నీటి వినియోగ సంఘాలకు అధికారాలు, బాధ్యతలు
చెరువుల పరిరక్షణకు కమిటీలు
రైతు సంక్షేమ కమిషన్ సిఫారసు
సాక్షి, హైదరాబాద్: వాల్టా, పంచాయతీరాజ్ చట్టాలను సవరించి పంచాయతీరాజ్ సంస్థలు/ నీటి వినియోగ సంఘాలకు నిర్వహణ, నీటి పన్ను వసూలు అధికారాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. చెరువుల దీర్ఘకాలిక పరిరక్షణకు ప్రత్యేక చిన్న నీటిపారుదల చట్టం రూపొందించాలని కోరింది. కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఇతర సభ్యులు ఈ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ముఖ్య సిఫారసులు ఇలా ఉన్నాయి..
చిన్న నీటిపారుదల శాఖ పునరుద్ధరణ..
నీటిపారుదల శాఖను భారీ నీటిపారుదల శాఖలో విలీనం చేయడంతో చెరువులపై పర్యవేక్షణ కొరవడి అనేక అనర్థాలు కలిగాయి. నీటి వినియోగదారుల సంఘాలు నిర్జీవంగా మారాయి. అగ్రి ఇంజనీరింగ్ నైపుణ్యం లోపించి నీటివినియోగ సామర్థ్యం తగ్గింది. ఎత్తిపోతల పథకాలు సమర్థవంతంగా లేవు. పట్టణ ప్రాంతాల్లో చెరువులు ఆక్రమణలు, కాలుష్యంతో ప్రమాదంలో పడ్డాయి. చిన్న నీటిపారుదల శాఖ వ్యవస్థను పునరుద్ధరించాలి. నిర్వహణ నిధులను నేరుగా నీటి వినియోగ సంఘాలు/పంచాయతీరాజ్ సంస్థలకు ఇవ్వాలి. నీటివినియోగ సంఘాలకు స్పష్టమైన అధికారాలు, నిధులు ఇవ్వాలి. జీఐఎస్, రిమోట్ సెన్సింగ్, మొబైల్ యాప్‌తో రియల్ టైమ్ మానిటరింగ్, ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ ఏర్పాటు చేయాలి. పంపు సెట్ల సామర్థ్యాన్ని మెరుగుపరిస్తే రూ.3 వేల కోట్ల విద్యుత్ చార్జీలను తగ్గించవచ్చు.
చెరువుల పరిరక్షణకు కమిటీలు
చెరువుల ఎఫ్‌టీఎల్ సరిహద్దులను గుర్తించి రక్షించాలి. ఆక్రమణలను తొలగించాలి. చిన్న నీటిపారుదల ఆస్తుల డిజిటల్ జాబితా రూపొందించాలి. చెరువుల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేసి చట్టపర గుర్తింపు కల్పించాలి. ప్రతి చెరువు, దాని ఆయకట్టు ప్రాంతం కోసం ఒక కమిటీ ఏర్పాటు కావాలి. కమిటీలో టెయిల్ ఎండ్, హెడ్ ఎండ్ రైతులు, పరీవాహక ప్రాంత రైతులు, మహిళా ప్రతినిధి, పంచాయతీరాజ్ సంస్థ ప్రతినిధి, మత్స్యకార సంఘం, కౌలు రైతు, ఇతరులు కలిపి మొత్తం 15 మంది ఉండాలి. చెరువుల పునరుద్ధరణ, నిర్వహణ, రైతుల మధ్య నీటిపంపకాల వివాదాలు పరిష్కరణ, ఆర్థిక లావాదేవీల బాధ్యతలు కమిటీలకు అప్పగించాలి.


