శ్రీశైలం మల్లన్న దర్శనం.. గొప్ప అనుభూతి
శ్రీశైలం టెంపుల్ : జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామివారిని, శక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకోవడం తమ అదృష్టం, గొప్ప అనుభూతి అని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. శుక్రవారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దర్శనార్థం కుటుంబంతో కలిసి శ్రీశైలం చేరుకున్న ఆయనకు భ్రమరాంబ అతిథి గృహం వద్ద రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి ఘనస్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారికి అభిషేకం, భ్రమరాంబదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అంతకముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ ’ఆంధ్రప్రదేశ్ పౌరులకు నమస్కారం.. అందరూ బాగున్నారా’ అని తెలుగులో సంబోధించారు. శనివారం ఉదయం కూడా మరో సారి స్వామి అమ్మవార్లను భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ దంపతులు దర్శించుకుంటారని దేవస్థాన అధికారులు తెలిపారు.