స్పేస్ టెక్ సీఈఓలతో భేటీలో మంత్రి శ్రీధర్‌బాబు
అంతరిక్ష సాంకేతికతపై దృష్టి పెడుతున్నామని వెల్లడి
హైదరాబాద్: ఐటీ, లైఫ్ సైన్సెస్, ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ రంగాల్లో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన తెలంగాణ... ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ (అంతరిక్ష సాంకేతికత)ని తమ ఆర్థిక వ్యవస్థ నాలుగో ప్రధాన వృద్ధి స్తంభంగా (ఫోర్త్ పిల్లర్) తీర్చిదిద్దేందుకు యత్నిస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. స్పేస్ టెక్ ప్రముఖ స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు శనివారం సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్‌ను ప్రపంచంలోని టాప్–5 స్పేస్–టెక్ హబ్‌లలో ఒకటిగా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సమావేశంలో మంత్రి ప్రకటించారు.
ఈ సందర్భంగా అంతరిక్ష రంగానికి చెందిన 14 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు మంత్రిని కలసి తమ సాంకేతిక ఉత్పత్తులు, సేవలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ రంగంలో మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా ఒక స్పేస్ సిటీని ఏర్పాటు చేయాలని కంపెనీల ప్రతినిధులు మంత్రిని కోరారు. దీనికి శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందిస్తూ, ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. డీఆర్‌డీవో, డీఆర్‌డీఎల్, ఆర్‌సీఐ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇస్రో కేంద్రమైన ’అడ్రి’ వంటి జాతీయ స్థాయి పరిశోధన సంస్థలు హైదరాబాద్‌లో ఉండటం, ఇక్కడి ఐఐటీ, బిట్స్ పిలానీ, ఐఐఐటీ వంటి విద్యాసంస్థలు సాంకేతిక నిపుణులను అందిస్తుండటంతో నగరానికి అంతరిక్ష రంగంలో సహజ సిద్ధమైన ఆధిక్యత లభిస్తోందని ఆయా కంపెనీల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
ఏమన్నారంటే...
» స్కైరూట్ ఏరో స్పేస్ సీఈఓ పవన్ కుమార్ మాట్లాడుతూ ‘స్కైరూట్ ఒక ఆలోచన స్థాయి నుంచి ఆర్బిటల్ లాంచ్ కంపెనీగా ఎదగడానికి తెలంగాణ అత్యుత్తమ వాతావరణాన్ని అందించింది. హైదరాబాద్ మా లాంచ్ టెక్నాలజీలను డిజైన్ చేయడానికి, నిర్మించడానికి నిలయంగా ఉంటుంది’అన్నారు.
» ధ్రువ స్పేస్ కో–¸ఫౌండర్ చైతన్య మాట్లాడుతూ ‘దక్షిణాసియాలోనే అతిపెద్ద ఉపగ్రహ తయారీ కేంద్రాల్లో ఒకదాన్ని హైదరాబాద్‌లో నిర్మిస్తున్నాం. ఇక్కడి ఇంజనీరింగ్ సామర్థ్యాలు, పరిశ్రమల పర్యావరణ వ్యవస్థ పెద్దగా ఆలోచించే ధైర్యాన్ని ఇస్తున్నాయి’అని చెప్పారు.
» కాన్ట్సెల్లీ కో–¸ఫౌండర్ అవినాశ్ మాట్లాడుతూ ‘మేము ఎల్రక్టానిక్ వార్‌ఫేర్, కౌంటర్–డ్రోన్ వ్యవస్థల్లో స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నాం’అని తెలిపారు.
» టేక్ మీ2 స్పేస్ ఈవీపీ ఆనంద్ రాజగోపాలన్ మాట్లాడుతూ ‘టేక్ మీ2 స్పేస్ ద్వారా అంతరిక్షంలో ఆర్బిటల్ డేటా సెంటర్లు నిర్మిస్తున్నాం. వ్యవసాయం, భద్రత, రక్ష ణ రంగాలకు స్వదేశీ ఆర్బిటల్ కంప్యూటింగ్, డేటా స్టోరే జ్‌ను నిర్మించడమే మా ప్రాథమిక ధ్యేయం’అన్నారు.
» కాస్మోసర్వ్ స్పేస్ సీఈఓ డాక్టర్ చిరంజీవి ఫణీంద్ర మాట్లాడుతూ అంతరిక్ష వ్యర్థాల సమస్యకు పరిష్కారంగా, రోబోటిక్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా పాత శాటిలైట్లను పట్టుకొని కక్ష్య నుంచి తొలగించే సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
» అభ్యోమ్ స్పేస్‌టెక్ ఫౌండర్ అబెదీన్ మాట్లాడుతూ నెక్స్టŠ–జనరేషన్ రీయూజబుల్ (పునర్వినియోగ) రాకెట్లు, అంతరిక్ష రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
» సన్యార్క్ స్పేస్ సీఈఓ రాఘవ మాట్లాడుతూ స్వయంప్రతిపత్తి వాహనాలు, డ్రోన్లు, రోబోటిక్స్ కోసం మిల్లీమీటర్/సెంటీమీటర్ స్థాయి కచ్చితమైన నావిగేషన్ అందించడానికి లో–ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాలను తయారు చేస్తున్నామని చెప్పారు.
» ఎక్స్ డీలింక్స్ స్పేస్ ల్యాబ్స్ సీఈఓ రూపేశ్ మాట్లాడుతూ తక్కువ వ్యయంలో, స్వదేశీ తయారీ ద్వారా అంతరిక్ష మౌలిక సదుపాయాలను వేగంగా అందించడమే మా లక్ష్యమన్నారు.
» అపోలియాన్ డైనమిక్స్ సీఈఓ జయనాథ్ మాట్లాడుతూ రేపటి ఆధునిక ఆయుధాలతో మన రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడమే తమ లక్ష్యమన్నారు.
» బ్లూజే ఏరో స్సేస్ సీఈఓ అమర్‌దీప్ గాల్లో ప్రయాణం, సరుకుల రవాణాను సాధ్యం చేసేలా పౌర, రక్షణ రంగాల విమానయాన సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
» రెడ్ బెలూన్ ఏరో స్పేస్ సీఈఓ డాక్టర్ వేంకట సాయికిరణ్ మాట్లాడుతూ ఉపగ్రహాలు, డ్రోన్లకు మధ్యంతరంగా పనిచేసే సూపర్ ప్రెజర్ బెలూన్ ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
» అండురాక్స్ సీఈఓ శ్రీ సుప్రణయి మాట్లాడుతూ పునర్వినియోగ స్పేస్ ప్లేన్లను నిర్మించడం ద్వారా మైక్రో గ్రావిటీ సహాయంతో కొత్త రకాల ఔషధాలు, ఫార్మా ఉత్పత్తుల పరిశోధనలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
» ఈవోన్ స్పేస్ ల్యాబ్స్ కో–¸ఫౌండర్ పునీత్ బడేకా మాట్లాడుతూ స్పేస్, ఏరియల్, గ్రౌండ్ అప్లికేషన్ల కోసం స్వదేశీ సాంకేతికతతో కూడిన ఈవో/ఐఆర్ ఇమేజింగ్ సొల్యూషన్లను తయారు చేస్తున్నామన్నారు.
» వస్సార్ ల్యాబ్స్ సీఈఓ నిఖిలేశ్ కుమార్ మాట్లాడుతూ తమ టెక్నాలజీ 1.5 కోట్ల మంది రైతులు, 10కి పైగా రాష్ట్రాల్లో నీటి యాజమాన్య వ్యవస్థలకు ఉపయోగపడుతోందన్నారు.


