివరాలేవీ పిటిషన్‌లో లేవన్నారు.
కాగా, పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో విజయ్‌పై పోటీ చేసి ఓడిపోయిన డీఎంకే అభ్యర్థి ఆర్.డి. శేఖర్ కోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. సీఎం విజయ్ ప్రచార గీతం ‘తని ఒరువన్ వెడిచు వరాన్.. విసిల్లు ఒన్ను అడిచు వరాన్’ రూపొందించేందుకు థమన్‌కు రూ.10 లక్షలు చెల్లించినట్లు అందులో ఆరోపించారు. దీనిపై విజయ్ మరో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఆరోపణలు నిజం కాదన్నారు. ఈ మొత్తం చెల్లించినట్లు నిరూపించే ఒప్పందం, ఇన్వాయిస్, రసీదు, చెల్లింపు వివరాలు ఏవీ పిటిషన్‌లో లేవని విజయ్ కోర్టుకు తెలిపారు. థమన్ రూ.10 లక్షలు తీసుకుని ఉంటారని పిటిషనర్ కేవలం ‘తెలుసుకున్న సమాచారం’గా పేర్కొన్నారని.. అది వాస్తవ చెల్లింపునకు ఆధారం కాదని విజయ్ వాదించారు. అందువల్ల ఈ ఆరోపణ ఊహాజనితమైనదేనని పేర్కొన్నారు.
రూ.40 లక్షల ఎన్నికల ఖర్చు?
అలాగే, ఎన్నికల ప్రచారంలో చట్టబద్ధమైన రూ.40 లక్షల వ్యయ పరిమితిని మించారని చేసిన ఆరోపణలను కూడా విజయ్ తిప్పికొట్టారు. వాస్తవంగా ఖర్చు చేసినట్లు నిరూపించే ప్రాథమిక ఆధారాలు లేకుండా కేవలం అంచనా మొత్తాలను కలిపి చూపించారని తెలిపారు. ఇదే సమయంలో ఎన్నికల ప్రచారానికి విదేశాల నుంచి నిధులు అందాయన్న ఆరోపణలోనూ ఎవరు డబ్బు ఇచ్చారు? ఎంత ఇచ్చారు? అనే వివరాలు లేవని విజయ్ పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న వ్యక్తి సోషల్ మీడియా ఖాతా నిర్వహిస్తున్నంత మాత్రాన విదేశీ నిధులు అందినట్లు భావించలేమన్నారు.
చదవండి: సీఎం విజయ్ ఆకస్మిక పర్యటన.. నేరుగా ఖైదీలతో
53,715 ఓట్ల భారీ మెజారిటీ..
తన పిల్లలకు ఇచ్చిన రుణాలు, వాటిని ఆదాయపు పన్ను రిటర్నుల్లో చూపించారా లేదా అనే అంశాలు ఎన్నికల ఫలితాలను ఎలా ప్రభావితం చేశాయో కూడా పిటిషనర్ వివరించలేదని విజయ్ తెలిపారు. పెరంబూర్‌లో విజయ్‌కు 1,20,365 ఓట్లు రాగా.. ఆర్.డి. శేఖర్‌కు 66,650 ఓట్లు వచ్చాయి. అంటే విజయ్ 53,715 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. ఎన్నికల ప్రచారంలో తాను ప్రార్థనా స్థలాలకు వెళ్లడం మాత్రమే అవినీతి ఎన్నికల పద్ధతిగా పరిగణించలేమని విజయ్ స్పష్టం చేశారు. మతపరమైన విజ్ఞప్తి చేశారంటే.. ఏం మాట్లాడారు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? ఏ సందేశం ఇచ్చారు? వంటి పూర్తి వివరాలు పిటిషన్‌లో ఉండాలని, కానీ అవేవీ లేవని హైకోర్టుకు తెలిపారు.


