వదినార్ (గుజరాత్): పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ భారత్‌కు ఊరటనిచ్చే వార్త వినిపించింది. దేశంలో ఎల్‌పీజీ కొరత వెంటాడుతున్న తరుణంలో 47,000 మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో కూడిన ‘నందా దేవి’ నౌక సురక్షితంగా గుజరాత్‌లోని వదినార్ పోర్టుకు చేరుకుంది. ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ జలసంధిని దాటుకుని భారత్ చేరుకున్న రెండో భారీ ఎల్‌పీజీ నౌక ఇది.
నౌకాదళాల పహారాలో ప్రయాణం
యుద్ధ వాతావరణం నడుమ అత్యంత ఉద్రిక్తత నెలకొన్న ప్రాంతం గుండా ఈ నౌక ప్రయాణించింది. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖతో పాటు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న ప్రత్యేక చొరవతో ఇది సాధ్యమైంది. భారత నౌకాదళం, ఇరానియన్ నేవీలు సంయుక్తంగా ఈ నౌకకు రక్షణ కవచంలా నిలిచి ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ను దాటించాయి.
తీరనున్న కొరత
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభం దృష్ట్యా, ఈ 47,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ భారత్‌కు ఎంతో కీలకం కానుంది. వదినార్ నుంచి ఈ నౌక కాండ్లా పోర్టుకు వెళ్లనుందని, అక్కడ గ్యాస్‌ను అన్‌లోడ్ చేస్తారని అధికారులు తెలిపారు. ‘ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. భవిష్యత్తులో కూడా దేశ అవసరాలకు తగ్గట్లుగా ఎల్‌పీజీ సరఫరాను కొనసాగిస్తాం’ అని నందా దేవి నౌక చీఫ్ ఆఫీసర్ హర్షం వ్యక్తం చేశారు.
వరుసగా చేరుతున్న నౌకలు
ఇంతకుముందే 40,000 మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో ‘శివాలిక్’ అనే నౌక ముంద్రా పోర్టుకు చేరుకుంది. ఇందులో 20,000 టన్నులను ముంద్రాలో, మిగిలిన 20,000 టన్నులను మంగళూరులో అన్‌లోడ్ చేయనున్నారు. వీటితో పాటు యూఏఈ నుంచి 81,000 టన్నుల ముడి చమురుతో వస్తున్న ‘జగ్ లాడ్కి’ నౌక కూడా భారత్ వైపు వస్తోంది. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో భారత జెండాతో ఉన్న మరో 22 నౌకలు ప్రయాణిస్తున్నాయి. అందులోని 611 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని, గత 24 గంటల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు. ఈ వరుస సరఫరాలతో దేశంలో గ్యాస్, ఇంధన కొరత తీరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.


