నేడే నీట్‌ పరీక్ష.. 10కే రన్‌తో అభ్యర్థులకు ట్రాఫిక్‌ టెన్షన్‌! | NEET Students Alert For Traffic Advisory In Hyderabad | Sakshi
Sakshi News home page

నేడే నీట్‌ పరీక్ష.. అభ్యర్థులకు ట్రాఫిక్‌ టెన్షన్‌!

Aug 30 2026 7:12 AM | Updated on Aug 30 2026 7:22 AM

NEET Students Alert For Traffic Advisory In Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: వైద్య విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్‌ పీజీ–2026 పరీక్ష నేడు జరగనుంది. తెలంగాణలో 17,600 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానుండగా.. హైదరాబాద్‌లో అదే రోజు 10కే రన్‌ కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. దీంతో పరీక్షకు వెళ్లే అభ్యర్థులు ముందుగానే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

తెలంగాణలోని 14 జిల్లాల్లో 56 పరీక్ష కేంద్రాల్లో నీట్‌ పీజీ పరీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 340 నగరాల్లో 1,300 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. మొత్తం 2,73,183 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుంది. అభ్యర్థులను ఉదయం 7 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మొత్తం 180 ప్రశ్నలకు 210 నిమిషాల సమయం కేటాయించారు. పరీక్ష కేంద్రాల్లో అక్రమాలకు తావులేకుండా సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ విధానం, సిగ్నల్‌ జామర్లతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు అడ్మిట్‌ కార్డుతో పాటు ఒరిజినల్‌ ఐడీ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
మరోవైపు హైదరాబాద్‌లో 10కే రన్‌ కారణంగా ఉదయం 5 గంటల నుంచి 11.30 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా మాదాపూర్ కేబుల్‌ బ్రిడ్జి, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ప్రభావం ఉండే అవకాశం ఉంది. గచ్చిబౌలి ఫ్లైఓవర్‌, ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ వైపు రద్దీ పెరగొచ్చని పోలీసులు తెలిపారు.

మాదాపూర్ ఫైర్‌ స్టేషన్‌ నుంచి జూబ్లీ జంక్షన్‌ వరకు, టెక్‌ మహీంద్రా, లెమన్‌ ట్రీ హోటల్‌, రాయదుర్గం మార్గాల్లోనూ ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయి. అవసరాన్ని బట్టి ఐకియా మీదుగా గచ్చిబౌలి స్టేడియం వైపు వాహనాలను మళ్లించనున్నారు. నీట్‌ పీజీ అభ్యర్థులు ట్రాఫిక్‌ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి, పరీక్ష కేంద్రాలకు వీలైనంత ముందుగానే చేరుకోవాలని సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ, ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు.

చదవండి: గేటు మూయకుంటే.. ఇక వేటు.. 

మారథాన్ రన్ మార్గం
పీపుల్స్ ప్లాజా (నెక్లెస్ రోడ్) – రోటరీ – ఎన్‌టిఆర్ మార్గ్ – ట్యాంక్ బండ్ – చిల్డ్రన్స్ పార్క్ – సెయిలింగ్ క్లబ్ – సోనాబీ మసీదు – బుద్ధ భవన్ – సంజీవయ్య పార్క్ – పీపుల్స్ ప్లాజా – రోటరీ – వి.వి. విగ్రహం, ఖైరతాబాద్ – లోక్ భవన్ రోడ్ – సోమాజిగూడ – పంజాగుట్ట ఫ్లైఓవర్ – ఎంజె కాలేజ్ – ఎస్ఎన్‌టి జంక్షన్ – సాగర్ సొసైటీ – కెబిఆర్ పార్క్ – జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ – రోడ్ నంబర్ 45 – కేబుల్ బ్రిడ్జి.

ట్రాఫిక్ మళ్లింపు పాయింట్లు
మినిస్టర్స్ రోడ్, రాణిగంజ్ వైపు నుండి వచ్చే వాహనాలు: నెక్లెస్ రోడ్ వైపు అనుమతించరు. నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్, మినిస్టర్స్ రోడ్ వైపు మళ్లిస్తారు.

పంజాగుట్ట, రాజ్ భవన్ నుండి ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలు: వి.వి. విగ్రహం వద్ద షాదాన్, నిరంకారీ భవన్ మీదుగా రవీంద్ర భారతి వైపు మళ్లిస్తారు.

ఖైరతాబాద్ ఫ్లైఓవర్, షాదాన్ నుండి బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనాలు: కె.సి.పి వద్ద తాజ్ కృష్ణా - రోడ్ నం. 10 & 12, క్యాన్సర్ హాస్పిటల్ - ఒడిశా ఐలాండ్ మీదుగా జూబ్లీహిల్స్ వైపు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలి.

ఇక్బాల్ మినార్ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలు: తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ ప్రారంభ పాయింట్ వద్ద ఫ్లైఓవర్ పైకి మళ్లిస్తారు.

లిబర్టీ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలు: అంబేడ్కర్ విగ్రహం వద్ద తెలంగాణ తల్లి, ఇక్బాల్ మినార్ యు-టర్న్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ ద్వారా లోయర్ ట్యాంక్ బండ్ / కట్ట మైసమ్మ గుడి వైపు మళ్లిస్తారు.

కర్బాలా వైపు నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చు వాహనాలు: చిల్డ్రన్స్ పార్క్ వద్ద డిబిఆర్ మీదుగా కవాడిగూడ వైపు మళ్లిస్తారు.

ముషీరాబాద్, జబ్బార్ కాంప్లెక్స్ నుండి సెయిలింగ్ క్లబ్ మీదుగా అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చు వాహనాలు: కవాడిగూడ ఎక్స్ రోడ్ వద్ద డిబిఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారు.

తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ నుండి లోయర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చు వాహనాలు: అప్పర్ ట్యాంక్ బండ్ వైపు అనుమతించరు. డిబిఆర్ మిల్స్ వద్ద కవాడిగూడ ఎక్స్ రోడ్, గోశాల మీదుగా జబ్బార్ కాంప్లెక్స్ వైపు మళ్లిస్తారు.

మారథాన్ నెక్లెస్ రోటరీకి చేరుకున్నప్పుడు: బేగంపేట నుండి రాజ్ భవన్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనాలను గ్రీన్‌లాండ్స్ జంక్షన్ వద్ద డి.కె. రోడ్, అమీర్‌పేట్ వైపు మళ్లిస్తారు.

బంజారాహిల్స్ వైపు వెళ్లేందుకు: డి.కె. రోడ్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎన్‌ఎఫ్‌సిఎల్ - తాజ్ కృష్ణా, రోడ్ నం. 10 & 12, బంజారాహిల్స్ మీదుగా వెళ్లాలి.

జూబ్లీహిల్స్ వైపు వెళ్లేందుకు: డి.కె. రోడ్, అమీర్‌పేట్, మైత్రివనం, యూసుఫ్‌గూడ, వెంకటగిరి, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా వెళ్లాలి.

మారథాన్ పంజాగుట్ట ఫ్లైఓవర్ ఎక్కినప్పుడు: పంజాగుట్ట నుండి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 వైపు వెళ్లే వాహనాలను ఎన్‌ఎఫ్‌సిఎల్ జంక్షన్ వద్ద బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు (తాజ్ కృష్ణా, రోడ్ నంబర్ 10 & 12, క్యాన్సర్ హాస్పిటల్, ఒరిస్సా ఐలాండ్ మీదుగా) మళ్లిస్తారు.

మారథాన్ సాగర్ సొసైటీ జంక్షన్‌కు చేరుకున్నప్పుడు: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి పంజాగుట్ట వైపు వచ్చు వాహనాలను బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 వైపు అనుమతించరు. ఎన్‌టిఆర్ భవన్ వద్ద కుడివైపునకు మళ్లించి క్యాన్సర్ హాస్పిటల్, జహీరా నగర్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 మీదుగా పంజాగుట్ట వైపు పంపుతారు.

మారథాన్ ఎన్‌టిఆర్ భవన్ చేరుకున్నప్పుడు: ఫిల్మ్ నగర్, బివిబి జంక్షన్ నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వచ్చు వాహనాలను జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నంబర్ 70 వద్ద హార్ట్ కప్ జంక్షన్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 54 మీదుగా రోడ్ నంబర్ 36 వైపు మళ్లిస్తారు.

సైబరాబాద్ కేబుల్ బ్రిడ్జి నుండి వచ్చు వాహనాలు: ఫ్లైఓవర్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 వైపు అనుమతించరు. ఈ వాహనాలను ర్యాంప్ ద్వారా మెగ్నోలియా బేేకరీ జంక్షన్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 39 మీదుగా రోడ్ నంబర్ 36 వైపు అనుమతిస్తారు.

ఏదైనా అత్యవసర పరిస్థితిలో ప్రయాణ సాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 కు కాల్ చేయాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement