ఇవ్వకుంటే ఈసీ కార్యాలయం వద్ద నిరసనకు దిగుతాం
టీఎంసీ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ హెచ్చరిక
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)ఎస్‌ఐఆర్) సర్వే సమయంలో తొలగించిన 1.31 కోట్ల ఓటర్లకు సంబంధించిన జాబితా ఇవ్వాలని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్‌ను కోరుతామని టీఎంసీ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ చెప్పారు.
ఈ నెల 31వ తేదీన జ్ఞానేశ్‌ను కలుస్తామని తెలిపారు. నిర్ణీత సమయంలోగా ఆ జాబితా ఇవ్వాలని అడుగుతామని, తమ డిమాండ్ నెరవేరని పక్షంలో ఢిల్లీలోని ఈసీ కార్యాలయం ఎదుట ఘెరావ్ చేపడతామని హెచ్చరించారు. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించినట్లు తేలితే ఢిల్లీలోనే నిరసనలను కొనసాగిస్తామన్నారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో తొలగించిన ఓటర్ల జాబితాను ఈసీ వెల్లడించక పోవడానికి కారణాలేమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ సమయంలో కోటిన్నర మంది ఓటర్ల పేర్ల తొలగింపు బీజేపీ టార్గెట్ అని దీనర్థమా అని బెనర్జీ వ్యాఖ్యానించారు. ముసాయిదా జాబితా నుంచి తొలగింపునకు గురైన 58.20 లక్షల ఓటర్లలో రోహింగ్యాలు, బంగ్లాదేశీ వలసదారులు ఎందరున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎస్‌ఐఆర్ అనంతరం రాష్ట్రంలోని మొత్తం 10.05 కోట్ల జనాభాలో 5.79 శాతం జనాభా పేర్లను మాత్రమే తొలగించడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎస్‌ఐఆర్ చేపట్టిన రాష్ట్రాల్లో ఇదే అత్యంత తక్కువని ఎత్తి చూపారు. పశ్చిమబెంగాల్‌లో 50 శాతం వరకు ఓటర్లను గుర్తించలేకపోయినట్లు ప్రకటించిన ఈసీ..89 శాతం మేర ఓటర్ల వివరాలను ఎలా ప్రచురించిందని నిలదీశారు. దీనిపై ఈసీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.
ముఖ్యమైన వ్యక్తులను సైతం చనిపోయిన జాబితాలో ఈసీ చేర్చిందన్నారు. ఇటువంటి ఉదాహరణలెన్నో ఉన్నాయని, వీటిపై ఈసీపై కేసు ఎందుకు నమోదు చేయకూడదు? అంటూ బెనర్జీ నిలదీశారు. మీరు ఎస్‌ఐఆర్‌తో గెలవాలనుకుంటే, ప్రజలు ఎఫ్‌ఐఆర్‌తో బదులిస్తారని ఆయన ఈసీనుద్దేశించి వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌తో సరిహద్దులు కలిగిన త్రిపుర, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఎస్‌ఐఆర్ ఎందుకు చేపట్టడం లేదని ఈసీని అడిగారు.


