'ఏఐ'తో నోటీసులు | CEO Sudarshan Reddy special interview with Sakshi on SIR process | Sakshi
Sakshi News home page

'ఏఐ'తో నోటీసులు

Aug 30 2026 4:34 AM | Updated on Aug 30 2026 4:34 AM

CEO Sudarshan Reddy special interview with Sakshi on SIR process

అందుకే చిన్న తేడాలున్నా నోటీసులు వస్తున్నాయి

విచారణలో ఈఆర్వోనే ఫైనల్‌ అథారిటీ.. అనర్హులుగా నిర్ధారిస్తే స్పీకింగ్‌ ఆర్డర్‌ ఇవ్వాలి

తుది జాబితాలో ఆ ఓటరు పేరు రాదు..  

జిల్లా కలెక్టర్‌కు, ఆపై సీఈఓకు అప్పీళ్లకు చాన్స్‌

స్వల్ప వ్యత్యాసాలున్న ఓటర్లను బీఎల్‌ఓ సైతం సిఫారసు చేస్తారు 

సర్‌ ప్రక్రియపై ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఈఓ సుదర్శన్‌రెడ్డి

100 శాతం నోటీసుల జనరేషన్‌ పూర్తయింది. 90 లక్షల మంది ఓటర్లకు ఒకేసారి నోటీసులిచ్చి విచారణ జరపలేం. ఈ విషయంలో ఓటర్లు నిరీక్షించాలి. ప్రతి నియోజకవర్గానికి, ప్రతి ఈఆర్వోకు రోజూ నిర్దేశిత సంఖ్యలో నోటీసులు జారీ చేయాలని ఆదేశించాం. దశలవారీగా నోటీసులిస్తాం. అనామలీస్, అన్‌మ్యాప్డ్‌ ఓటర్ల జాబితాలను ఈసీ మా స్థాయిలో అందుబాటులో పెట్టలేదు.  

ముహమ్మద్‌ ఫసియొద్దీన్‌
‘వ్యత్యాసాలున్న ఓటర్లు, మ్యాపింగ్‌కాని ఓటర్లను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) గుర్తించి నోటీసులు జనరేట్‌ చేస్తుంది. వాటిని మేము తయారు చేయలేదు. నోటీసులు అందిన ఓటర్లందరూ విచారణకు హాజరై తమ వద్ద ఉన్న ధ్రువీకరణ పత్రాలను రుజువుగా సమర్పించాలి. విచారణలో నిర్ణయాలు తీసుకోవడానికి ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారుల (ఈఆర్వో)కు విచక్షణాధికారం ఉంది. విచారణలో ఈఆర్వోనే ఫైనల్‌ అథారిటీ. ఒకవేళ విచారణలో ఎవరైనా ఓటరు పేరు తొలగించాలని నిర్ణయిస్తే అందుకు కారణాలను వివరిస్తూ ఈఆర్వోలు స్పీకింగ్‌ ఆర్డర్‌ ఇవ్వాల్సి ఉంటుంది’ అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ–2026 ప్రక్రియపై ఓటర్ల అనుమానాలు నివృత్తి చేయడానికి ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.  

సాక్షి: ఈఆర్వోలకు పూర్తి విచక్షణాధికారం ఉందా? ధ్రువ పత్రాలను వెబ్‌ సైట్‌లో వేస్తే రిజెక్ట్‌ చేస్తుందా? 
సీఈఓ: ఈఆర్వోలకు పూర్తి విచక్షణాధికారం ఉంది. విచారణలో ఓటర్లు సమర్పించే ధ్రువీకరణ పత్రాలను ఈసీఐ వెబ్‌సైట్‌ తిరస్కరించదు. ఆ పత్రాలను నిర్ధారించడానికి జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ/జిల్లా కలెక్టర్‌)కి వాటిని పంపిస్తారు. డీఈఓ ధ్రువీకరిస్తే మళ్లీ ఆ వివరాలు ఈఆర్వో యాప్‌కు తిరిగి వస్తాయి. దీంతో వారు ఆమోదిస్తారు. ఈ విషయంలో అవసరమైతే ఈఆర్వోలు తదుపరి విచారణ జరపవచ్చు.   

సాక్షి: అవసరమైతే ఈఆర్వోలు ఓటర్ల ఇళ్ల వద్ద విచారణ జరపవచ్చా? 
సీఈఓ: విచారణ జరిపే పూర్తి అధికారం ఈఆర్వోలకు ఉంది. ఎన్నో పద్ధతులను వారు అనుసరించవచ్చు. ఎవరిపైనైనా ఫిర్యాదులు వస్తే సమగ్ర విచారణ జరపవచ్చు.  

సాక్షి: తమకూ నోటీసులు వస్తాయేమోనని చాలామంది ఆందోళనలో ఉన్నారు. అనామలీస్, అన్‌మ్యాప్డ్‌ ఓటర్ల జాబితాను ప్రకటిస్తే ఆందోళన పోతుంది కదా? 
సీఈఓ: 100శాతం నోటీసుల జనరేషన్‌ పూర్తైంది. 90 లక్షల మంది ఓటర్లకు ఓకేసారి నోటీసులిచ్చి విచారణ జరపలేం. ఓటర్లు నిరీక్షించాలి. ప్రతి నియోజకవర్గానికి, ప్రతి ఈఆర్వోకు రోజూ నిర్దేశిత సంఖ్యలో నోటీసులు జారీ చేయాలని ఆదేశించాం. దశలవారీగా నోటీసులిస్తాం. అనామలీస్, అన్‌మ్యాప్డ్‌ ఓటర్ల జాబితాలను ఈసీ మా స్థాయిలో అందుబాటులో పెట్టలేదు. బీఎల్‌ఓస్థాయిలో రాజకీయ పారీ్టలకు ఇవ్వవచ్చు.  

సాక్షి: స్వల్ప వ్యత్యాసాలున్న ఓటర్లకు నోటీసులు ఇవ్వరాదని ఆదేశించారు? నోటీసులు అందుకునే వారి సంఖ్య తగ్గిందా? 
సీఈఓ: వ్యత్యాసాలున్న ఓటర్లందరికీ నోటీసులు ఇచ్చి విచారణలో ఈఆర్వోలు నిర్ణయంతీసుకుంటారు. స్వల్ప వ్యత్యాసాలున్న ఓటర్ల విషయంలో ఈఆర్వోల నిర్ణయం ప్రక్రియ ముగిశాక తెలుస్తుంది.  

సాక్షి: విచారణకు ఓటర్లకు బదులు వేరేవారు వెళ్లవచ్చా?  
సీఈఓ: వృద్ధులు, అనారోగ్యంతో, విదేశాల్లో ఉన్న ఓటర్లకు బదులు కుటుంబ సభ్యులే వెళ్లగలరు.  

సాక్షి: నోటీసులు వచ్చిన ప్రతి ఒక్కరూ విచారణకు వెళ్లాల్సిందేనా? 
సీఈఓ: ఇది ఏఈఆర్వోలపై ఆధారపడి ఉంటుంది. నోటీసులిచ్చి బీఎల్‌ఓ వివరిస్తారు. స్థానిక పోలింగ్‌ స్టేషన్‌ వద్ద బీఎల్‌ఓలు, ఏఈఆర్వోలు విచారణ నిర్వహిస్తారు. నోటీసులో విచారణ తేదీ, వేదిక వివరాలిస్తారు. ఏడో రోజు ముందు నోటీసులు జారీ చేస్తారు. 48 గంటల ముందు విచారణ విషయాన్ని మళ్లీ ఓటర్లకు బీఎల్‌ఓలు గుర్తు చేస్తారు.  

సాక్షి: విచారణ సిబ్బంది సరిపోతారా?  
సీఈఓ: 119 మంది ఈఆర్వోలు, 890 మంది ఏఈఆర్వోలుండగా, 395 మంది అదనపు ఏఈఆర్వుల నియామకానికి ఈసీ అనుమతిచ్చింది. మరో 530 మంది అదనపు ఏఈఆర్వోల కోసం ఈసీని అడిగాం. ఏఈఆర్వోలుగా తహశీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లను నియమించాం.  

సాక్షి: దరఖాస్తులు, అభ్యంతరాలు ఎవరికి ఇవ్వాలి? 
సీఈఓ: బీఎల్‌ఓల వద్ద దరఖాస్తులు, అభ్యంతరాల కోసం ఫారం–6, 7, 8 దరఖాస్తులను అందుబాటులో ఉంచాం. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే బీఎల్‌ఓలకు ఫిజికల్‌ కాపీలను ఇవ్వాల్సిన అవసరం లేదు.  

సాక్షి: ఈసీ నిర్దేశించిన 12 రకాల పత్రాలు ఎవరు ఇవ్వాలి? ఎవరికి మినహాయింపు ఉంది? 
సీఈఓ: సర్‌–2002 జాబితాతో మ్యాపింగ్‌ జరగని ఓటర్లు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. అన్‌మ్యాప్డ్‌ ఓటర్లు ఇప్పుడు కూడా 2002 జాబితాలో పేరున్నట్టు ఆధారాలు చూపితే వీటిని ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే, వారి వివరాల్లో తేడాలు ఉండరాదు. కేవలం వ్యత్యాసాలు కలిగిన ఓటర్లు సర్‌–2002 వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.  

సాక్షి: చాలా మంది విషయంలో 2002, ప్రస్తుత ఓటర్ల జాబితా..రెండింటి వివరాల్లో తప్పులే ఉన్నాయి. ఇందులో ఏ జాబితాలోని వివరాలు సరైనవని రుజువు చేసుకోవాలి.? 
సీఈఓ: మీ దగ్గర ఉన్న ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ఏది కరెక్ట్‌ అయితే అది రుజువు చేసుకోవాలి. పదో తరగతి సర్టిఫికెట్‌ చూపినా సరిపోతుంది. 2002 తర్వాత చాలామంది పేర్లు విస్తృతమయ్యాయి.  
 
సాక్షి: నోటీసులు అందుకున్న వారు విచారణకు హాజరుకాకపోతే తుది జాబితాలో పేరు ఉండదా? 
సీఈఓ: తొలిసారి విచారణకు హాజరు కాకపోతే విచారణను రీషెడ్యూల్‌ చేసి పిలుస్తారు. చివరి జాబితాలో వారి పేరు వచ్చేలా వారిని ఈఆర్వోలు వెతికి తీస్తారు. నోటీసుకు స్పందించకపోతే తుది జాబితాలో పేరు రాదు.  

సాక్షి: ఓటరుకు నోటీసు వచ్చిందని చెప్పడానికి రుజువేంటి? 
సీఈఓ: నోటీసు ఇచ్చాక ఓటరు సంతకంతోపాటు ఫొటోను బీఎల్‌ఓ తీసుకుంటారు. ఎవరికైనా నోటీసు ఇవ్వలేకపోయారో బీఎల్‌ఓ చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బీఎల్‌ఓపై ఈఆర్వోకు ఫిర్యాదు చేయొచ్చు.   

సాక్షి: ఆన్‌లైన్‌లో నోటీసులకు రిప్లై ఇవ్వొచ్చా? 
సీఈఓ: ఆన్‌లైన్‌లో నోటీసులకు సమాధానం ఇవ్వొచ్చు. సాఫ్ట్‌వేర్‌లో డాక్యుమెంట్‌–1, డాక్యుమెంట్‌–2.. ఇలా ఆప్షన్స్‌ ఉంటాయి. అందులో టైప్‌ ఆఫ్‌ డాక్యుమెంట్‌ సెలక్ట్‌ చేసుకుని అప్‌లోడ్‌ చేయాలి. విచారణ జరిపి ఈఆర్వో ఆమోదిస్తారు. సాఫ్ట్‌వేర్‌ రిజెక్ట్‌ చేయలేదు. పత్రం నిర్థారణకు డీఈఓకు వెళ్తుంది. స్పెల్లింగ్‌ తప్పిదాలు వంటి చిన్న విషయమైతే బీఎల్‌ఓకు వెళ్తుంది. బీఎల్‌ఓలు పరిశీలించి తమ యాప్‌ ద్వారా సిఫారసు చేయొచ్చు.  
  
సాక్షి: పౌరసత్వంపై అనుమానాలు వస్తే ఏ చర్యలు తీసుకుంటారు? 
సీఈఓ: పౌరసత్వం రుజువు కాకుంటే ఓటు తీసేస్తాం. వారిపై జిల్లా కలెక్టర్లు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. వారికి ఆ అధికారం ఉంది. 

సాక్షి: సర్‌ దరఖాస్తులు, అభ్యంతరాలతోపాటు విచారణ గడువు పొడిగింపు ఉంటుందా? 
సీఈఓ: గడువు పొడిగింపుపై ఇప్పుడే చెప్పలెం. ఒడిశాలో పొడిగించారు. ఈసీ పెంచవచ్చని మేమూ ఆశిస్తున్నాం.  

సాక్షి: ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్‌ వేసిన చాలామంది పేర్లు ముసాయిదా జాబితాలో రాలేదు? 
సీఈఓ: ఆన్‌లైన్‌తోపాటు ఫిజికల్‌గా ఫారం ఇచ్చినా కొందరి పేర్లు రాలేదు. ప్రతి ఒక్కరూ తమ పేరు ముసాయిదా ఫారంలో చూడాలి. అక్కడ లేకుంటే ఏఎస్‌డీడీ జాబితాలో చూడాలి. తొలగించినట్టు గుర్తిస్తే మళ్లీ ఓటరుగా నమోదు కావడానికి ఫారం–6 దరఖాస్తు చేయాలి. పట్టణ ప్రాంతాల్లో ఆపరేటర్ల తప్పిదంతో కొందరి పేర్లు తప్పిపోయాయి.  
 
సాక్షి: కేవలం పాతబస్తీవారి ఓట్లే పోతాయి..మాకేం భయం లేదని చాలామందిలో భావన ఉంది? 
సీఈఓ: రాజకీయ పార్టీలు పాతబస్తీలో బాగా పని చేశాయి. అక్కడే ఎన్యూమరేషన్‌ బాగా జరిగింది. తుది జాబితా వచ్చాక వాస్తవాలు తెలుస్తాయి.  
 
సాక్షి: ఈఆర్వో తిరస్కరించిన వారి పేర్లు ఆ తర్వాత అప్పీల్‌లో ఆమోదిస్తే తుది జాబితాలో పేరు చేర్చుతారా? 
సీఈఓ: ఈఆర్వోల నిర్ణయం తర్వాత తుది జాబితా ప్రచురిస్తారు. వారు తిరస్కరించిన ఓటర్లు 15 రోజుల్లోగా జిల్లా ఎన్నికల అధికారికి తొలి అప్పీల్‌ చేయాలి. అక్కడా తిరస్కరిస్తే 30 రోజుల్లోగా సీఈఓకు రెండో అప్పీల్‌ చేయాలి. అప్పీల్‌లో ఆమోదిస్తే తదుపరిగా ముద్రించే త్రైమాసిక ఓటర్ల జాబితాల్లో వారి పేర్లు వస్తాయి. 
 
సాక్షి: మ్యాపింగ్‌లో ఎన్ని రకాల వ్యత్యాసాలు గుర్తించారు? 
సీఈఓ: ఆరు నెలల కింద మ్యాపింగ్‌లో 17 రకాల వ్యత్యాసాలు ఉండగా, ఇప్పుడు పదకొండుకు తగ్గాయి.  

సాక్షి: ముసాయిదా జాబితాలోని పేర్లపై ఫిర్యాదు వస్తే వారిని విచారణకు పిలుస్తారా? 
సీఈఓ: ఎవరి పేరైనా చేర్చడాన్ని అభ్యంతరం తెలుపుతూ ఫారం–7 దాఖలైతే సంబంధిత ఓటరు ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ వెళ్తుంది. విచారణకు పిలుస్తారు. అందుకే ఓటును ఫోన్‌తో లింక్‌ చేసుకోవాలి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement