సర్‌కు ఆటంకం కలిగిస్తే ఊరుకోం  | SupremeCourt says it would not allow any impediment to the SIR | Sakshi
Sakshi News home page

సర్‌కు ఆటంకం కలిగిస్తే ఊరుకోం 

Feb 10 2026 4:21 AM | Updated on Feb 10 2026 4:21 AM

SupremeCourt says it would not allow any impediment to the SIR

బెంగాల్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరిక

జాబితా పూర్తికి మరో వారం గడువు

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లో ఓటరు జాబితా సర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియ విషయంలో ఎన్నికల కమిషన్‌(ఈసీ), రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. సర్‌ ప్రక్రియకు అవరోధాలు కలిగించవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అదే సమయంలో, ప్రక్రియను పూర్తి చేసేందుకు ఈసీ గడువును మరో వారంపాటు పొడిగించింది. 

ఈ నెల 4వ తేదీన జరిగిన విచారణకు సీఎం మమతా బెనర్జీ స్వయంగా హాజరై వాదనలు వినిపించడం తెల్సిందే. ‘వాట్సాప్‌ ద్వారా కాకుండా ఈసీ అధికారికంగా ఆదేశాలు జారీ చేయాలి. వాటిని ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. మైక్రో అబ్జర్వర్లను తొలగించాలి’అని కోరారు. వీటిపై సుప్రీంకోర్టు కేంద్రం, ఈసీలకు నోటీసులు జారీ చేసింది. సోమవారం వీటిపై ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

 ‘సర్‌ విషయంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తాం. ఈ విషయంలో ఎటువంటి అడ్డంకులను కలిగించం. ఇందులో మావైఖరి సుస్పష్టం’అని సీజేఐ తెలిపారు. సర్‌ కార్యక్రమం షెడ్యూల్‌ ప్రకారం కొనసాగాల్సిందేనని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అవగాహన లేని అధికారులను ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారు(ఈఆర్‌వో)లను నియమించిందంటూ ఈసీ తరఫున సీనియర్‌ లాయర్‌ డీఎస్‌ నాయుడు అభ్యంతరం తెలపగా మైక్రో అబ్జర్వర్లు ఏకపక్షంగా ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారంటూ బెంగాల్‌ ప్రభుత్వం తరఫున న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

ఈ నెల 14వ తేదీకల్లా పూర్తి చేసి, తుది జాబితా ప్రకటించాల్సి ఉందంటూ ఆయన..స్వల్ప కారణాలు చూపి 1.68 లక్షల పేర్లను తొలగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో, సంబంధిత దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేయడానికి, తుది జాబితాకు గడువును మరో ఒక వారం పాటు గడువు పొడిగిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. 

వెరిఫికేషన్‌ అనంతరం విడుదల చేసే ఫలితాలను తాము తప్పనిసరిగా పరిశీలిస్తామని, అవసరమైన పక్షంలో జోక్యం చేసుకుంటామని సీజేఐ ప్రకటించారు. ఓటర్ల తుది జాబితాపై అంతిమ నిర్ణయం ఎన్నికల అధికారులకే ఉండాలని స్పష్టం చేసింది. బెంగాల్‌ ప్రభుత్వం అందజేస్తామంటున్న 8,505 మంది అధికారులకు ఎలాంటి బాధ్యతలను అప్పగించాలో ఈసీయే నిర్ణయిస్తుందని కూడా తెలిపింది. ఓటర్లకు ఈసీ విడుదల చేసిన నోటీసులను కొందరు తగులబెట్టారని లాయర్‌ డీఎస్‌ నాయుడు తెలపగా, ధర్మాసనం సీరియస్‌గా తీసుకుంది. ఇటువంటి ఘటనలపై అఫిడవిట్‌ సమరి్పంచాల్సిందిగా బెంగాల్‌ డీజీపీని ఆదేశించింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement