పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోరు ఆరంభంలోనే రసవత్తరంగా మారుతోంది. 2026 ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న ఎన్నికలకు గాను అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) మొత్తం 294 స్థానాలకు గాను 291 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన 3 స్థానాలను డార్జిలింగ్ ప్రాంతంలో అనిత్ థాపా నేతృత్వంలోని BGPM పార్టీకి కేటాయించారు. ఈ మేరకు అభ్యర్థుల వివరాలను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. బీజేపీ10 మంది మహిళలకు చోటివ్వగా టీఎంసీ లిస్టులో 52 మంది మహిళలు ఉన్నారు.
సై అంటే సై అంటున్న దీదీ
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తన నియోజకవర్గమైన భవానీపూర్ నుండి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా భావిస్తున్న సువేందు అధికారిపై తలపడేందుకు దీదీ సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓడించిన సువేందు అధికారిపై ఆమె మరోసారి నేరుగా ఢీకొంటుండటం విశేషం. భవానీపూర్, నందిగ్రామ్ రెండింటి నుండి సువేందును బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది.
గెలుపు మాదే దీదీ ధీమా: వరుసగా నాలుగోసారి అధికారాన్ని దక్కించుకుంటామని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి తాము 226 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా మమతా బెనర్జీ ఎస్ఐఆర్‌పై ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని బీజేపీని తిప్పికొట్టి, తృణమూల్‌కు ఓటు వేసి గెలిపించాలని దీదీ విజ్ఞప్తి చేశారు. బెంగాల్ అస్థిత్వం కోసం జరిగే పోరు ఇది అని మమతా వ్యాఖ్యానించారు.
కాగా 2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓడిపోయిన తర్వాత, మమత భవానీపూర్ ఉప ఎన్నిక ద్వారా అసెంబ్లీలోకి ప్రవేశించారు. 2021లో TMC 213 సీట్లు సాధించగా, బీజేపీ 77 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఈ సారి ఎలామైనా మమతను ఓడించి బెంగాల్‌లో పాగా వేయాలని బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న ఈ పోరులో ఇప్పటికే బీజేపీ 144 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.
2021లో ఇలా
2021 అసెంబ్లీ ఎన్నికలలో, టీఎంసీ 213 స్థానాలను గెలుచుకుని హ్యాట్రిక్ గెలుపు సాధించింది. నందిగ్రామ్‌లో మమత ఓడిపోయినప్పటికీ టీఎంసీ తన స్థానాల సంఖ్యను రెండు పెంచుకుంది. 2016లో కేవలం మూడు స్థానాలకు పరిమితమైన బీజేపీ 2021 లో 77 స్థానాలకు పుంజుకుని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ప్రచారంలోదూకుడుతోపాటు, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్‌ల వైఫల్యం బీజేపీకి కలిసి వచ్చింది.


