హార్మూజ్‌ వద్ద అమెరికా భయానక దాడులు.. ఇరాన్‌కు భారీ నష్టం? | US Hits Iran Missiles Near Hormuz With Bunker Buster Bombs Amid Iran Israel Tensions, More Details Inside | Sakshi
Sakshi News home page

హార్మూజ్‌ వద్ద అమెరికా భయానక దాడులు.. ఇరాన్‌కు భారీ నష్టం?

Mar 18 2026 8:00 AM | Updated on Mar 18 2026 11:43 AM

US Hits Iran Missiles Near Hormuz With Bunker Buster Bombs

వాషింగ్టన్‌: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఇరాన్‌ సైతం ప్రతిదాడులు చేస్తోంది. ఇలాంటి తరుణంలో హార్మూజ్‌ జలసంధి విషయంలో అమెరికా ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. జలసంధిని తిరిగి తెరిచేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ కీలక జలమార్గం సమీపంలోని ఇరాన్ క్షిపణి స్థావరాలపై అమెరికా సైన్యం దాడులు చేసింది.

అమెరికా సైన్యం తాజాగా హార్మూజ్‌ జలసంధి వద్ద ఉన్న ఇరాన్‌ క్షిపణి స్థావరాలపై అత్యంత శక్తివంతమైన బాంబులతో దాడి చేసింది. జలసంధి సమీపంలోని ఇరాన్ తీరప్రాంతంలో పటిష్టంగా ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలపై పలు 5,000-పౌండ్ల డీప్ పెనెట్రేటర్ బాంబులను ప్రయోగించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ స్థావరాల్లోని ఇరాన్ నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణులు జలసంధిలో అంతర్జాతీయ నౌకాయానానికి ముప్పుగా పరిణమించాయి అని చెప్పుకొచ్చింది.

అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంపై చేస్తున్న యుద్ధానికి ప్రతీకారంగా, ప్రపంచ చమురులో ఐదో వంతు ప్రవహించే హార్మూజ్‌ జలసంధిని ఇరాన్ మూసివేసిన తర్వాత ఈ బాంబు దాడి జరిగింది. ఈ దిగ్బంధనం సముద్ర రవాణాను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో, ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదలకు కారణమైన విషయం తెలిసిందే. అయితే, జలసంధిపై ఇరాన్‌ ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేసింది. యుద్ధంలో పాల్గొనని దేశాలకు చమురు సరఫరా చేసే నౌకలకు అనుమతిస్తున్నట్టు తెలిపింది.

శక్తివంతమైన బాంబు..
2022లో ఎయిర్ ఫోర్స్ టైమ్స్ నివేదిక ప్రకారం, బంకర్ బస్టర్ అని పిలవబడే ఈ బాంబుల ఖరీదు సుమారు $288,000. అయినప్పటికీ, గత సంవత్సరం ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా వేసిన 30,000 పౌండ్ల (13,600 కిలోల) బాంబుల కంటే ఇవి తక్కువ శక్తివంతమైనవి. ఇవి సాధారణ బాంబులతో ధ్వంసం చేయలేని భూగర్భ బంకర్లు, కాంక్రీట్ కట్టడాలు వంటి గట్టి నిర్మాణాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు.

బాంబుల లక్షణాలు

  • బరువు: సుమారు 2,267 కిలోలు (5,000 పౌండ్లు).

  • రకం: బంకర్ బస్టర్, అంటే భూగర్భంలో ఉన్న గట్టి నిర్మాణాలను ఛేదించే బాంబు.

  • ఉపయోగం: క్షిపణి సైలోలు, కమాండ్ సెంటర్లు, బలమైన రక్షణ గల స్థావరాలను ధ్వంసం చేయడం.

  • వాహక విమానాలు: భారీ బాంబర్లు లేదా ప్రత్యేకంగా సిద్ధం చేసిన యుద్ధ విమానాలు.

ట్రంప్‌ హెచ్చరిక..

మరోవైపు..నాటో మద్దతు లేకపోయినా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి త్వరలోనే భద్రతలోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్తితుల్లో కూడా ఎక్కువ సమయం పట్టదు అని తెలిపారు. ఈ విషయంలో తమకు ఎవరి సాయం అవసరం లేదని, ఒంటరిగానే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. హార్మూజ్​ భద్రతపై అమెరికా చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఇరాన్ తీర ప్రాంతాలపై అమెరికా దాడులు తీవ్రతరం అయ్యాయని ట్రంప్ వెల్లడించారు. పశ్చిమాసియా దేశాలు.. ముఖ్యంగా ఇజ్రాయెల్ అమెరికాకు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు. ఈ సహకారం భద్రతా చర్యలకు కీలకమని తెలిపారు. అమెరికా సైన్యం రంగం ప్రవేశం చేస్తే వియత్నాం తరహా యుద్ధం జరుగుతుందని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి చేసిన హెచ్చరికలను కూడా ట్రంప్ తోసిపుచ్చారు. తనకు ఎలాంటి భయం లేదని, దేనికీ కూడా భయపడేది లేదని స్పష్టం చేశారు

Advertisement
 
Advertisement
Advertisement