కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మహర్షి వాల్మీకి ఎస్టీ అభివృద్ధి నిగమ్ నిధుల గోల్‌మాల్ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. దాదాపు రూ. 89 కోట్ల నిధుల మళ్లింపు ఆరోపణలతో రాష్ట్ర ప్రణాళిక, గణాంకాల శాఖ మంత్రి బీ నాగేంద్ర పదవి చేపట్టిన కేవలం 25 రోజుల్లోనే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. గిరిజనుల సంక్షేమం కోసం ఉద్దేశించిన నిధులు పక్కదారి పట్టడం, దీని వెనుక కీలక కుట్ర దాగి ఉందన్న ఆరోపణలు ఇప్పుడు కన్నడ నాట రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.
25 రోజులకే ముగిసిన మంత్రి పదవి
కర్ణాటక కేబినెట్‌లో ప్రణాళిక, గణాంకాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీ నాగేంద్ర 25 రోజులు గడవక ముందే తన పదవిని వీడాల్సి వచ్చింది. ‘కర్ణాటక మహర్షి వాల్మీకి అనుసూచిత తెగల అభివృద్ధి నిగమ్’ (కేఎంవీఎస్‌టీడీసీ)లో జరిగిన రూ.89 కోట్ల అవకతవకల ఆరోపణలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు. 2024లోనూ ఇదే వ్యవహారంలో మంత్రి పదవిని కోల్పోయి, ఈడీ అరెస్టు అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
రాజకీయ ప్రకంపనలు.. కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధం
నాగేంద్ర రాజీనామాతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నాగేంద్ర నిర్దోషి అని, ఆయన తనపై వస్తున్న ఆరోపణలతో తీవ్రంగా మనస్తాపం చెందారని ప్రభుత్వం పేర్కొంది. పార్టీ ప్రయోజనాల దృష్ట్యానే ఆయన రెండోసారి మంత్రి పదవిని త్యాగం చేశారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు నాగేంద్ర రాజీనామా తమ పోరాటానికి దక్కిన విజయమని బీజేపీ అభివర్ణించింది. ప్రస్తుత ప్రభుత్వంలో ఇది తొలి వికెట్ పడటమేనని ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ వ్యాఖ్యానించగా, నాగేంద్ర కేవలం చిన్న చేప మాత్రమేనని, తెరవెనుక ఇంకా పెద్ద సూత్రధారులు ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆరోపించారు.
వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం
కర్ణాటక మహర్షి వాల్మీకి ఎస్టీ అభివృద్ధి నిగమ్‌లో చోటుచేసుకున్న భారీ ఆర్థిక అక్రమమే ఈ వాల్మీకి కుంభకోణం. కార్పొరేషన్‌కు చెందిన మొత్తం రూ.187 కోట్ల నిధులలో దాదాపు రూ.89.63 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించి స్వాహా చేశారన్నది ప్రధాన ఆరోపణ. షెడ్యూల్డ్ తెగలు (ఎస్‌టీ), ఆదివాసీ వర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం కేటాయించిన ప్రజాధనాన్ని నకిలీ కంపెనీలు, ఐటీ సంస్థలు, ఒక కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఖాతాల్లోకి మళ్లించి అక్రమాలకు పాల్పడినట్లు తేలింది.
వెలుగులోకి తెచ్చిన అధికారి ఆత్మహత్య
ఈ కుంభకోణం ఒక విషాదకర ఘటనతో బయటకు వచ్చింది. కార్పొరేషన్ అకౌంట్స్ సూపరింటెండెంట్, 52 ఏళ్ల చంద్రశేఖరన్ పీ ఆత్మహత్య చేసుకోవడంతో ఈ భారీ మోసం వెలుగు చూసింది. ఆయన రాసిన సుసైడ్ నోట్‌లో.. ఉన్నతాధికారులు, బోర్డు యాజమాన్యం తమపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అనుమతులు లేకుండానే నిధులను అక్రమంగా బదిలీ చేయించారని వివరించారు. ఈ లేఖ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించగా అసలు బాగోతం బయటపడింది.
600 ఖాతాలు.. హైదరాబాద్‌తో లింకులు
దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని కార్పొరేషన్ అధికారిక ఖాతా నుండి సుమారు రూ.88.62 కోట్లను నకిలీ చెక్కులు, ఆర్‌టీజీఎస్, ఆన్‌లైన్ విధానాల ద్వారా అక్రమంగా బదిలీ చేశారు. ఈ నిధులను దాదాపు 600 వేర్వేరు ఖాతాల్లోకి పంపించారు. వీటిలో హైదరాబాద్‌లోని ‘ఫస్ట్ ఫైనాన్స్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ’ ఖాతాలు కూడా ఉండటం గమనార్హం. ఆ తర్వాత ఈ మొత్తాన్ని నగదు రూపంలో డ్రా చేసినట్లు గుర్తించారు. ఈ సొమ్మును ఎన్నికల ప్రచారాల కోసం వినియోగించారనే కోణంలోనూ దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి.
ఈడీ విచారణ.. ప్రధాన కుట్రదారుగా నాగేంద్ర
రాష్ట్ర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సీట్)తో పాటు రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఈ మనీ లాండరింగ్ వ్యవహారంలో కీలక ఆధారాలు సేకరించింది. కార్పొరేషన్ బ్యాంకు ఖాతాను నిబంధనలకు విరుద్ధంగా బెంగళూరు ఎంజీ రోడ్డులోని ఒక నిర్దిష్ట బ్రాంచ్‌కు మార్చడంలో, తన వ్యక్తిగత సిబ్బంది, ప్రైవేట్ సంస్థల ద్వారా రూ.89.63 కోట్ల నిధులను లేయరింగ్, డైవర్షన్ చేయించడంలో నాగేంద్ర ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారని ఈడీ పేర్కొంది. ఇందులో దాదాపు రూ.20 కోట్ల నిధులను రాజకీయ అవసరాలకు మళ్లించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ఇది కూడా చదవండి: కష్టాల ఊబిలోంచి.. దర్జీ కూతురి ‘సీఎస్’ విజయం


