కుక్కలా మొరుగుతూ, నడుస్తూ, కరుస్తూ.. | Rabies triggers disturbing behaviour in Banaskantha dist | Sakshi
Sakshi News home page

కుక్కలా మొరుగుతూ, నడుస్తూ, కరుస్తూ..

Feb 1 2026 5:40 AM | Updated on Feb 1 2026 5:40 AM

Rabies triggers disturbing behaviour in Banaskantha dist

రేబిస్‌ లక్షణాలతో యువకుడి వింత ప్రవర్తన

పాలన్‌పూర్‌: గుజరాత్‌లో కుక్కకాటుతో రేబిస్‌ వ్యాధి బారిన పడిన 27 ఏళ్ల యువకుడు వింతగా ప్రవర్తిస్తున్నాడు. చేతులు నేలపై ఆన్చి శునకంలా నాలుగు పాదాలపై నడుస్తున్నాడు. అచ్చు కుక్కలా మొరుగుతున్నాడని ప్రభుత్వాస్పత్రి వైద్యులు తెలిపారు. బనస్కాంథ జిల్లాలోని పాలన్‌పూర్‌ పరిధిలోని ఈ ఘటన జరిగింది. నరసాల్‌ గ్రామానికి చెందిన దేవా డుంగ్రీ అనే వ్యక్తిని మూడు నెలల క్రితం ఒక శునకం కరిచింది. దీంతో ఆ శునకంనుంచి ఇతని శరీరంలోకి ప్రాణాంతక రేబిస్‌ వైరస్‌ చేరింది. 

వారాలు గడిచే కొద్దీ వ్యాధి ముదిరి ఇతన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. కుక్కలా అరుస్తూ, కరుస్తూ, నడుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాడు. దీంతో గ్రామస్థులు ఇతడిని బంధించి ఆస్పత్రికి అప్పజెప్పారు. ఆస్పత్రిలో చేర్పించాక అతని పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఇతని విపరీత వైఖరి చూసి వెంటనే ఏకాంతంగా ఉండే ఐసొలేషన్‌ గదికి మార్చారు.

 ఆ గది కిటీకి ఇనుప చువ్వలను బలంగా కొరుకుతూ అరుస్తున్న వీడియో ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అదుపు తప్పుతున్న ఇతడిని శాంతింపజేసేందుకు ఆస్పత్రి వర్గాలు వెంటనే పోలీసులు, అటవీ శాఖ సిబ్బందిని రప్పించారు. వాళ్లు జంతువులకు ఇచ్చే మత్తు మందును మెష్, వల సాయంతో బలంగా అదిమిపట్టి ఎలాగోలా ఇతనికి ఇచ్చి నిద్రపుచ్చారు. ఇతను బతికే అవకాశాలు అత్యల్పంగా ఉన్నాయని వైద్యులు తేల్చిచెప్పారు. 

కుక్క కరిచిన వెంటనే యాంటీ–రేబిస్‌ వ్యాక్సిన్‌ తీసుకోకపోవడంతో ఇతని ప్రాణాలమీదకొచ్చిందని వైద్యులు తేల్చిచెప్పారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ గణాంకాల ప్రకారం ప్రాణాంతక వైరస్‌లలో రేబిస్‌ ఒకటి. రేబిస్‌ మానవశరీరంలోకి వ్యాపించాక మెదడు, వెన్నపూస కణాలను అత్యంత ప్రభావితం చేస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థ అదుపుతప్పి చివరకు ప్రాణాలు పోతాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement