'సర్‌' లోపభూయిష్టం | CM Revanth Reddy letter to Chief Election Commissioner On SIR | Sakshi
Sakshi News home page

'సర్‌' లోపభూయిష్టం

Aug 30 2026 4:22 AM | Updated on Aug 30 2026 4:22 AM

CM Revanth Reddy letter to Chief Election Commissioner On SIR

ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు సీఎం రేవంత్‌ లేఖ

అభ్యంతరాలు, నోటీసులకు సమాధానమిచ్చే గడువులను పొడిగించాలి

73.39 లక్షల మంది ఓటర్లను ఏఎస్‌డీడీ లిస్ట్‌లో పెట్టడం ఆందోళనకరం 

శాశ్వత, తాత్కాలిక వలసల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేకపోయారు 

మరో 92.86లక్షల మంది ఓటర్లకు నోటీసులు 

వీరు ఆధారాలు చూపించుకోకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం

సర్‌లో చట్టబద్ధమైన నోటీసు మెకానిజమ్‌ లేదు. వలస వెళ్లిన కేటగిరీ కింద ఓట్లను తొలగించే ముందు ఓటర్లకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వడం లేదు. వ్యత్యాసాలు కలిగిన, లింక్‌ కాని ఓటర్లకు మాత్రమే నోటీసులు ఇస్తున్నారు. మళ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఓటేయడానికి పోతేనే తమ ఓటు పోయిందనే నిజం ఓటరుకు తెలుస్తుంది.  

సాక్షి, హైదరాబాద్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్‌)– 2026 ప్రక్రియ లోపభూయిష్టంగా తయారైందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. గత జూన్‌ 10 నాటికి రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లుండగా, 73.39 లక్షల (21.7%) మంది ఓటర్లను ఆచూకీ లేని/గైర్హాజరీలో ఉన్న/మరణించిన/డూప్లికేట్‌ (ఏఎస్‌డీడీ) ఓటర్లుగా గుర్తించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వీరిలో 45.19 లక్షల (62%) మంది ఓటర్లను  ఏ ప్రాతిపదికన శాశ్వతంగా గైర్హాజరీ(వలస)లో ఉన్న ఓటర్లుగా వర్గీకరించారని ప్రశ్నించారు. 2.65 కోట్ల ఎన్యూమరేషన్‌ ఫారాలను డిజిటలైజ్‌ చేయగా, 60.50లక్షల మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు, 32.36లక్షల మంది అన్‌మ్యాప్డ్‌ ఓటర్లున్నట్టు నిర్ధారించినట్టు గుర్తు చేశారు. ఈ రెండు కేటగిరీలు కలిపి మొత్తం 92.86లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలోని దాదాపు మూడో వంతు ఓటర్లు తమ ఓటు హక్కును నిలబెట్టుకోవడానికి మళ్లీ ఆధారాలు చూపించుకోవాల్సిన పరిస్థితి లేదా ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌కు శనివారం ఆయన లేఖ రాశారు.  

సీఎం ఎత్తిచూపిన లోపాలు.. 
తాత్కాలిక, శాశ్వత వలసల మధ్య తేడా చూపలేదు. బీఎల్‌ఓ వచ్చిన సమయంలో తాత్కాలికంగా ఇంట్లో లేని ఓటర్లనూ శాశ్వతంగా వల స వెళ్లిన వారిగానే పరిగణించారు. 
⇒ ఇల్లు మారిన ఓటర్లకు కొత్త చిరునామాలో ఓటు నమోదు చేసుకోవడానికి (ఫారం–6) ఎలాంటి సహాయం అందించడం లేదు, కానీ పాత ప్రదేశంలో వారి ఓటును తొలగిస్తున్నారు. 
⇒ చట్టబద్ధమైన నోటీసు మెకానిజమ్‌ లేదు. వలస వెళ్లిన కేటగిరీ కింద ఓట్లను తొలగించే ముందు ఓటర్లకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వడం లేదు. వ్యత్యాసాలు కలిగిన, లింక్‌ కాని ఓటర్లకు మాత్రమే నోటీసులు ఇస్తున్నారు. మళ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఓటేయడానికి పోతేనే తమ ఓటు పోయిందనే నిజం ఓటరుకు తెలుస్తుంది. 
⇒ రాష్ట్రంలోని మూడో వంతు ఓటర్లు హైదరాబాద్, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉండగా, 58.6% ఏఎస్డీడీ ఓటర్లు, 41.9% నోటీసులు అందుకునే ఓటర్లు ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నారు. కొద్ది వందల మీటర్ల దూరంలో ఇల్లు మారినా పోలింగ్‌ స్టేషన్‌ మారుతుందని, వివాహం లేదా ఉద్యోగం కారణంగా ఇల్లు మారడం సాధారణమని, దానిని ఓటు హక్కు రద్దుకు కారణం చేయకూడదు. 

పూర్తిగా సహకరిస్తాం... 
అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరూ ఓటు హక్కు కోల్పోకూడదు, అర్హత లేని ఏ ఒక్కరూ జాబితాలో ఉండకూడదు అనేదే సర్‌ ప్రక్రియ లక్ష్యమని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. హెల్ప్‌డెస్‌్కల నిర్వహణ, గ్రామసభలు, వార్డు సమావేశాల ఏర్పాటు, ప్రచారం, అవగాహన కార్యక్రమాలు, లాజిస్టికల్‌ మద్దతుతో సహా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్నికల సంఘానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. 

సీఈసీకి రేవంత్‌ చేసిన ప్రతిపాదనలివీ..  
1. అభ్యంతరాలు, దరఖాస్తుల గడువు పొడిగించాలి. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలతోపాటు కొత్త ఓటర్ల నమోదు, వివరాల దిద్దుబాటుకు దరఖాస్తుల గడువు సెపె్టంబర్‌ 16 వరకు నెల రోజులు మాత్రమే ఇచ్చారు. సగం గడువు ముగిసింది. తుది జాబితా అక్టోబర్‌ 19న విడుదల కానుంది. ఓటర్లు తమ పేర్లు చెక్‌ చేసుకుని ఫారం–6 సమర్పించడానికి మరో 4 వారాల పాటు గడువును పొడిగించాలి. సమీప భవిష్యత్తులో తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు లేవు కాబట్టి ఈ సవరణ సులభమే. 
2. ఈసీఐ మాన్యువల్‌ ప్రకారం ఓటర్ల ముసాయిదా జాబితాను గ్రామసభల్లో, నగరాల్లో వార్డు కమిటీ సమావేశాల్లో కనీసం రెండుసార్లు బిగ్గరగా చదివి వినిపించేలా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించాలి. 
3. నోటీసులకు జవాబు ఇవ్వడానికి ఇస్తున్న వారం వ్యవధి సరిపోదు. ముఖ్యంగా కూలీలు, వలస కార్మికులు, వృద్ధులకు వేరే ప్రాంతాల నుంచి ధ్రువపత్రాలు తెచ్చుకోవడానికి 3 నుంచి 4 వారాల వ్యవధి ఇవ్వాలి. 

4. పట్టణ ప్రాంతాల్లో, బూత్‌ స్థాయిలో హెల్ప్‌డెస్‌్కలను ఏర్పాటు చేసి ఓటర్లకు అవసరమైన సర్టిఫికెట్లు పొందడంలో, అధికారుల నుంచి డాక్యుమెంట్లు సమర్పించడంలో నేరుగా సహాయం అందించాలి. 
5. 2026 జూలై 25న జారీ చేసిన జీవో 172 కింద ఇచ్చిన ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ను ఈసీ తిరస్కరించడంతో పట్టణ ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మండల స్థాయిలో త్వరగా లభించే పత్రాలను అనుమతిస్తూ స్పష్టమైన జాబితాను ప్రకటించాలి. 
6. హైదరాబాద్‌లోని ఒక్కో నియోజకవర్గంలో 78వేలకు పైగా ఓటర్లకు నోటీసులు ఇస్తున్నారు. అధికారుల ముందు ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా హాజరుకావడం అసాధ్యం. కాబట్టి అదనపు ఈఆర్‌వోలను నియమించి, ఈఆర్‌వో స్థాయి కంటే కిందనే వికేంద్రీకృత పద్ధతిలో సమయం కేటాయించి విచారణ జరపాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement