ఇరాన్‌పై అమెరికా-ఇజ్రయెల్ దాడులతో మొదలైన యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ దశలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాల్పుల విరమణ ప్రతిపాదను మోజ్తబా తిరస్కరించినట్టు తెలుస్తోంది.
అమెరికాతో ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి లేదా కాల్పుల విరమణకు సంబంధించి మధ్యవర్తి దేశాలు పంపిన ప్రతిపాదనలను ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీ తిరస్కరించారని సమాచారం. అమెరికా ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే విషయంలో ఖమేనీ చాలా కఠినంగా ఉన్నారని ఇరాన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ కాళ్లమీద పడి ఓటమిని అంగీకరించి, పరిహారం చెల్లించే వరకు శాంతి అనే మాటలు తావులేదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్ ప్రకటన : ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ?!
ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీ, అతని కుటుంబ సభ్యులు దారుణంగా హత్య గావించబడిన తరువాత ఆయన కుమారుడు మోజ్తబా సుప్రీంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా ఇరాన్ ఎప్పటికీ వెనకడుగు వేయదని, పూర్తి శక్తితో ప్రతిఘటిస్తుందని, దివంగత అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి మాత్రమే కాకుండా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి పౌరుడికి ప్రతీకారం తీర్చుకుంటుందని, శత్రువు మూల్యం చెల్లించాల్సిందేనని మోజ్తాబా ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొండి వైఖరి
మరోవైపు, ఇరాన్ యుద్ధాన్ని ముగించడానికి దౌత్యపరమైన చర్చలు ప్రారంభించాలని మధ్యప్రాచ్య మిత్రదేశాలు చేస్తున్న ప్రయత్నాలను ట్రంప్ ప్రభుత్వం తోసిపుచ్చినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
ఇదీ చదవండి: బంగారం, డాలర్ కాదు : దీని దూకుడు మామూలుగా లేదు!
ఖమేనీ మాస్కో ఆసుపత్రిలో కోలుకుంటున్నారా?
ఫిబ్రవరి 28న తన తండ్రిని బలిగొన్న అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడిలో తీవ్రంగా గాయపడిన 56 ఏళ్ల ఖమేనీని వైద్య చికిత్స కోసం రష్యాకు తరలించి ఉండవచ్చని అంచనాలు వెలువడ్డాయి.కానీ అంచనాలను ధృవీకరించడానికి గానీ, ఖండించడానికి గానీ రష్యా నిరాకరించింది.


