కార్పొరేట్ రంగంలో ఉద్యోగాల తొలగింపు (లేఆఫ్స్) ఉద్యోగుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో ఒక విచిత్ర ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం కోల్పోయిన 29 ఏళ్ల యువకుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల కాకుండా, కేవలం మానసిక ప్రశాంతత కోసమే ఒక రెస్టారెంట్‌లో పాత్రలు కడిగే (డిష్‌వాషింగ్) పనిలో చేరాడు.
రెడ్డిట్ (Reddit) వేదికగా ‘mangodrives’ అనే యూజర్ పంచుకున్న వివరాల ప్రకారం.. ఏప్రిల్ నెలలో అతడిని కార్పొరేట్ ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే, అతనికి మునుపటి కంపెనీ నుంచి 9 నెలల భారీ సెవరెన్స్ ప్యాకేజీ లభించింది. అదనంగా నవంబర్ వరకు నిరుద్యోగ భృతి కూడా అందుతోంది. పొదుపు అలవాటు ఉండటం వల్ల రాబోయే 5 ఏళ్లకు సరిపడా అత్యవసర నిధి (ఎమర్జెన్సీ ఫండ్) కూడా తన వద్ద ఉందని అతను పేర్కొన్నాడు.
లేఆఫ్ తర్వాత దాదాపు 200 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని, 15 ఇంటర్వ్యూలకు హాజరైనా ఫలితం లేకపోయింది. నాలుగు నెలల పాటు ఇంట్లోనే ఖాళీగా ఉండటంతో రోజువారీ దినచర్య దెబ్బతిని, పనికిరానివాడిగా మారాననే భావన అతనిలో మొదలైంది. తీవ్రమైన మానసిక ఆందోళన, నిస్పృహల నుంచి బయటపడేందుకు గంటకు 11 డాలర్ల (సుమారు రూ.900) వేతనంతో పార్ట్‌టైమ్ డిష్‌వాషింగ్ ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకున్నాడు.
ఈ నిర్ణయం డబ్బు కోసం కాదని, తన దినచర్యను క్రమబద్ధీకరించుకోవడానికీ, కొన్ని గంటల పాటు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికేనని స్పష్టం చేశాడు.
ఈ అనుభవం ద్వారా జీవితం, రిటైర్మెంట్ అసలు అర్థంపై అతను ఆలోచనలో పడ్డాడు. 30 ఏళ్లుగా కార్పొరేట్ రంగంలో పనిచేస్తూ మరో మూడేళ్లలో పదవీ విరమణ చేయనున్న తన తండ్రి పరిస్థితిని గుర్తుచేసుకుంటూ, జీవితాంతం పనిచేసిన తర్వాత రిటైర్ అయితే ఆయన ఇంతకంటే ఎక్కువ శూన్యతను ఎదుర్కొంటారేమోనని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇది కూడా చదవండి: వైద్యానికని చెప్పి.. కన్న కొడుకును కడతేర్చిన తండ్రి


