ఇరాన్ పై అమెరికా- ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న మొదలు పెట్టిన దాడులు 18వ రోజుకు చేరుకున్నాయి. సాధారణంగా యుద్ధం, లేదా సంక్షోభ సమయాల్లో చమురు, బంగారం, అమెరికన్ డాలర్ బాగా పెరుగుతాయి. అలాగే స్టాక్‌మార్కెట్లు కూడా పెట్టుబడుదారుల ప్యానిక్ అమ్మకాలతో కుప్పకూలుతాయి. కానీ ప్రస్తుత ఇరాన్ యుద్ధ సమయంలో మాత్రం మార్కెట్ సమీకరణాలు మారుతున్నాయి. బంగారం, డాలర్‌ను మించి దూసుకుపోతోంది. అదేంటో తెలుసుకుందాం ఈ కథనంలో
మారుతున్న పెట్టుబడి ధోరణికి అనుగుణంగా ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుండి బిట్‌కాయిన్ విలువ 74 వేల డాలర్ల మార్కును దాటింది. అంటే సుమారు 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. బంగారం ఔన్సుకు దాదాపు 5,035 డాలర్ల వద్ద ఉంది. గతంలో బిట్‌కాయిన్ పెట్టుబడులు చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారంగా భావించేవారు. కానీ ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య, ఇది సేఫ్‌గా మారుతుండటం విశేషం.
బిట్ కాయన్‌పై ఎందుకింత ఆసక్తి?
INRGrid స్టేబుల్ వ్యవస్థాపకుడు అనుజ్ చౌదరి అభిప్రాయం ప్రకారం.. బిట్‌కాయిన్‌ను బ్యాంకులు లేదా ప్రభుత్వాలతో సంబంధం లేకుండా తక్షణమే సరిహద్దులు దాటించి తరలించ వచ్చు. యుద్ధం వంటి సమయాల్లో బ్యాంకింగ్ వ్యవస్థలు స్తంభించినా, బిట్‌కాయిన్ నియంత్రణ పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉంటుంది. బంగారం లేదా సాంప్రదాయ మార్కెట్‌ల వలె కాకుండా, బిట్‌కాయిన్ 24/7 ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా సంప్రదాయ మార్కెట్‌లు మూసి ఉన్నప్పుడు, భౌగోళిక రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పెట్టుబడిదారులు తక్షణమే స్పందించడానికి వీలు కల్పిస్తుంది. వేగంగా మారుతున్న ప్రపంచ సంఘటనల సమయంలో ఇదొక ప్రాధాన్య సాధనంగా నిలుస్తుంది.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్ ప్రకటన : ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ?!
ఇన్వెస్ట్‌పీడియా నివేదిక ప్రకారం, ఇరాన్‌పై దాడులు మొదలైనప్పటి నుంచీ ఐషేర్స్ బిట్‌కాయిన్ ట్రస్ట్ ,ఫిడిలిటీ వైజ్ ఆరిజిన్ బిట్‌కాయిన్ ఫండ్‌తో సహా బిట్‌కాయిన్‌కు 1.1 బిలియన్ డాలర్లకు మించి పెట్టుబడులు వచ్చాయంటేనే బిట్‌కాయన్ క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.
బిట్‌కాయిన్ నిజంగా సురక్షితమేనా?
ఇరాన్ యుద్ధం సద్దుమణిగే సూచనలు కనిపించకపోవడంతో, కొంతమంది పెట్టుబడిదారులు క్రిప్టో పెట్టుబడుల వైపు మళ్లవచ్చు. అయితే, ఒక రక్షణ సాధనంగా (హెడ్జ్‌గా) బిట్‌కాయిన్‌ను బంగారంతో పోల్చడంపై నిపుణుల అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నాయి. బిట్ కాయిన్‌లో పెట్టుబడులు అంత సులువు కాదు. దీనిపై నిపుణులు ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బంగారం భౌతికంగా అందుబాటులో ఉంటుంది కానీ దాన్ని జప్తు చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో బిట్‌కాయిన్ డిజిటల్‌గా ఉండటం వల్ల దాన్ని ఎవరూ సీజ్ చేయలేరు. కానీ అయితే, దీని ధరల్లో ఉండే తీవ్రమైన హెచ్చుతగ్గుల (Volatility) చాలా తీవ్ర స్థాయిల్లో ఉంటుంది. అందుకే లాభనష్టాలను బేరీజు వేసుకోనొ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం, లేదా కోవిడ్-19 సంక్షోభం వంటి భౌగోళిక-రాజకీయ సంక్షోభాల సమయంలో క్రిప్టోకరెన్సీ పెరగవచ్చు. అయినా వ్యాపారులు/ పెట్టుబడిదారులు బిట్‌కాయిన్‌ను నమ్మదగిన సురక్షిత ఆశ్రయ ఆస్తిగా పరిగణించ కూడదని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు కేంద్ర బ్యాంకులు బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేసే అవకాశం లేనందున, రిజర్వ్ ఆస్తిగా దాని పాత్ర పరిమితం. మరోవైపు, గత కొన్నేళ్లుగా అన్ని ప్రధాన కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుకున్నాయనేది గమనించాలి.


